పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
రాముఁడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకుఁ బంపుట (సం. 3-266-4)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పరమ తపోనిలయుండయిన మార్కండేయుండు పాండవులతో మఱియు నిట్లనియె; నంతమాల్యవత్కందరమందిరుండైన దశరథాగ్ర నందనుండు నవకందళిత సుందరంబులును జనకనందినీవియోగదుస్సహంబులు నగు ఘనసమయదివసంబుల నెట్టకేనియుం గడపి, నిరతిశయసాంద్రచంద్రాతప స్నపనశీతలసమీర వాహ్యమాన వినిద్రకుముదకేదారసౌరభ్య నిర్భరంబులు నతిదీర్ఘయామంబులు నైన శారదయామినులు సైఁపనోపక యొక్కనాఁడు దమ్మునిం జూచి యి ట్లనియె. 2
సీ. ‘చూచితే లక్ష్మణ! సుగ్రీవు కొఱగామి | యమ్మెయిఁ దనపగ యడఁచి మనము
కపిరాజ్య మిచ్చినఁ గైకొని యింద్రియ | సుఖముల నెంతయుఁ జొక్కి నేఁడు
మనదిక్కుదలఁపఁడు; మనతోడఁ బల్కిన | సమయంబుఁ జెల్లింపఁ జనదె తనకు?
గడుఁ గృతఘ్నత సేసెఁ గపికులాధముఁడు; నీ | వనఘ! కిష్కింధకు నరుగు మిపుడ;
 
ఆ. యద్దురాత్ముఁ గృపణు నాత్మీయ కార్య త | త్పరుని నధికరాగపరవశాత్ముఁ
దొడరి వాలి చనిన త్రోవన యనిచి ర: | మ్మేల తడయ మనకు నింక నిచట?
3
ఆ. నీవు సనకమున్న నెఱితోడ మన కార్య | మునకుఁ దగిన యత్నములు ఘటించి
యుండెనేని వాని నొండేమియుం జేయ | వలదు; తోడితె మ్మవార్యశౌర్య!’
4
చ. అనుడుఁ దదాజ్ఞఁ బూని యతఁ డాతతకార్ముకహస్తుఁడై రయం
బునఁ జనియెం గపీశ్వరునిప్రోలికి; వాఁడును సంభ్రమంబుతో
ననుఁగులుఁ దాను రాజసుతు నర్థి నెదుర్కొని మ్రొక్కి యర్హపూ
జన మొనరించుడున్‌, విభునిశాసన మాతఁడు సెప్పె వానికిన్‌.
5
వ. చెప్పిన విని భయకంపితగాత్రుం డగుచుఁ గమలమిత్త్రపుత్త్రుండు సుమిత్త్రాపుత్త్రున కిట్లనియె; ‘నయ్యా! యే నేల కృతఘ్నుండ నగుదు? జానకి నన్వేషించుటకునై బలవంతులు బుద్ధిమంతులు నగువానరుల ననేకుల నలుదెసలకుం బనిచితి; వారును సకలవనశైలసాగరనగరగ్రామనదీసహితం బైన భూచక్రంబునం దెల్ల రోసి, యొక్కమాసంబులోనం గ్రమ్మఱివచ్చువారై సమయంబు సేసిపోయి; రింక నైదుదినంబులు గొఱంత; యింతియ; యటమీఁద వైదేహివార్త గొనుచు దేవరం గొలువవచ్చువాఁడనై యున్నవాఁడ’ ననినం బ్రీతుండై లక్ష్మ ణుండు. 6
క. వానిం దోడ్కొని చని యా | భూనాథునిఁ గానుపించి పొందుగఁ దత్కా
ర్యానుష్ఠానవిశేషము | దా నెఱిఁగించుటయు విభుఁడు దద్దయు నలరెన్‌.
7
వ. పదంపడి కొన్ని దివసంబులకుఁ బూర్వపశ్చిమోత్తరదిక్కులకుం జనిన వనచరు లరుగుదెంచి రాఘవుం గని ‘దేవా! సకలసాగరమేఖలావలయితం బైన భూవలయంబంతయు వెదకితిమి; దేవిం బొడగాన’ మని చెప్పిన నతండు దుఃఖితుండయి, దక్షిణదిశకుఁబోయిన వానరులవలన వైదేహితెఱం గెఱుంగుదు నను నాసం జేసి ప్రాణంబులు ధరియించి యుండె; నంత వెండియు నొక్కమాసంబు సెల్లినఁ గొందఱువనచరులు పఱతెంచి సుగ్రీవుం గని యి ట్లనిరి. 8
సీ. ‘నీవును వాలియు నేఁడును నాఁడునుఁ | బ్రియమునఁ బాటించు పెద్దతోఁట
మధువనం బదె నేఁడు మనయంగదుండును | హనుమంతుఁడును మొదలైనవారు
బలువిడిఁ జూఱాడి ఫలము లానెదరు త | ద్రక్షకు లగు మమ్ము రయము మీఱ
భంగించి’ రనవుడు భానునందనుఁ డాత్మ | ‘నంగదప్రముఖులు యామ్యదిశకుఁ
 
తే. జనినవారలు గావున జనకపుత్త్రిఁ | గనిన యుబ్బిది గాఁబోలుఁ గాక; యిట్లు
సేయ వెఱవరె? పతికార్యసిద్ధి సలుపు | జనుల కీ చన వెందును జనున కాదె!’
9
వ. అని యూహించి తత్ప్రకారంబు రఘుపతికిం జెప్పె; నంత. 10
ఉ. తేనెలు గ్రోలి క్రోలి కడుఁదియ్యని కమ్మనిపండు లింపు సొం
పానఁగ నాని యాని పరపందిన నీడలు మెచ్చి మెచ్చి మం
దానిలశైత్యసౌరభసమగ్రతకుం గడుఁ జొక్కి చొక్కి యు
ద్యానమునందు మారుతసుతప్రముఖుల్‌ విహరించి తృప్తులై.
11
వ. అందఱుం గూడుకొని చని సుగ్రీవలక్ష్మణసహితుండై యున్న జననాథుం గని దండప్రణామంబులు సేసినం గాకుత్‌స్థకులప్రదీపకుండు వారల ముఖవర్ణవిశేషంబు లుపలక్షించి సీతం గనినవార కా నిశ్చయించె; నప్పు డత్యంతమతిమంతుం డయిన హనుమంతుండు రాఘవునకుఁ గృతాంజలి యై యిట్లనియె. 12
క. ‘దేవిఁ బొడగంటి నేను ధ | రావల్లభ! శైలసరిదరణ్యనగరపా
రావారకలిత మగు వసు | ధా వలయము వెదకి వెదకి దక్షిణపుదిశన్‌.
13
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )