పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
వాలిసుగ్రీవుల యుద్ధము (సం. 3-264-27)
తే. ‘ఓరి దుష్టాత్మ! యే నిట్లు పోరఁ బెక్కు | మాఱు లెగువంగ సిగ్గఱి పాఱుచుండు
నట్టి నీ కున్న యునికిన యిట్టలముగ | నిట్టి బీర మెక్కడనుండి పుట్టెఁ జెపుమ!’
375
వ. అనినఁ బ్రహసితముఖుం డగుచు నబ్బలిముఖుం డి ట్లనియె. 376
క. ‘ఆలిని రాజ్యముఁ గోల్పడి | యాలంబునఁ దూలపోయి యక్కట బ్రదు కిం
కేలా యని తెగువమెయిన్‌ | వాలి! రణము సేయ నమరి వచ్చితి నీతోన్‌.
377
తే. చక్కఁ గమ్మింక ముందటి చంద మొందఁ | గలదె? తొంటి సుగ్రీవుండు గాఁడు నేఁడు;
నిన్నుఁ బొరివుచ్చి కాని పోనేర్చు నెట్లు?’ | ననుచు నుగ్రుఁడై యవ్వీరు నార్చి కవిసె.
378
వ. ఇవ్విధంబున. 379
ఉ. భూవినుతప్రభావులు ప్రభూత బలోద్ధతు లుగ్రవైరితే
జోవిజయుల్‌ నిరంతరయశోజయకాంక్షులు భూరిభూరుహ
గ్రావనఖాయుధుల్‌ బలిముఖప్రవరుల్‌ గడుఁ బొంగి వాలిసు
గ్రీవులు దాఁకి రొండొరు లకృత్రిమరోషకషాయవక్త్రులై.
380
మ. తరుసంఘంబులు పూన్చి యొండొరుల నుద్యద్బాహులై వ్రేయ ని
ష్ఠురవక్షస్స్థలపాతవేగవిరళస్తోకంబులై పోయె న
త్తరుసంఘంబులు; వెండియుం గడఁగి యుద్యల్లీల నయ్యిద్దఱుం
బరుషానేకశిలాప్రయోగముల నొంపం జొచ్చి రన్యోన్యమున్‌.
381
క. అతులితశిలావితానం | బితరేతరతనునిపాతహేలా సంచూ
ర్ణిత మగుటయు, వారలు పటు | గతిఁ గవిసిరి బాహుయుద్ధకౌతుకమతులై.
382
ఉ. ఒండొరుఁ బట్టుచుం దిగుచు చొండొరుఁ బాయుచు వ్రేయుచున్‌ మహో
ద్దండత నొండొరుం దొలఁగఁ దాఁకుచు నీఁగుచు లోఁగుచుం జలం
బొండొరు మీఱు చొండొరుల యుద్ధతి సైఁపక వీఁకఁ బోరి రా
ఖండలభానుసూను లవిఖండిత చండభుజాప్రచండతన్‌.
383
శా. దేహోత్సాహ మెలర్ప నుద్ధతమదాంధీభూతులై యాహవో
త్సాహవ్యగ్రులు విగ్రహంబు మిగులన్‌ సంరంభశుంభద్గతిన్‌
బాహాబాహిఁ బెనంగ నప్పు డమరెం బ్రౌఢద్విపద్వంద్వహే
లాహస్తద్వయగాఢకర్షణరణోల్లాసంబు విస్పష్టమై.
384
వ. మఱియు నన్యోన్యదంతనఖముఖవిఖండితశరీరులై హరివీరులు రుధిరధారలం దడిసి పుష్పితంబు లగు నశోకంబులుం బోలె నొప్పి చలంబులు మెఱయం బెనంగునెడం దుల్యబలరూపవిక్రములై యున్న యయ్యన్నదమ్ముల నిరువుర నేర్పడ లక్షింపనేరక లక్ష్మణాగ్రజుండు విలక్ష్యహృదయుండై వీక్షించుచున్న నాంజనేయుండు రాఘవునకు నభిజ్ఞానార్థంబుగా నొక్కపల్లవదామంబు సుగ్రీవునఱుతం బెట్టఁదదనంతరంబ రాఘవుం డమోఘబాణంబు దొడిగి వాలియురంబు వగుల నేసినం, బడి యవ్వానరుండు దశరథనందను నిందించుచుఁ బ్రాణవియోగంబు నొందె; నిత్తెఱంగున. 385
ఆ. వాలిఁ జంపి యతనివనిత సుగ్రీవుని | వశము సేసి నిఖిలవనచరేంద్ర
పదవియందు నెమ్మిఁ బట్టంబుఁ గట్టె వి | స్ఫారయశుఁడు రామభద్రుఁ డెలమి.
386
వ. ఆ వనచరుండును రామునకుఁ గృతాంజలియై ‘దేవా! యీఘర్మసమయశేషంబును ఘనసమయంబునుం గడపి మఱి సీతాన్వేషణంబునకు నుత్సహించుట లెస్స’ యని యయ్యిరువురకును మాల్యవత్కూటంబున నివాసంబు గావించి తానును గిష్కింధాపురంబున నుండె; నంత. 387
మ. ఉరుఘర్మౌఘవిఘాతసంవిహితవిశ్వోల్లాసమై సంచల
త్సరసాంభోదనినాదతూర్యరవమై చంచద్బలాకాగరు
ద్భరలీలానవచామరస్ఫురణమై పర్జన్యసామ్రాజ్యమొ
ప్పె రమామందిరమై యుదగ్రశిఖినీపింఛాతపత్రంబులన్‌.
388
వ. ఆ సమయంబున నక్కడ. 389
క. దానవనాయకు చెఱఁ బడి | జానకి యురిఁ బడిన హరిణశాబమ పోలెన్‌
మానిని సంతత భర్తృ | ధ్యానవివశ యగుచు నుండెఁ దాపం బెసఁగన్‌.
390
వ. అమ్మగువ కాపున్న దనుజాంగనలు త్ర్యక్షియు లలాటాక్షియుఁ ద్రిస్తనియు నేకపాదయు దీర్ఘజిహ్వయు నజిహ్వయుఁ ద్రిజటయు నేకలోచనయు మొదలయిన వారు పెక్కండ్రు వికృతాకారంబులతోడ నయ్యబలం బరివేష్టించి యహర్నిశంబును నుఱక యదల్చువారును బెలుచం దిట్టువారును ఖరోష్ట్రనిస్వనంబులు సెలంగ వెఱపించువారును ద్రిభువనాధిపతియైన మన దశగ్రీవునొల్లని యీ దుష్టమానుషిఁబట్టి చెండి కండలు దిందు మనువారునునై యున్న నయ్యుగ్మలి గళద్బాష్పయు గద్గదకంఠియు నగుచు నారాక్షసస్త్రీల కిట్లనియె. 391
తే. ‘అమ్మలార! మీవలసినయట్ల చేయుఁ | డింక నేటికిఁ దడయంగఁ? నేను రాముఁ
దప్ప నొండొకపురుషుఁ జిత్తమునఁ దలఁప | నింత నిజము; నాకును జీవితేచ్ఛ లేదు’.
392
వ. అనిన నజ్జానకితెగువ రావణున కెఱింగింపఁ గొందఱు సనిరి; మఱియు సంతతప్రియవాదినియు ధర్మజ్ఞయు నైన త్రిజట యను రక్కసి రామాంగనం జేరంజని యి ట్లనియె. 393
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )