పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
రాముఁడు దర్భశయనుండై సముద్రుం బ్రార్థించుట (సం. 3-267-30)
వ. అని పలికి దశరథాగ్రసూనుండు దానును దమ్ముండును నుపవసించి దర్భశయను లై జలధీంద్రు నుపాసించి యున్నంత సముద్రుండు సకలజలచరప్రకరపరివారుండై రాఘవునకుం బొడసూపి ‘యయ్యా! నీవలనఁ బ్రీతుండ నైతి; నీ కెయ్యది ప్రియంబు సేయుదుఁ? జెప్పు ‘మనిన నతండు’ నాకు లంకపై నరుగం దెరు విచ్చునది; యీనినాఁడు సూర్యనిభంబులైన మదీయదివ్యాస్త్రంబుల నిన్ను శోషింపం జేయుదు’ ననిన విని సరిత్పతి రఘుపతి కి ట్లనియె. 48
సీ. ‘జననాథ! నీ కార్యమునకు నే విఘ్నంబు | గావింప నోడుదు నే విధమున;
వినుము! నా వాక్యంబు; జను లెల్ల నెఱుఁగ నీ | కిత్తఱి నేఁ దెరు విత్తునేని
నిల నెల్లవాఁడును విలసిత దివ్యాస్త్ర | బలమున సాధింపఁ దలఁచు నన్ను;
మీయందుఁ గపివీరుఁ డాయతమతి విశ్వ | కర్మసూనుఁడు శిల్పికర్మవిదుఁడు
 
ఆ. నలుఁడు నాఁగ నొకఁడు గలఁడు; వాఁ డొలసి నా | యందుఁ దరులు గిరులు నొంద వైవ
నవి ధరింతు నేను; దివిరి నీ కది సేతు | వుగఁ గడంక నరిగి పగఱ గెలుము.’
49
వ. అని యతని నొడంబఱిచి సముద్రుండు సనుటయు, నమ్మహీపతి నలు రావించి సేతుబంధనంబు సేయ నియోగించిన, ననేకవానరసహస్రంబులు నలుదిక్కులకుఁ బఱచి గిరిశిఖరంబులుఁ దరునికరంబులు విఱిచి తెచ్చియిచ్చుచుండ నన్నలుండు మున్నీటి యందు శతయోజనాయామంబును దశయోజనవిస్తారంబునుంగా నతిదృఢం బగు సేతుబంధనంబు నిర్మించె నయ్యవసరంబున. 50
ఆ. అన్నతోడ నలిగి యాప్తులుఁ దాను వి | భీషణుండు వినయభూషణుండు
నెమ్మి నరుగుదెంచి నృపశిరోమణి రాము | శరణుఁ జొచ్చె భక్తిభరితుఁ డగుచు.
51
క. ఆ రాక్షసవృషభుని యా | కారము నింగితముఁ జూచి కాకుత్‌స్థకులో
ద్ధారుఁ డతని నతిధార్మికుఁ | గా రూపించి ముద మొప్పఁ గైకొనియెఁ దగన్‌.
52
ఉ. వానికి దానవేంద్రువిభవంబు సమస్తము నిచ్చువాఁడు గాఁ
బూని ప్రతిజ్ఞ సేసి కృతపుణ్యుఁడు లక్ష్మణుతోడి చెల్మియున్‌
వానికి నిచ్చెఁజెచ్చెర నవారితవానరసైన్యయుక్తుఁడై
వానిఁ బురస్కరించుకొని వారిధి దాఁటె మహోగ్రలీలతోన్‌.
53
వ. ఇట్లు సేతుమార్గంబున సాగరరోత్తరణం బాచరించి త్రికూటపర్వతం బెక్కిలంకానగరంబు చుట్టును శిబిరంబులు సంఘటింపం బంచిన. 54
క. తాలైలాగరు సాల ర | సాల తమాలామ్ర నింబ జంబూ జంబీ
రాలంకృత లంకావన | జాలంబుల విడిసె వృక్షచరసైన్యంబుల్‌.
55
వ. తదనంతరంబ రావణచారులైన శుకసారణు లనువారలు వానరాకారంబులు దాల్చి శిబిరంబునఁగ్రుమ్మరుచున్న నెఱింగి, విభీషణుం డా రాక్షసులం బట్టించి రామునకు సమర్పించిన, నతండు వారికి నిజసైన్యం బంతయుం జూప నియోగించి విడిచి పుచ్చినఁ, జని యయ్యిరువురు నమరవైరిం గని కపిసైన్యంబు దుర్జయం బనియును, రామలక్ష్మణుల తేజోమూర్తివిశేషంబులును నెఱింగించిన, నతండు దాని సరకు సేయక సమరంబునకు మోహరించి. 56
సీ. బద్ధశిలాయంత్రబహుళమై యుత్తాలి | తాట్టాలకాభీలమై యుదగ్ర
కేతుపతాకాప్రకీర్ణమై తోమర | ముద్గరాలాతక ముసల శూల
శర శతఘ్నీముఖ సాధనోపేతమై | యుగ్రవిగ్రహధీరయోధవీర
సంకులంబై హయస్యందనవేదండ | చండమై సముదిత సప్తసాల
 
ఆ. మై యలంఘ్యపరిఖమై తృణకాష్ఠజ | లాది వస్తుభరిత మైన లంక
కధికరక్షఁ జేసి యప్రమాదంబున | నుండె రిపుజిగీష నుదితబలుఁడు.
57
వ. ఇట రాఘవుండును సుగ్రీవసహితుండై యుండి యంగదుం జూచి ‘నీవు రావణుపాలికిం జని యతనికిం దగినతెఱంగున బుద్ధిగాఁ జెప్పి, జానకి విడుచుట మే లని చెప్పు’ మని పనిచినం బని పూని యవ్వీరుండు. 58
శా. లంకాద్వారము దుర్నివార గమనోల్లాసంబునం జొచ్చి ని
శ్శంకుండై సురశత్రుసైనికసహస్రంబుల్‌ దనుం జూచి యా
శంకం బొందఁగ లీలమైఁ జని సుహృత్సంఘంబు గొల్వన్‌ నిరా
తంకుండై కొలు వున్న దైత్యుఁ గని యుద్యన్మూర్తియై యిట్లనున్‌.
59
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )