| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
‘ఇనకులతిలకుఁడు బాణా | సనవిద్యాగురుఁడు రామచంద్రుఁడు నీతో నను నిట్లను మని పనిచెను; | వినుము తదీయోక్తిభంగి విస్పష్టముగన్. |
60 |
| సీ. |
అనపరాధులఁ గాననాంతరమున నున్న | పేదతాపసులఁ జంపితి పలువుర నమరుల యీలువుటాండ్రను జెఱవట్టి | యఖిలలోకములకు నలఁత సేసి; తిదియెల్ల నొక తల; యేపుమీఱఁగ నన్నుఁ | జెనకుట యొక తల; సెప్ప నేల? బలిమి యొప్పఁగ మంచి బంటవై వెడలుము | కయ్యంబునకు; నట్లు గాక యున్న |
|
| ఆ. |
శరణుఁ జొచ్చి నాకు జానకి నొప్పింపు; | మొండు వెంట బ్రతికి యుండఁ దీఱ; దస్మదీయశితశరాశీవిషంబుల | కెరయ నీదుప్రాణ మింత నిజము. |
61 |
| క. |
మనుజుండ నైన నా తెఱఁ | గనుమానము వాయఁ జూడు మాహవభూమిన్; విను, రాక్షసులను నామం | బును నడఁపక యేను రిత్త వోనిచ్చెదనే?’ |
62 |
| వ. | అని పలుకుచున్న యంగదు పరుషభాషణంబులకు రోషించిన యసురపతి కన్నెఱింగి నలువురు రక్కసులు గ్రక్కున నవ్వాలి నందనుం బొదివి పట్టిన బిట్టెగసి హర్మ్యశిఖరంబు పైకి దాఁటుటయుఁ, దదాక్షేపవేగంబున నన్నిశాచరులు ధరణీతలంబున జర్జరిత శరీరు లై పడిరి; హరివీరుం డచ్చటినుండి శిబిర మధ్యంబునకు లంఘించి భూనాథునకుఁ దన పోయివచ్చిన తెఱంగు విన్నవించెం; దదనంతరంబ రాఘవు ననుమతంబున. | 63 |
| మత్తకోకిల |
తాలసాలశిలాగ్రహస్తు లుదగ్రగోత్రమహీధరో త్తాలదేహు లనేకవర్ణులు దారితాఖిలదిఙ్ముఖా భీలవాలశిఖాగ్రు లుగ్రగభీరసత్త్వులు వానరుల్ గాలకల్పులు పేర్చి సంతనకట్టి రాహవకేళికిన్. |
64 |
| క. |
పరువడి మొత్తములై బం | ధురఘోషం బెసఁగఁ బొంగి తోఁతెంచు హరీ శ్వర బలమునందు ఘనసా | గరవీచి వికాసరేఖ గానఁగ నయ్యెన్. |
65 |
| మత్తకోకిల |
కోటఁ బన్నిన ఘోరదానవకోటిఁ జుల్కనఁ దోలి య క్కోట నల్గడలన్ మహోగ్రతఁ గూలఁ ద్రోచి సమున్న మ త్కూటతోరణయంత్ర కేతన గోపురాట్టకసంహతుల్ వీటతాటము సేసి రక్కపివీరు లొక్కట మాత్రలోన్. |
66 |
| వ. | మఱియుఁ బ్రాకారంబుపై నున్న గదాపరిఘకుంత ప్రముఖంబులు గైకొని లంకామధ్యంబున వైవం దొడంగిన నాబాలవృద్ధం బగు పౌరలోకంబుహాహాకారవ్యాకులంబై కలంగంబడియె; నంత రావణచోదితు లైన దానవులు నానాకోటిసహస్రసంఖ్య లరిగి యెక్క డెక్కడ యని తలపడి కపిసముదయంబులం దోలి యెప్పటియట్ల ప్రాకారంబుం గైకొని నిల్చి; రప్పుడు. | 67 |
| క. |
మును మర్కటబలములచే | ననయంబును గపిలవర్ణమైనది మగుడన్ దనుజబలసంవృతంబై | ఘనపటలచ్ఛాయఁ గోట కర మొప్పారెన్. |
68 |
| క. |
వనచరసేనలు దెరలిన | నినవంశోత్తములు నృపతు లిద్దఱుఁ గయ్య మ్మునకుఁ గడంగుటఁ గ్రమ్మఱ | గొనకొని కపిసేన యెల్లఁ గోటకుఁ గవిసెన్. |
69 |
| వ. | ఇట్లు గవిసినం బ్రాకారరక్షకులైన రాక్షసవీరులు వారలం జేరనీక శిలాశూలపరశుతోమరాలాతశరకుంత ప్రముఖంబులు ప్రయోగించినం గయికొనక వనచరులు వృక్షశిలాప్రకరంబులు పఱఁగించుచుం గడంగి ప్రాకారంబుఁబ్రాఁకుటయు నయ్యిరుదెఱంగులవారికిం గేశాకేశి యగు సమరం బయ్యెఁ; బదంపడి రావణుండు వనుపఁ బర్వతుండును బ్రఘసుండును ఖరుండును గ్రోధవశుండును బ్రరుజుండును నను రాక్షసు లేవురు ననేకరాక్షసపిశాచసేనాపరివృతు లయి పురంబు వెలువడి మాయ గావించి యదృశ్యాకారులై కపిసైన్యంబు నొప్పింపం దొడంగినం గని. | 70 |
| ఉ. |
దారుణవిక్రముండు రిపుదర్పవిభేది మహాస్త్రవేది మా యారణకోవిదుండు గడు నల్గి విభీషణుఁ డేఁగుదెంచి య వ్వీరుల మాయయుం జలము వ్రేల్మిడిలోఁ గుదియించి వీరకే ళీరసికుండు వారి నవలీలమెయిం దునుమాడె నందఱన్. |
71 |
| క. |
ఆతని శరపాతంబుల | చేతం గడు నొచ్చి దైత్యసేన సగము ధా త్రీతలపతితం బయ్యె; వి | భీతిఁ బఱచి పురము సొచ్చెఁ బెఱసగము వెసన్. |
72 |
| క. |
అది యెల్ల విని దశాననుఁ | డుదితక్రోధుఁ డయి మంత్రియుతముగ వెడలెన్ మదగజ ఘోటక సైనిక | పదభర భగ్నావనీ విభాగుం డగుచున్. |
73 |
| వ. | ఇట్లు వెడలి, యభేద్యం బగు నౌశనసవ్యూహంబు సంఘటించి వనచరబలంబుపయి నడచినం గని, రాఘవుండును బార్హస్పత్యవ్యూహంబు దీర్చి పేర్చి యెదురుకొనియె; నా సేనలు రెండు నకాండక్షుభిత సాగరయుగళంబు తెఱంగు దోఁప నొండొంటిం గవిసె; నప్పుడు రాముండు రావణుం దలపడియె, లక్ష్మణుం డింద్రజిత్తును, సుగ్రీవుండు విరూపాక్షునిఁ, దారుండు నిఖర్వటుం దాకి; రిట్లిరువాఁగునకును దేవాసురులకుం బోలె నాభీలసమరం బయ్యె; నందు. | 74 |
| క. |
సౌమిత్రి నిశితవిశిఖ | స్తోమంబుల నసురపతిసుతుం బొదివిన సం గ్రామమునకుఁ దొలఁగక యతఁ | డామనుజోత్తముని ముంచె నాశుగవృష్టిన్. |
75 |
| ఉత్సాహము |
అమరవైరివిభుఁడు దశరథాగ్రసుతుఁడు నేపునన్ సమరసత్ప్రతాపకోప జాజ్వలచ్ఛరీరులై తుములబాణపటలవృష్టిఁ దొప్పదోఁగి యిర్వురుం దమక మేది తమక తమక తనిసి రాహవంబునన్. |
76 |
| వ. | తదనంతరంబ. | 77 |
| క. |
ఆ రావణుండు నిజదో | స్సారమునకు రాముబాహుసారం బతి దు ర్వారంబగు టేర్పడఁ గని | వీరారంభంబు కడఁక విడిచి రయమునన్. |
78 |
| క. |
మగిడి నగరంబు సొచ్చిన | బెగడి నిశాచరబలంబు పెల్లగిలుటయున్ విగతభయుండు ప్రహస్తుఁడు | దగఁ గోల్తల సేసె నత్యుదగ్ర స్ఫురణన్. |
79 |
| ఉ. |
ఆతనిఁ గాంచి తద్బలము లన్నియుఁ గ్రమ్మఱ నాహవోత్సవ స్ఫీతములై కడంగుటయుఁ బేర్చి విభీషణుఁ డుగ్రవానర వ్రాతసమన్వితంబుగ నవారణ మార్కొనినన్ మహారణం బాతతమయ్యె సైన్యనివహంబులు రెంటికి నద్భుతంబుగన్. |
80 |
| వ. | అంత. | 81 |