ఇతిహాసములు భారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
ధర్మరాజు యక్షప్రశ్నముల కుత్తరంబు లిచ్చుట (సం. 3-297-26)
క. ‘దినకరు నెయ్యది నడపును? | దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు? రద్దే
వుని యస్తమించు టేమిట? | ననఘ! తదాధారభూత మది యెద్దియొకో’?
423
తే. అనిన ధర్మజుఁ డిట్లను; ‘నబ్జహితుని | నడపు బ్రహ్మంబు; సురకోటి నడచు కొలిచి;
ధర్మువున నస్తమితుఁ డగుఁ దపనుఁ; డమ్మ | హాత్మునకు సత్య మాధార మండ్రు బుధులు.’
424
వ. అనిన విని యక్షుం డి ట్లనియె. 425
క. ‘ఏమిట శ్రోత్రియుఁ డనఁ జను? | నేమిటఁ గడుమహిమ వడయు నిమ్ముగఁ బురుషుం?
డేమిట సహాయయుతుఁ డగు? | నేమిట నగు బుద్ధిమంతుఁ? డేర్పడఁ జెపుమా!’
426
వ. అనిన నతం డి ట్లనియె. 427
క. ‘శ్రుతమువలన శ్రోత్రియుఁ డగు; | నతులతపోయుక్తిఁ గడుమహత్త్వము వడయున్‌;
ధృతిచే సహాయయుతుఁ డగు; | నతిశయముగ బుద్ధిమంతుఁ డగు బుధసేవన్‌.’
428
వ. అని చెప్పిన నప్పార్థివోత్తమునకు నప్పురుషుండు వెండియు ని ట్లనియె. 429
తే. ‘ఏమి కతమున భూదేవుఁ డెసఁగు దేవ | భావమున? నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు? నసాధుత్వ మెద్దానఁ జెందు? | మానుషుం డగు నాతఁ డేదానఁ? జెపుమ.’
430
చ. అనవుడు ధర్మజుం డనియె ‘నధ్యయనంబున దేవభావముం
గను నవనీసుపర్వుఁ; డధికవ్రతశీలత సాధుభావ మా
తనికి; విశిష్టవృత్తి దిగఁద్రావి యసాధు వనంగ నుండు; శౌ
చనియతి లేక మృత్యుభయసంగతి నాతఁడు మానుషుం డగున్‌.’
431
క. నావుడు నతఁ డాతనితో | ‘జీవన్మృతుఁ డెట్టివాఁడు? సెప్పు’ మనుటయున్‌
‘దేవాతిథిపితృభృత్యజ | నావళులకు నిడక కుడుచునతఁ’ డని చెప్పెన్‌.
432
చ. విని మగుడంగ వాఁడు పృథివీపతిఁజూచి ‘ధరిత్రికంటె వ్రేఁ
గనఁ జనుదాని, నాకసముకంటెఁ గడుం బొడవైనదాని, గా
డ్పునకును నెక్కుడై జవము పొంపిరివోయెడు దానిఁ, బూరికం
టెను దఱచైన దానిని, ఘటింపఁగఁ జెప్పుము నాకు’ నావుడున్‌.
433
వ. అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కి ట్లనియె. 434
ఆ. ‘తల్లి వ్రేఁగు సువ్వె ధరణికంటెను; నాక | సంబుకంటెఁ బొడవు జనకుఁ డరయ;
గాడ్పుకంటె మనసు కడుశీఘ్రగతి; తృణో | త్కరముకంటెఁ జింత గరము తఱచు’.
435
వ. అనిన నంబరచరుండు మఱియు నిట్లనియె. 436
తే. ‘మొనసి నిద్రించియును గన్ను మూయ దెద్ది? | పుట్టియును జేతనత్వంబుఁ బొరయ దెద్ది?
యరయ రూపు గల్గియు హృదయంబు లేని | దెద్ది? వేగంబుకతమున నెద్ది వొదలు?’
437
తే. అనినఁ ‘గన్ను మూయదు సుప్తమయ్యు మీను; | పుట్టియును గ్రుడ్డు చేతనఁ బొరయకుండు;
హృదయరహితంబు రారూప; మేఱు రయము | కతన వర్ధిల్లు’ నని చెప్పెఁ గౌరవుండు.
438
వ. చెప్పిన, నయ్యక్షుం డతనితోఁ ‘దెరువు నడచువానికి, రోగార్తునకు, గృహస్థునకు, మృతిఁ బొందినవానికి నెవ్వరు సుట్టంబు?’ లనిన నప్పుడమిఱేఁ ‘డన్నలువురకుం గ్రమంబున సార్థంబును, వైద్యుండును, సద్భార్యయుఁ, గృతంబైనధర్మంబును బరమమిత్త్రు’ లని నిర్దేశించుటయు; నయ్యక్షుండు పాండవేయున కిట్లనియె. 439
క. ‘ఎయ్యది ధర్మువునకుఁ గుదు | రెయ్యది యాశ్రయము గీర్తి కిమ్మగు మార్గం
బెయ్యది సురలోకమునకు | నెయ్యది సుఖమునకు నిక్క యేర్పడఁ జెపుమా!’
440
వ. అని యడుగుటయు. 441
క. ‘అమరఁగ దాక్షిణ్యము ధ | ర్మమునకుఁ గుదు రండ్రు; కీర్తిమహిమ నెలవు దా
నము; సత్యము సురపురిమా | ర్గము; శీలము సంశ్రయంబు సుఖముల కెల్లన్‌’.
442
వ. అని యుధిష్ఠిరుం డెఱింగించిన వెండియు. 443
చ. ‘నరునకు నాత్మ యెవ్వఁడు? ఘనంబుగ దైవిక మైన చుట్ట మె
వ్వ? రతనికిం దదీయ మగు వర్తన మేమిట నిర్వహించు? భూ
వర! యతఁ డేమి పూని యనవద్యతఁ బొందు? నెఱుంగఁ జెప్పు మీ
వరుదుగ’ నన్న నక్కురుకులాగ్రణి యాతనితోడ ని ట్లనున్‌.
444
తే. ‘ఆత్మజుఁడు సువ్వె పురుషున కాత్మ యయ్యె; | నాతనికి భార్య దైవిక మైన చుట్ట;
మతని జీవిక పర్జన్యుకతనఁ జెల్లు; | నతఁడు దానముఁ గొనియాడి యతిశయిల్లు’.
445
చ. అనవుడు ‘మేటిధర్మ మగునట్టిది యెయ్యది? యేది యెప్పుడున్‌
గనియఁగఁ బండియుండు? నెసకంబున నెయ్యది నిగ్రహించినం
దనరుఁ బ్రమోదసిద్ధి? నియతంబుగ నెవ్వరితోడి సంధి యెం
దును వికలంబు గాదు? పరితోష మెలర్ప నుపన్యసింపుమా!’
446
వ. అని దివ్యుండు పలికిన నా దివ్యబోధనుం డిట్లనియె. 447
ఆ. ‘విను మహింస మేటి యనఁజను ధర్మంబు; | యాగకర్మ మెపుడు నమరఁ బండి
యుండు; మనసుక్రొవ్వు ఖండింపఁగా మోద | మెసఁగు; సుజనసంధి యెడల దెందు’.
448
తే. అనిన నతఁడు ‘లోకమున కెయ్యదియ దిక్కు? | జలము నన్నంబు నెద్దాన సంభవించు?
విష మనంగ నెయ్యది? శ్రాద్ధవిధికి నెద్ది | సమయ?’ మనిన నిట్లని చెప్పె జనవిభుండు.
449
తే. ‘సజ్జనులు దిక్కు సూవె యీ సర్వమునకు; | నభము ధరణియు జలము నన్నమ్ము నుద్భ
వించు నెలవులు; విష మగు విప్రధనము; | లనఘ! శ్రాద్ధకాలము బ్రాహ్మణాగమంబు’.
450
వ. అని తెలిపిన, నయ్యక్షుండు ధర్మనందనుతో ‘మనుజుం డెయ్యది పరిత్యజించి సర్వజనప్రియుండును, నిశ్శోకుండును, నర్థవంతుండును, సుఖియును నగు?’ ననిన నమ్మహీపతి యి ట్లనియె. 451
తే. ‘సర్వజనసమ్మతుం డగు గర్వ ముడిగి; | క్రోధ మడఁచి శోకమునకుఁ గుదురు కాఁడు;
వినవె యర్థాఢ్యుఁ డగు లోభ మొనర విడిచి; | తృష్ణ వర్జించి సౌఖ్యంబుతెరువుఁ గాంచు’.
452
వ. అనిన యనంతరంబ యద్దివ్యుం డతనితోఁ ‘బురుషశబ్ద వాచ్యుం డెట్టివాఁడు? మఱి సర్వధని యగు వాఁ డెవ్వండు? నిశ్చయింపు’ మనినఁ బాండవజ్యేష్ఠుం డిట్లనియె. 453
క. ‘దివి ముట్టి ధరణియంతట | నివిడి మెఱయుచుండు నెవ్వనియశోరమ య
ట్టి విశిష్టచరిత్రుఁడు, య | క్షవరా! పురుషుండు నాఁ బ్రకాశత నొందున్‌.
454
ఆ. ప్రియము నప్రియంబుఁ బెల్లగు సౌఖ్యదుః | ఖములు భూతభావికార్యములును
నెవ్వనికి సమంబు లివి సర్వధనియనఁ | బరఁగుఁ జువ్వె యట్టి భవ్యుఁ డనఘ!’
455
వ. అని వివరించిన విని యుధిష్ఠిరుదెసఁబ్రసాదమధురం బైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు ‘మహాత్మా! మదీయంబు లైన ప్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి; నీవలనం బ్రీతుండ నైతి; నీతమ్ములయం దొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు’ మనిన నతండు. 456
సీ. ‘శ్యామాంగు నారక్తజలరుహనేత్రు సా | లప్రాంశు నున్నతలలితబాహు
నకులుని బ్రదికింపు’ నావుడు యక్షుండు | ‘భీమఫల్గును లతిభీమబలులు
ప్రియులు నీ కెంతయుఁ బృథివీశ! వీరిలో | నొకనిఁ గోరక యిట్లు నకులుఁ గోరి?’
తనుడు ధర్మాత్మజుం డనియెను ‘మాతండ్రి | యగు పాండువిభునకు మగువ లిరువు:
 
ఆ. రందు గొంతికొడుకు లైన మువ్వురిలోన | నేను బ్రదికినాఁడ; నింక మాద్రి
తనయు లిరువురందుఁ దగ నొక్కరుం డిపు | బ్రదుకవలదె? చెపుమ పాడితెఱఁగు.
457
ఆ. ధర్మనందనుండు ధర్మాత్ముఁ డని యెప్డుఁ | దగిలి జగము నన్నుఁ బొగడుచుండు;
నట్టి యేను ధర్మహానికి నోర్వఁజు | మ్మెంత వచ్చెనేని; యింత నిజము’.
458
వ. అనిన నతండు ‘నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి; నీతమ్ములందఱు లబ్ధజీవితు లయ్యెద’ రనిన నాక్షణంబ విగతక్షుత్పిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్కనిన తెఱంగున సముత్థితు లైనం జూచి, విస్మితుండై ధర్మపుత్త్రుం డి ట్లనియె. 459
చ. ‘నిను నొక యక్షమాత్రుఁ డని నెమ్మది నమ్మఁగ నేర నయ్యెదన్‌.
జననుత! నీవు నిక్కముగ శక్రుఁడవో, యలకాధిపుండవో,
యనలుఁడవో, సమీరుఁడవొ, యట్లునుగాక జగన్నుతుండు మ
జ్జనకుఁడు నైన ధర్ముఁడవొ? సత్కృపఁ జెప్పుము నాకు’ నావుడున్‌.
460
వ. అమ్మహాత్ముండు మందస్మితాననుండై. 461
మత్తకోకిల ‘ఏను ధర్ముఁడఁ జువ్వె రాజకులేంద్ర! సత్యము శౌచమున్‌
దానముం దపమున్‌ శమంబును దాంతియున్‌ యశముం బరి
జ్ఞానయుక్తియు నాదుమూర్తులు; సమ్మదంబున నిప్డు మ
త్సూను నుత్తమధార్మికున్‌ నినుఁ జూచు వేడుక వచ్చితిన్‌.
462
వ. న న్నాశ్రయించిన జనంబులు దుర్గతిం బొరయరు గావున నభిమతంబు లైన వరంబు లిచ్చెద’ నడుగు మనినఁ బాండవాగ్రజుండు సంభ్రమభక్తిపరుం డగుచు దండప్రణామంబు సేసి, యద్దేవోత్తముం బ్రస్తుతించి, ‘దేవా! మదీయాశ్రమవాసుండైన భూసురవరు నరణి యొక్కహరిణంబుచేత నపహృతంబయ్యె; నతనికిం గర్మలోపంబు గాకుండ నయ్యరణిం గరుణింపవే’ యనినఁ బ్రీతచిత్తుం డగుచు ధర్మదేవుండు. 463
క. ‘విను మేను నీమనోగతి | యనఘా! యెఱుఁగంగ వేఁడి యరణీహరణం
బొనరించితి; మృగ మెక్కడి?’ | దని యమ్మహనీయవస్తు వతనికి నిచ్చెన్‌.
464
వ. ఇచ్చి మఱియు నిట్లనియె; ‘పదుమూఁడవయేఁడు సనుదెంచె; నింక మీ రజ్ఞాతవాసంబు సలుపవలయు; నందు మీ రెవ్వ రెక్కడ నేరూపంబునం జరియింపం గోరిన నయ్యైరూపంబు లలవడియెడు; నె ట్లున్నను మి మ్మెవ్వరు నెఱుంగకుండు నట్లుగా వరం బిచ్చితి; నింకనొం డెయ్యదివలసిన నడుగు’ మనిన నమ్మనుజేశ్వరుం డి ట్లనియె. 465
మత్తకోకిల ‘ఆదిదేవుఁడ వైన నీవు దయామతిం బొడసూపి న
న్నాదరించుటఁ జేసి ధన్యుఁడ నైతి; నింతకు నెక్కు డొం
డేది కల్గునె? యైన నామది యెల్లనాఁడును గ్రోధ మో
హాదులం బెడఁ బాసి ధర్మువునంద నెక్కొనఁ జేయవే!’
466
వ. అనిన నద్దేవుం డతనికి నవ్వరం బొసంగి యంతర్హితుం డయ్యెఁ; గౌంతేయులు గ్రమ్మఱి నిజాశ్రమంబున కరిగి, ధరణీదేవునకు నరణీప్రదానంబు సేసి, తత్ప్రయుక్తాశీర్వాదంబులు గైకొని, పరమానందంబునం బొంది రని యిట్లు పాండుతనయుల వనవాసప్రకారంబు సవిస్తరమధురంబుగా నుపన్యసించి. 467
క. అనఘుఁడు గృష్ణద్వైపా | యనశిష్యుఁడు బోధనిధి సమంచితమేధా
ఘనునకుఁ బారిక్షితునకు | ననవరతానందసుఖసమగ్రత యొసఁగెన్‌.
468
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )