పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
ఇంద్రజిత్తు లక్ష్మణునిచేతఁ జచ్చుట (సం. 3-273-22)
మ. శితభల్లద్వితయంబునం గడువెసం జేదోయి ఖండించి ఖం
డితగోత్రాచలతుంగశృంగశతకోటిస్ఫారఘోరానల
ద్యుతిసాంద్రం బగు శాతభల్ల మొకటం ద్రుంచెం గనత్కుండలా
న్వితమై యొప్పు నిశాచరేంద్రుశిరమున్‌ వీరక్రియాదక్షుఁడై.
135
ఆ. భగ్నశాఖ మైన పాదపంబును బోలె | నిట్లు సంగరమున నింద్రజిత్తు
పడినఁ జూచి దైత్యబలములు భయమంది | పఱచెఁ; జెలఁగి యార్చెఁ బ్లవగబలము.
136
క. తనయునిమరణం బేర్పడ | విని దశకంధరుఁడు శోకవివశుం డై బో
రన బాష్పము లొలుకఁగ హా! | యనుచుం బదినోళ్ళుఁ దెఱచి యఱచెం బెలుచన్‌.
137
క. శోకంబు సైఁప లేక య | శోకవనంబునకు నరిగి సురశత్రుఁడు రో
షాకులుఁడై జానకిఁ బు | ణ్యాకారం జంపఁ జంద్రహాసము వెఱికెన్‌.
138
వ. అప్పుడు వయోవినయవృద్ధుం డయిన యవింధ్యుం డతని వారించి, యిట్లనియె. 139
చ. ‘ఇది తగునే దశానన! మహేంద్రుఁడు లోనగు దేవతాతతిం
గదనములో జయించి త్రిజగంబులఁ బేర్కొనియున్న నీకు ని
మ్ముదిత వధింతు నంట గడుమోసము గాదొకొ! యోపుదేని నే
పొదవఁగ రాఘవున్‌ గెలువు; ముగ్మలిఁ జంపినఁ బెంపు గల్గునే?’
140
వ. అనినం దద్వచనంబుల నుపశమితకోధుండై దోషాచరేశ్వరుండు సమరసన్నాహం బమర రథం బెక్కిమిక్కిలి బీరంబు సొంపార నఖిలసేనాసహితంబుగాఁ బురంబు వెల్వడి నడతెంచె; నంత. 141
శా. సుగ్రీవాదిసమస్తవానరులుఁ బ్రస్ఫూర్జన్మహావిగ్రహ
వ్యగ్రాకారతఁ బేర్చి భూరుహశిలావ్రాతంబులం దాల్చి వా
లాగ్రవ్యాచలనంబు లొప్ప దశకంఠాగ్రేసరోదగ్ర దై
త్యగ్రామంబు నెదిర్చినన్‌ సమర మత్యంతోగ్ర మయ్యెన్‌ వడిన్‌.
142
వ. ఆ సమయంబున నఖిలమాయాకుశలుం డైన దశముఖుండు మాయ గావించిన. 143
క. ఆ రావణుదేహంబున | ఘోరగదాశక్తిఖడ్గ కోదండధరుల్‌
వీరులు సహస్రసంఖ్యల | వారలు జనియించి రసురవరు లుద్ధతులై.
144
వ. వారి నందఱఁ గౌసల్యానందనుండు సాంద్రశరజాలంబుల నవలీలం దునిమి తూఁటాడిన నమ్మేటి రక్కసుండు మఱియు నొక్కమాయ ప్రయోగించి రామలక్ష్మణ ప్రతిరూపంబు లనేకంబు లుత్పాదించుటయు, నయ్యన్నయుం దమ్ముండును వెఱఁగు పడియునుం జిడిముడివడక యమ్మాయారూపంబు లన్నియుం దునిమి, తదనంతరంబ. 145
చ. అభినవభానుబింబరుచిరాకృతియున్‌ హరియుక్తమున్‌ మహా
రభసదురాసదంబును విరాజితకేతన వైజయంతికా
ప్రభయును నైన తేరు సురపాలకుపంపునఁ జేసి రాఘవ
ప్రభునకుఁ దెచ్చి మాతలి సభక్తికుఁడై ప్రియమొప్ప నిట్లనున్‌.
146
మ. ‘ధరణీనాథ! సురేంద్రుతే రిది; మహాదైత్యేంద్రులం దొల్లి యీ
యరదం బెక్కి యనేకులం దునిమె జంభారాతి ఘోరాజి; నీ
యరదం బెక్కివధింపు నీవును మదీయస్ఫార సారథ్య ని
ర్భరభంగిన్‌ దశకంధరుం ద్రిభువనీభంగోన్నమత్కంధరున్‌.’
147
మ. అనినన్‌ మాతలి నాదరించి యరదం బా రాఘవుం డెక్కియు
క్కున మీఱెన్‌ రిపుకోటిమీఁద విలసత్కోదండమౌర్వీమహా
స్వనభిన్నాఖిలదిగ్విభాగుఁ డగుచున్‌ శాతాస్త్రధారాభిషే
చనపూతప్రతిపక్షసైన్యుఁ డగుచున్‌ సంరంభదుర్వారతన్‌.
148
ఉ. అత్తఱి రావణుండు విలయానలదుస్సహమూర్తియై నరేం
ద్రోత్తముమీఁదఁ దేరు గడు నుగ్రగతిం బఱపించి సంతతో
ద్వృత్తశరప్రవాహపరివీతదిశాముఖుఁ డైనఁ జూచి పే
రుత్తలమంది రాతనిసముద్ధతికిన్‌ దివినుండి నిర్జరుల్‌.
149
వ. ఇట్లు దలపడి రామరావణు లతిఘోరంబుగాఁ బోరం దొడంగి; రంతఁ బంక్తివదనుండు నిబిడజ్వాలాకరాళం బగు శూలంబు రాఘవుమీఁదం బ్రయోగించిన, నతండును నడుమన దానిఁ దునియలు సేసిన, నీసునం బెరిఁగి సురవైరి మఱియునుం దరతరంబ శతసహస్రసంఖ్యల శూలంబులు భిండివాలంబులుఁదోమరంబులు శరంబులుం బఱఁగించి యంబరంబెల్ల నస్త్రమయంబుఁ గావించిన నఖిలభూతంబులును హాహాకారవ్యాకులంబు లయ్యె; నసురసైన్యంబున భేరీప్రముఖతూర్యనినదంబులు సింహనాదంబులు సెలంగెఁ; గొండొకసేపునకు రావణప్రయుక్తం బయిన శస్త్రాస్త్రదహనం బంతయు నిరంతరవిశిఖధారాసారంబునం గబళించి రామజలధరంబు గంభీరసారంబునం బొదలుటయు సకలప్లవంగసముదయంబును బ్రహర్ష కోలాహలబహుళం బయ్యెఁ; బదంపడి. 150
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )