| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
‘అమ్మ! నీ కెంతయు హర్షంబుగా నొక | వార్త నే నెఱిఁగింతు వనజవదన! నామాట నిజముగా నమ్ముము వినవె! య | వింధ్యుఁడు నా నొక్కవృద్ధదైత్యుఁ డనఘుండు రామహితాన్వేషి యై నీకు | నాశ్వాస మొనరింప నబల! నన్ను బనిచెను; విను, నిన్నుఁ బాసిన పిదప ల | క్ష్మణుఁడును దాను సేమమునఁ గలసి |
|
| ఆ. |
యఖిలవానరేంద్రుఁ డైన సుగ్రీవుతోఁ | జెలిమి సేసి, యిపుడు శీఘ్రమునన వీరవరుఁడు నిన్ను విడిపించు పనికినై | యొదవి యుత్సహించి యున్నవాఁడు. |
394 |
| వ. | రావణునకు రంభానిమిత్తం బయిన నలకూబరు శాపంబుగలదు గావున నీయందు బలాత్కారంబు సేయరాదు; నీకు వీనివలని భయంబు వలదు; మఱి యిద్దురాత్మునకుం జేటు దెలుపునట్టి దుస్స్వప్నంబు గలిగె; నది యాకర్ణింపుము. | 395 |
| క. |
ఖరములఁ బూనిన రథమున | విరిసిన వెండ్రుకలు వెంట వ్రేలఁగ దశకం ధరుఁడు బహుళతైలాప్లుత | శరీరుఁడై దక్షిణంబు సనఁ గలఁ గంటిన్. |
396 |
| తే. |
అతని చుట్టును గుంభకర్ణాదు లెల్ల | నరుణమాల్యానులేపనులై వికీర్ణ పతితకేశులై నగ్నులై పరఁగఁ బ్రేత | పతిదిశకు నేఁగు గతి గానఁబడియె నాకు. |
397 |
| ఉ. |
చారుసితోష్ణ వారణలసత్సితమాల్యసితాంగరాగుఁడై ధీరగుణోత్తరుం డధికధీనిలయుండు విభీషణుండు వి స్ఫారసితాద్రిశృంగమున భవ్యుఁడు మంత్రిచతుష్టయాన్వితుం డై రమణీయలక్ష్మిఁ బొలుపారఁగ నేఁ గలగంటి నుగ్మలీ! |
398 |
| చ. |
తన సిత కీర్తి విశ్వవసుధా గగనాంతరపూరితంబుగా ఘనభుజుఁ డున్నతద్విరదకంధరసుస్థితుఁడై ముదంబుతో ననుజుఁడు దాను రాఘవకులాగ్రణి సన్మధుసిక్తపాయసం బొనర భుజింపఁ గంటి వికచోత్పలలోచన! నిక్కమింతయున్. |
399 |
| క. |
పులిచేత వ్రేటువడి మైఁ | గలయఁగ నెత్తురులు గ్రమ్మఁగా నేడ్చుచు ని మ్ముల నుత్తరాభిముఖి వై | కలుషితగతి నరుగ నిన్నుఁ గనుఁగొంటిఁ గలన్. |
400 |
| క. |
నా కల నిక్కల యయ్యెడు | శోకింపకు మమ్మ యింక సుందరి! పుణ్య శ్లోకు జితలోకు నతులవి | వేకుం బ్రియుఁ బొందఁగలుగు వేగమ నీకున్’. |
401 |
| ఆ. |
అనినఁ ద్రిజటపలుకు లవి నిక్కములు గాఁగ | వగచి సీత గొంత వనట దక్కి యాసతోడ నుండె; నట దశవదనుండు | సీతఁ దలఁచి వివశచిత్తుఁ డగుచు. |
402 |
| వ. | తాను దేవదానవ గంధర్వాది భూతవర్గంబుల నెల్ల జయించియుం గందర్పదర్పంబు వారింప నోపక యాక్షణంబ దివ్యమాల్యాంబరాభరణ భూషితుండై సంచారశీలం బైన కల్పపాదపంబునుంబోలె నొప్పియుఁ దనయొప్పుఁ బితృపనంబునందలి వటభూరుహంబుసొంపునుంబోలె నతిభీషణం బగుచుండ నశోకవనమధ్యంబు సొత్తెంచి రోహిణీసమీపంబునకు వచ్చు శనైశ్చరుండునుంబోలె జానకిం జేరం జనుదెంచి ప్రణయపూర్వకంబుగా నిట్లనియె. | 403 |
| క. |
‘ఏల మదిరాక్షి! వలవని | జాలింబడి నవసెదవు లసద్భూషణ లీ లాలంకృతవై ననుఁ గృప | నేలికొనం గదవె వేయు నేటికి నింకన్. |
404 |
| చ. |
అనిమిష యక్ష రాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాం గనలఁ గరంబు చిత్తమునఁ గైకొన కే ననురాగలీలమై నిను మది నాదరించు టిది నీదగుభాగ్యము గాదె? యింతయున్ వనిత! యెఱుంగ వైతి; గరువంపువిచారము లేల నీయెడన్. |
405 |
| ఉ. |
రాముఁ డనంగఁ బేర్మియును రాజ్యముఁ గోల్పడి కానలోన దుః ఖామయ మగ్నుఁ డైన యొకయల్పమనుష్యుఁడు వానిపైఁ గడుం బ్రేముడి సేయుచున్ వగపుపెల్లునఁ జిత్తము దల్లడిల్లఁగా నీ మెయి నుండు నీయునికి యేసుఖ మండ్రు లతాంగి చెప్పుమా! |
406 |
| వ. | ఏను సకలలోకేశ్వరుండ; నాకుం గింకరులై పదునాలుగుకోట్లు నిశాచరభటులును, నిరువది యెనిమిదికోట్లు రాక్షసులును, నెనుబదియాఱుకోట్లు యక్షులును వర్తిల్లుదురు; నిఖిలధనాధ్యక్షుండయిన యక్షేశ్వరుండు నాయగ్రజుండు; బ్రహ్మసమానుం డగు విశ్రవసుండు మదీయజనకుండు; గుబేరునకు వినోదపాత్రంబు లైన గంధర్వాప్సరోగణంబులు నన్ను సేవించుఁ; బంచమలోకపాలుం డని నన్నుఁ ద్రిభువనంబులుఁ గీర్తించు; భక్ష్యభోజ్యాది వస్తువులును సురేశ్వరగృహంబునం దెట్లట్లనాగృహంబున నక్షయంబు; లిట్టినావిభవం బింతటికిని మదీయజీవితంబునకు నధీశ్వరివై సుఖంబున భోగింపు’ మనిన విని, వైదేహి క్రోధశోకవ్యాకులహృదయ యగుచు వానిదెసం జూడక యొక్కతృణాంకురం బుపలక్షించి యి ట్లనియె. | 407 |
| సీ. |
‘అకట! పరాంగన, నబలఁ, బతివ్రతఁ, | బరికింపఁగా మర్త్యభామ నేను, రాక్షసుండవు నీవు; రాగంబు మది నించు | కయు లేని నాదు సంగమమునందుఁ గలిగెడు నట్టి సౌఖ్యం బెంత? యదియును | గాక యాద్యుం డైన కమలగర్భు పౌత్త్రుఁడ నని లోకపాలతుల్యుఁడ నని | హరసఖుం డైన ధనాధినాథు |
|
| ఆ. |
భ్రాత నని భవత్ప్రభావంబు సెప్పితి; | విట్టి నీవు ధర్ము వెఱిఁగి దురిత వర్తనంబు విడువవలదె? సిగ్గేది యి | ప్పగిదిఁ బ్రల్లదములు వలుకఁ దగునె?’ |
408 |
| వ. | అని పలికి జానకి యుత్తరీయసంవృతవదనయై యతికరుణంబుగా నేడ్చిన నద్దురాత్ముండు వెండియుఁ గొన్ని దుర్వచనంబులు పచరించి యనంతరంబ యంతర్ధానంబు నొందె; నప్పొలఁతియు నెప్పటియట్ల రాక్షసీరక్షిత యై యుండె నని మార్కండేయుండు ధర్మరాజునకు నిర్దేశించిన తెఱఁగు వైశంపాయనోక్తం బైన యాఖ్యానంబు విఖ్యాతమాధుర్య మనోహరంబుగా. | 409 |