| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| మ. |
కృతహస్తుండు ప్రహస్తుఁ డాహవకళాకేళీవిదగ్ధుండు ద ర్పితుఁడై తాఁకె విభీషణుం గడఁకమైఁ బెంపారి వారిద్దఱున్ శితశల్యోగ్రమయూరపత్త్రవిశిఖశ్రేణీశతచ్ఛన్నులై ధృతి నొప్పారిరి చిత్రవారిధరపంక్తిచ్ఛన్న శైలాకృతిన్. |
82 |
| చ. |
కదిసి ప్రహస్తుఁ డార్చి పరిఘంబు రయంబున నెత్తి భీకరో న్మద కరిహస్త తాడనము మాడ్కి దలిర్పఁగ వ్రేసె నీసుమై నదయత రావణానుజుని నాతఁడు వ్రేటున కించుకంతయుం గదలక హేమకూటగిరికైవడి నిల్చి యుదీర్ణకోపుఁడై. |
83 |
| మ. |
శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో త్థిత కీలాసదృశంబునై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్. |
84 |
| వ. | ఇట్లు ప్రహస్తుండు వడినం దత్సైన్యంబులు విముఖంబు లగుటయు, ధూమ్రాక్షుండు రోషతామ్రాక్షుం డగుచు నతినిబిడబలాహకానీకభీకరంబై కాఱుకొనుచున్న నిశాచరచక్రంబుతో నురలం బఱతెంచినం జలించి బలీముఖబలంబులు దుర్బలంబులై తొలంగినం జూచి యాంజనేయుం డజయ్యుండై నిల్చినం బెల్చన యెప్పటియట్ల యూధపతులుం గూడుకొని; రప్పుడు. | 85 |
| సీ. |
అనిలతనూజ ధూమ్రాక్ష రక్షిత సైన్య | యుగ్మంబునకు నయ్యె నుగ్రసమర; మందు నిష్ఠురచరణాఘాతముల డొల్లు | నరదంబులును, శిలాహతులఁ దూలి యొఱలు నేనుంగులు, నుత్తాలతరుహతిఁ | ద్రెళ్లు ఘోటకములు, దీవ్రనఖర దంతక్షతంబుల దళితాంగులై నేలఁ | బడి తన్నికొను వీరభటులు నగుచు |
|
| ఆ. |
నధిక శౌర్యసారులగు కపివీరుల | చేత నొచ్చి దైత్యసేన భీతిఁ బఱచెఁ గొంత, బెండువడి యుండెఁ గొంత, ధూ | మ్రాక్షువెనుక కొదిఁగె నంతఁ గొంత. |
86 |
| మహాస్రగ్ధర |
కని ధూమ్రాక్షుండు విశ్వ | గ్రసన రయలసత్కాల మేఘంబ పోలెన్ ఘన గర్జాఘోష మొప్పం | గడఁగి శరశతాకల్పితాసారదుర్ద ర్శన వీరారంభుఁడైనన్ | సకల హరిచమూసంఘమున్ విహ్వలంబై చనెఁ దూలెం గూలె లావుం | జలమును జెదరన్ సంగడిన్ విచ్చె నొచ్చెన్. |
87 |
| తే. |
అతనియుద్ధతి సైఁపక యనిలసూనుఁ | డనిలవేగుఁడై పఱతెంచి యార్చి తాఁకెఁ బ్రధన మయ్యిద్దఱకు నుగ్రభంగి నమర | పతికిఁ బ్రహ్లాదునకుఁ బోలెఁ బ్రకట మయ్యె. |
88 |
| క. |
పరిఘంబులు గదలును బె | క్కరుదుగ రక్కసుఁడు వైచె నమ్మారుతిపై నురుగండశైలములు ఘన | తరువులు హరివరుఁడు గురిసె దానవుమీఁదన్. |
89 |
| వ. | ఇబ్భంగిం బెనంకువ సెల్లుచుండఁ గొండొక సేపునకు. | 90 |
| స్రగ్ధర |
లంకాలుంటాకుఁ డుద్య | ల్లఘుతరగమనోల్లాసియై డాసి వీఁకం బొంకం బేపారఁ జంచ | ద్భుజరచిత మహాభూరుహం బెత్తి వైచెం గింకన్ ధూమ్రాక్షు; వాఁడుం | గెడసెను వదనోద్గీర్ణకీలాలధారా పంకప్రాగ్భాగమగ్నా | పఘనవిఘటితప్రాణుఁడై యాహవోర్విన్. |
91 |
| వ. | ఇత్తెఱంగున ధూమ్రాక్షుండు తెగినఁ గపిసైనికు లార్చి హనుమంతుని ననేకభంగులం బ్రస్తుతించుచు రజనిచరులం గనుకనిం దోలినం దూలి యందఱుం బఱచి పురంబు సొచ్చిదనుజేంద్రునకుం బ్రహస్తధూమ్రాక్షుల మరణప్రకారంబు లెఱింగించినఁ, బ్రకటబాష్పనిశ్వాసవివర్ణవదనుం డగుచుఁ బంక్తివదనుండు. | 92 |
| క. |
‘కలవా రెల్లను మడిసిరి; | కలిగియు లేఁడయ్యెఁ గుంభకర్ణుఁడు; వీనిం దెలుపుదునొ? యేను గొడుకుం | జల మెడపక రిపులతోడ సరిఁ బెనఁగుదుమో?’ |
93 |
| వ. | అని వితర్కించి యప్పటికిఁ గుంభకర్ణప్రబోధంబు గార్యంబుగా నిశ్చయించి, తదీయశయ్యాగృహంబునకుం జని వానిం దెలుపం బరిజనంబులం బనిచిన. | 94 |
| సీ. |
భేరీమృదంగగంభీరనాదంబులుఁ | గాహళఘంటికాకలకలములు, దారుణసింహనాదంబులు నొనరింపఁ | గడుఁ బెద్దవడికి నంగము గదల్చి యొదిఁగిలి కను విచ్చి హూ యని బిట్టావు | లించి కొండొక దేఱి లేచి నీల్గి కలయఁ జూచుటయును గట్టెదురున యున్న | యన్న నవ్వుచుఁ దన యనుఁగుదమ్ముఁ |
|
| ఆ. |
జూచి యనియె ‘నిట్టి చోద్యంపునిద్రలుఁ | గలవె? యేరికిని జగంబులోన? నెవ్వ రేమి యైరొ యెఱుఁగవు, ధన్యుఁడ; | వీవు మనకు నైన యెడరు వినవె? |
95 |
| వ. | దశరథ నందనుం డయిన రాముండు నాచేత నపహృతభార్యుండై కలుషించి యనేకవానరయూథంబులం గూర్చికొని వచ్చి వనధి బంధించి మనవీటిపై విడిసి, మమ్మెల్లను నేలకుం గోలకుం దెచ్చుచున్నవాఁడు; ప్రహస్తాది వీరులు వానిచేతం బెక్కండ్రు సిక్కిరి; నీవ కాక వాని జయింప నన్యుండు శక్తుండు గాఁడు; కావున లెమ్ము; గ్రక్కునం బగతుపై నడచి, పొడిచి, గెలువుము; దూషణానుజులు వజ్రవేగ ప్రమాథులు నీకుం దోడ్పడియెద’ రనిన ‘నట్ల కాక’ యని కుంభకర్ణుండు విహితపరికరబంధుండై సమరసన్నద్ధులయిన పరిజనంబుల తోడం గూడి వెల్వడి నడతెంచిన. | 96 |