| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
విని యాతండును మౌర్వీ | నినదంబున గగనధారుణీమధ్యం బె ల్లను మ్రోయ మత్తగజముం | గనిన మృగేంద్రుండపోలెఁ గడఁగెం బెలుచన్. |
116 |
| వ. | అంత. | 117 |
| ఉ. |
జైత్రులు గోత్రభూమిధరసారులు సాగరధీరు లుల్లస చ్చిత్ర ధనుఃకళావిదు లజేయులు భూరిజయార్థు లప్డు సౌ మిత్రియు మేఘనాదుఁడు నమిత్రవిభేదులు దాఁకి రార్చి లో కత్రయ భీకరప్రథనకౌతుక వేగిత చిత్తవృత్తులై. |
118 |
| క. |
మచ్చరము మీఱ నొండొరుఁ | జిచ్చఱ పిడుగులను బోని శితవిశిఖములం జెచ్చెర నొంపఁగ విలు నే | ర్పచ్చటఁ దుల్యంబు లయ్యె నయ్యిరువురకున్. |
119 |
| క. |
తనకంటె నపుడు రావణ | తనయుం డని మీఱఁ జూచుఁ, దా నాతనికం టెను మున్న రాఘవానుజుఁ | డనుపమశరలీల నతిశయంబుగ మెఱయున్. |
120 |
| క. |
అంతఁ బటుతోమరంబుల | నెంతయు వెస నృపతనూజు నింద్రజి వైవన్ సంతతశరముల నన్నిటి | నింతింతలు శకలములుగ నేసె నతండున్. |
121 |
| వ. | అట్టియెడ నంగదుండు గడంగి లక్ష్మణునకుం దలకడచి యమందవేగంబున మందోదరీనందనుం గదిసి ఘనమహీరుహంబునఁ దన్మస్తకంబు వ్రేసినఁ, జలింపక నిలింపవైరి నిశితప్రాసంబు వాసవపౌత్త్రుం జంప నెత్తుటయు, లక్ష్మణుండు దానిం దునియ నేసిన, నయ్యసురయు గదాదండంబుఁదీర్చి యంగదువక్షంబు వ్రేసినం, దొలంగక చెలంగి వాలిసూనుండు సాలవృక్షంబున నా రాక్షసురథంబు రథ్యసారథి సహితంబుగాఁ జదియనడిచె; నట్లు విరథుండయి యచ్చోటన యంతర్ధానంబు నొంది గగనగతుండయ్యెఁ; బదంపడి. | 122 |
| క. |
‘ఎవ్వలన నుఱుకునో యతఁ | డెవ్వరి నెటు సేయునొక్కొయిం’ దనుచుఁ గడున్ నివ్వెఱపడి కపిసేనలు | గ్రొవ్వుసెడం బంక్తివదనుకొడు కుద్ధతుఁడై. |
123 |
| చ. |
ఉఱుముచు నంత్యకాలచలితోగ్రబలాహకలీల దోఁపఁగాఁ దఱచగు ఘోరపుంబిడుగుతండము వోని శరప్రతాన ము క్కఱఁ దొరఁగించుచుం గపిబలావళిఁ ద్రుంచి కలంచె నేపునన్ నెఱఁకులు నొంచి బాణమయనీరధి ముంచె రఘుప్రవీరులన్. |
124 |
| క. |
మాయాధికు నంతర్హిత | కాయుఁ బురందరవిరోధిఁ గాకుత్‌స్థులు క్రో ధాయత్తు లగుచు నేసిరి | ధీయుక్తులు శబ్దభేదిదివ్యాస్త్రములన్. |
125 |
| వ. | వానికి నలిగి సుగ్రీవాది వానరులు వృక్షశిలాప్రకరంబులు గైకొని యాకసంబున కెగసిన నద్దానవుండు వారి నందఱ వెఱచఱవ నేయుటయుఁజేవ సెడి మగుడి పుడమి కెఱఁగిరి; వాఁడంత నిలువక వాఁడి తూపులు వఱపి రామలక్ష్మణులఁ గరంబు నొప్పించినం జెయ్వేది యయ్యన్నయుం దమ్ముండును గపిబలంబు లడల ధరణీతలంబునకు నొరగి విలయకాలపతితు లైన సూర్యేందుల చందంబున నున్నంగని సింహనాదంబుసేసి. | 126 |
| మ. |
పరమోదాత్తులఁ బార్థివోత్తముల శుంభద్విక్రమారంభులన్ సురసంకాశులఁ గోసలప్రభుల నస్తోకప్రభోద్దాములన్ వరలాభోన్నతుఁ డన్నిశాచరుఁడు గర్వం బొప్ప దుర్వార ని ర్భర’ నాగాస్త్రములం దదాహవమహిన్ బంధించె నయ్యిద్దఱన్. |
127 |
| వ. | తదవసరంబున సుగ్రీవసుషేణ జాంబవత్ప్రముఖు లైన కపివీరులు రామలక్ష్మణు లున్నయెడకుం జనుదెంచి, యెయ్యదియునుం జేయునది నేరక దుఃఖితు లగుచుండ నవ్విభీషణుండు వారి నాశ్వాసించి, బ్రహ్మాస్త్ర ప్రయోగంబున నారాజకుమారులకు బంధమోక్షంబు గావించె; సుగ్రీవుండు విశల్యకరణి యను నౌషధంబున వారల విశల్యదేహులఁ జేసె; నిట్లు ప్రబుద్ధులై రాఘవులు గ్రమ్మఱఁ గయ్యంబునకుం గడంగి; రప్పుడు రావణానుజుండు రామునకుఁ గృతాంజలి యై యి ట్లనియె. | 128 |
| సీ. |
‘నరనాథ! కిన్నరనాథుని పనుపున | శ్వేతుండు నాఁగఁ బ్రసిద్ధుఁ డైన గుహ్యకుఁ డిదె మీకుఁ గొనివచ్చె దివ్యతో | యంబు; లీ జలముల నంబుజాక్ష! నయనపద్మక్షాళనము సేయుఁ; డిప్పు డ | దృశ్యభూతము లెల్లఁ దెల్లముగను గానఁగఁ బడు’ నన్నఁ గైకొని రాఘవుం | డనుజసహాయసమన్వితముగ |
|
| ఆ. |
నట్ల చేసి, కనియె నంబరమధ్య సం | చారుఁ గృతవిపక్షసంప్రహారు నింద్రజాలశీలు నింద్రవిద్రావణు | రావణాగ్రతనయు రహితవినయు. |
129 |
| వ. | ఆ రక్కసుండునుందన చేసిన పౌరుషంబు ప్రతిహతంబగుటకు విస్మయం బంది, మగుడి హోమకార్యంబునకుం బోవం దొడంగిన నెఱింగి, విభీషణుండు లక్ష్మణుం జూచి’ యన్నీచునకు హోమసమాప్తి యయ్యె నేని నెవ్వరికిం గెలువ నశక్యంబు; వీని వెన్నడిం దగిలి తెగటార్పు’ మనిన నతండు. | 130 |
| ఆ. |
ఆర్చి వెనుకఁ దగిలి యశనికల్పము లైన | శరము లేయుటయు, నిశాటవరుఁడు గినిసి వడి నెదిర్చి కీలించె లక్ష్మణు | నంగకముల నుజ్జ్వలాంబకములు. |
131 |
| వ. | ఇట్లు దలపడి యవ్వీరు లిరువురు నిశాచరవనచరబలంబులు రణం బుడిగి వెఱఁగుపడి తమపోరు సూచుచుండ నుద్దండవేదండ యుగళంబు పోలిక నాభీలశార్దూలద్వయంబు కరణి నసహ్యసింహ యమళంబు కైవడి నతిఘోరయుద్ధంబు సేయం దొడంగి; రంత. | 132 |
| క. |
వడి నొక్కపెట్ట లక్ష్మణుఁ | డడరించె నిశాతశరము లా రక్కసుపైఁ గడఁగి యతఁడు నాతనిపై | నెడపక నాటించెఁ గలయ నెనిమిది యమ్ముల్. |
133 |
| ఆ. |
వాఁడితూపు లొడల వడి నాటుటయు నొచ్చి | తోన కలుషరోషధూమకేతుఁ డతిశయిల్ల రాఘవానుజుం డురుచాప | శింజినీరవంబు సెలఁగఁ గవిసి. |
134 |