ఇతిహాసములు భారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
ఆశ్వాసాంతము
సీ. భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు, | శ్రీవత్సగోత్రుండు, శివపదాబ్జ
సంతతధ్యాన సంసక్తచిత్తుఁడు, సూర | నార్యునకును బోతమాంబికకును
నందనుఁ, డిలఁ బాకనాటిలో నీలకం | ఠేశ్వరస్థానమై యెసకమెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు | ధన్యుండు ధర్మైకతత్పరాత్ముఁ
 
తే. డెఱ్ఱనార్యుండు సకలలోకైక విదితుఁ | డయిన నన్నయభట్టమహాకవీంద్రు
సరససారస్వతాంశప్రశస్తి దన్నుఁ | జెందుటయు సాధుజనహర్షసిద్ధిఁ గోరి.
469
క. ధీరవిచారుఁడు తత్కవి | తారీతియుఁ గొంతదోఁపఁ దద్రచనయకా
నారణ్యపర్వశేషము | పూరించెఁ గవీంద్రకర్ణపుటపేయముగాన్‌.
470
క. వీరావతార! విమలా | చార! మహోదార! శుభవిచార! సుజనమం
దార! నవకీర్తి మౌక్తిక | హార! హరపదాబ్జమధుకరాత్మవిహారా!
471
తరలము అమితవైభవ! లోభమోహమదాదిదుర్లభ! మంజువి
భ్రమ విలాసితకామినీజన పంచబాణ! నిరంతరా
నమదశేషనృపాలమౌళి పినద్ధముగ్ధమణిప్రభా
క్రమ సమంచిత విస్ఫురత్పదకాంతి నిర్జితపంకజా!
472
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునందు సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణయుద్ధంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రీ చరిత్రంబును, సూర్యుండు గర్ణునకు హితోపదేశంబు సేయుటయుఁ, గర్ణుజన్మంబును, నింద్రుండు విప్రరూపంబునఁ గర్ణు కవచకుండలంబులు హరించుటయు, నారణేయంబును, యక్షప్రశ్నలును, ధర్ముండు ధర్మజునకు వరంబు లొసంగుటయు నన్నది సర్వంబును సప్తమాశ్వాసము. 473
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి యారణ్యపర్వము సమాప్తము.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )