| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
శతకోటిద్వయహరిపరి | వృతులై చనుదెంచి రతులవీరులు ధీరో ద్ధతులు గజుఁడు గవయుఁడు వి | శ్రుతముగ రఘుపతికిఁ దోడు సూపిరి గడఁకన్. |
35 |
| క. |
అఱువదికోటులు గపివరు | లుఱక జగత్త్రయముఁ బెలుచ నువ్వెత్తు గొనం దఱిగొన్నయట్లు నడవఁగ | నెఱసి కుముదుఁ డరుగుదెంచి నృపవరుఁ గనియెన్. |
36 |
| ఉ. |
కోటిసహస్రసేన తనుఁ గొల్వఁగ వానరకోటి కెల్లఁ దా మేటి మహాబలుండు నిరమిత్త్రుఁడు మిత్త్రసహాయుఁడై తగన్ వీటికి నుబ్బుగాఁ జటులవేగసముచ్ఛ్రితపుచ్ఛగుచ్ఛవి స్ఫోటితదిగ్విభాగుఁ డగుచుం జనుదెంచె సుషేణుఁ డత్తఱిన్. |
37 |
| క. |
గణుతింపరాని వానర | గణములతో దధిముఖుండు కాకుత్‌స్థకులా గ్రణికిఁ బ్రియంబుగ వచ్చె ధ | రణి భాగము వాహినీచరణదళితముగన్. |
38 |
| ఆ. |
శతసహస్రకోటిసంఖ్యల యెలువులు | గొలువ జలదనీలఘోరమూర్తి జాంబవంతుఁ డతులసత్త్వుఁ డేతెంచె నా | భూపవరునికార్యమునకుఁ బూని. |
39 |
| వ. | మఱియు, ననేకు లనేకసహస్రసంఖ్యల బలంబులతోడం జనుదెంచి; రిట్లు గూడిన కపివీరులు వివిధాకారు లపారబలశౌర్యసారు లతిఘోరంబుగాఁ బేర్చి నిగుడుచు, మగుడుచుం, దాఱుచుఁ బాఱుచుం, దిరుగుచు, సురుఁగుచు, మలయుచుఁ, బొలయుచు, మత్తిల్లి గిరిగుహలయందును దరువనంబులయందును, సరి దుపాంతంబులయందును నానందంబున విహరించుచుండిరి; తదనంతరంబ. | 40 |
| మ. |
ప్రభ నొప్పారి యనుంగుఁదమ్ముఁడు మహాభాగుండు సౌమిత్రి వీ తభయుండై కొలువం గపీంద్రబలసంతానంబుతో నుద్ధతిన్ శుభలగ్నంబున రాఘవుండు గదలెన్ సుగ్రీవసాహాయ్యసం ప్రభవోత్సాహ మెలర్ప దర్పితరిపుప్రాలేయతిగ్మాంశుఁ డై. |
41 |
| ఉ. |
ఆ హరివీరవాహినుల కన్నిటికిన్ మొగమై మరుత్సుతుం డాహవదోహళుం డమరె నంగద నీల నలాది వీరు లు త్సాహము మీఱ నయ్యయి దెసం దగు కావలి యై సమగ్ర స న్నాహమహోగ్రతం జనిరి నాకవిరోధివధాభిలాషులై. |
42 |
| వ. | ఇట్లు నడచి యెడనెడం బ్రభూతవన్యఫలజలాశయంబు లగు ప్రదేశంబుల విడియుచుం గపిసైన్యంబు గతి పయదినంబులకు దక్షిణోదధితీరంబు సేరి రెండగు వారాశియుంబోలె ఘూర్ణిల్లుచుండె; నంత రాఘవుండు రవితనయుం జూచి యి ట్లనియె. | 43 |
| క. |
‘మనబలమును నతిబహుళము | వననిధియును దుస్తరంబు వానరవర! యి వ్వననిధిఁ గడచు నుపాయము | మన కొక్కటి నిశ్చయింపుమా తగుభంగిన్.’ |
44 |
| తే. |
అని విచారించునెడ కొంద ఱధిపుఁ జూచి | ‘జడధి బలితంపుఁ దెప్పలఁ గడత’ మనిరి; ‘ఘనపుఁ గలముల సమకట్టి గడత’ మనిరి | కొంద; ఱంతయు విని రఘునందనుండు. |
45 |
| సీ. |
అల్లన నగుచు నిట్లనియె: ‘మీ చెప్పుటల్ | దగిన యుపాయంబు లగున; యయిన నగణితం బైన యీ హరిసైన్యముల కెల్లఁ | గలములుఁ దెప్పలు వలయునన్ని సమకట్టు టరయ నశక్యంబు; శతయోజ | నంబుల పరపైన యంబురాశిఁ గలములఁ దెప్పలఁ గడచుచో రిపుకోటి | యెడరునఁ బైఁబడి పొడువకున్నె? |
|
| ఆ. |
యదియుఁగాక యల్పులగు వణిగ్జనముల | యోజ శూరతతికిఁ దేజ మగునె? కాన నాదుమతము గా దివ్విధంబు; నా | మనసు నిశ్చయంబు వినుఁడు మీరు. |
46 |
| చ. |
వ్రతము ధరించి నిష్ఠ నుపవాసవిధిం గొలుతున్ సముద్రు; నా కితఁడు ప్రసన్నుఁడై తెరువు నిచ్చుట యంతయుఁ గల్గెనేని మే; లితరునిఁగా ననుం దలఁచెనేని నమానుషరోషవేగదీ పితశరవహ్ని నిజ్జలముఁ బీల్చెదఁ బ్రేల్చెద నొక్క వ్రేల్మిడిన్.’ |
47 |