| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అని పలుకుచు నొయ్యనొయ్యన తొలంగం జనిన నద్దురాత్ముఁ డతిభయంకరంబుగా జంకించి యమ్మగువం బట్టికొని గగనంబున కెగసి లంకాపురాభిముఖుండై యరుగఁ దొడంగిన నయ్యింతి యెంతయుం దలరి యిట్లని విలాపంబు సేసె. | 342 |
| ఉ. |
‘దేవతలార! యో ధరణిదేవతలార! జగత్త్రయోన్నతుం డై వెలుఁగొందు రామునికులాంగన జానకి నేను; నన్ను మో హావిలుఁ డొక్క రక్కసుఁ డనర్గళుఁడై కొనిపోయెడుం; గృపం గావరె! పుణ్యమున్ యశముఁ గైకొనరే! యిదె మీకు మ్రొక్కెదన్’. |
343 |
| క. |
అని యేడ్వఁగఁ దద్వచనము | లనఘుఁడు గిరిగహ్వరాంతరాలయగతుఁడై విని యరుణసుతుఁడు తేజో | ఘనుఁడు జటాయు వను పక్షి కారుణ్యమునన్. |
344 |
| క. |
ఎఱకలు గల కులశైలము | తెఱఁగు మెయిన్ రయము మెఱయ దివికి నెగసి బె ట్టుఱుము జలధరముక్రియ ను | క్కఱి భువనం బెల్ల నద్రువ నార్చుచుఁ గడిమిన్. |
345 |
| ఉ. |
‘ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికిఁ బట్టినాఁడ? వం భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణముఁ గొందు నింక; ను గ్రారివిభేదివిక్రము జటాయు నెఱుంగవె?’ యంచు దర్పదు ర్వారుఁడు వీఁకఁ దాఁకె సురవర్గవిఘాతకు నద్దశాననున్. |
346 |
| మ. |
ఘనపక్షాహతులం బ్రకాండపరిఘాఘాతంబులం దీవ్రశా తనఖోచ్ఛేదములం బ్రదీప్తశరవేధక్రీడలం గ్రూరచం చునిపాతంబులఁ బ్రౌఢకుంతముఖవిస్ఫోటంబులం దత్ఖగేం ద్రనిశాటేంద్రుల పోరు సాధనసమత్వస్ఫూర్తి నొప్పెం గడున్. |
347 |
| చ. |
పటుతరపక్షిపక్షముఖపాదనఖప్రవిఘాతఖండిత స్ఫుటితశరీరుఁడై బహుళశోణితధారలు మేనఁ గ్రమ్మఁగాఁ దటసముపాంతనిర్గళితధాతురసారుణసాంద్రనిర్ఝరో త్కటకులశైలలీల దశకంఠుఁడు నిల్చె నకుంఠితస్థితిన్. |
348 |
| వ. | తదనంతరంబ. | 349 |
| క. |
తెఱపి గని దానవేశ్వరుఁ | డుఱక కృపాణమున నాఖగోత్తము నెఱకల్ నఱకినఁ గూలె నతం డిల | నఱవఱలై పవనహతమహాభ్రమ పోలెన్. |
350 |
| వ. | ఇట్లు జటాయువుం గూల్చి రావణుం డధికరయంబున నరుగునెడ జానకి తనకు దిక్కెవ్వరు లేమిం జేసి నిరాశయై యొక్కశైలశృంగంబునందుఁ గొందఱు వానరులు మెలంగుచున్నంగని, తన కట్టిన పుట్టంబుకొంగు సించి భూషణంబులు ముడిచి తత్ప్రదేశంబున వైచెం; బంక్తివదనుండును లంకాపురంబునకుం జని యం దశోకవనమధ్యంబున నాసుమధ్య నునిచి, తదీయరక్షణార్థంబు రాక్షసీనివహంబు నియోగించె; నిట రాఘవుండు మాయామృగంబు వధియించి మగుడం జనుదెంచువాఁడు దన కెదురుగా వచ్చు లక్ష్మణుం గని ‘రాక్షస గోచరం బైన వనంబున జానకి నొంటి యునిచి వచ్చి తప్పుసేసి’ తని పలుకుటయు, సుమిత్రానందనుండు ధాత్రీతనయ తన్ను నవమానించి పలికిన తెఱంగు సెప్పిన. | 351 |
| మధురాక్కర |
కనకమృగ మట్లు దను దవ్వుగాఁ ద్రిప్పి తెచ్చుటకు, వనజముఖి నేకతమ శూన్యవనమునయం దునిచి వెనుక ననుజుండు వచ్చిన విధమునకు, మదిలోన ననఘుఁ డెంతయు వగచుచు నరిగె నాశ్రమమునకు. |
352 |
| వ. | అట్లు సని చేతనారహితం బైన శరీరంబునుంబోలె సీతావిహీనంబయి యున్న పర్ణగృహంబుం గనుంగొని రాఘవుండు మూర్ఛితుండై, లక్ష్మణ ప్రయత్నంబునఁ గొండొకవడికిఁ దెలివొందె; నంత నయ్యన్నయుం దమ్ముండును దత్ప్రదేశంబులయందు సుందరిం దడవుచుం జనువారు ముందట. | 353 |
| తే. |
కులిశపాతభంగుర మైన కులనగంబు | కరణిఁ బడియున్న గృధ్రంబుఁ గాంచి బుద్ధి నదియు రాక్షసమాయయౌ నని తలంచి | యేయ సమకట్టుటయు విహగేంద్రుఁ డెఱిఁగి. |
354 |
| క. |
‘ఓయయ్యలార! యేను జ | టాయు వనంబరఁగు పక్షి నరుణతనయుఁడన్ మీయయ్య దశరథక్షితి | నాయకునకుఁ బ్రియసఖుండ’ నావుడు వారల్. |
355 |
| వ. | డాయ నరుగుదెంచుటయు నతండు వారితో రావణుండు వైదేహిం గొనిపోవుటయుఁ, దదర్థంబై తాను నద్దనుజుం దొడరి పెనంగుటయుం జెప్పి, యావల రావణుం డరిగినదెస నెఱింగించి విగతజీవుం డయ్యె; నయ్యిరువురు నప్పులుఁగుఱేనికి నతిగౌరవంబున నగ్నిసంస్కారాదికరణీయంబులు నిజజనక నిర్విశేషంబుగా నాచరించి దక్షిణాభిముఖులై చని చని. | 356 |
| చ. |
ఉరమునయందుఁ గన్నులుఁ బృథూదరదేశమునందు నోరుఁ బ్ర స్ఫురితభుజద్వయంబుఁ గులభూమిధరోన్నతభావముం గరం బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ స్మరుఁ డగుచున్నవానిఁ బటుసత్త్వుఁ గబంధునిఁ గాంచి రచ్చటన్. |
357 |
| ఆ. |
అక్కబంధుఁ డామిషార్థియై లక్ష్మణుఁ | బట్టికొనియె బాహుబల మెలర్ప; నతఁడు గడువిషణ్ణుఁడై ‘యన్న! ననుఁ జూడు’ | మనుచు రాముఁ జూచి యనియె మఱియు. |
358 |