పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుఁడు ధర్మజున కుచిత వచనంబుల మనస్తాపోపశమంబు సేయుట: (సం. 12-8-1)
క. ‘ఓహో! యిట్టివి గలవే? | బాహాదర్పమునఁ బరులఁ బరిమార్చి తుదిన్‌
మాహాత్మ్యం బెడలఁగ భి | క్షాహారత నొందఁ దలఁప నగునె నరేంద్రా!
48
సీ. ధర్మపథంబున ధరణి సేకుఱినఁ బా | లింపక సత్త్వంబు పెంపు మాలి
విడుచుట యొప్పునే; విను: మిట్టులైన ము | న్నేల భూపాలుర నెల్లఁ జంపి?
తడలి రాజ్యము దక్కి యడవికిఁ జనిన బే | లందురు గాక, మే లండ్రె జనులు?
కిల్బిషశంక గల్గిన నశ్వమేధాది | పుణ్యకర్మంబులఁ బోదె? వంశ
 
ఆ. ధర్మ మెడలఁ గృపణకర్మంబుఁ గోరి; త | ర్థంబు సువ్వె సకలధర్మకారి;
‘యొడమి లేనివాఁడ నడపీనుఁ’ గను నహు | షోక్తి వినమె? దాని నూఁద వలదె?
49
క. సరిగా నెన్నుదు రార్యులు | దరిద్రునిం బతితునిం గృతఘ్నుని జడునిన్‌
దొరకొను ధర్మముఁ గామముఁ | బరమగతియు నర్థమునన పౌరవముఖ్యా!
50
క. కలిమియ చుట్టలఁ జేర్చుం; | గలిమియ చెలులను ఘటించుఁ గలిమియ శౌర్యో
జ్జ్వలుఁ డనిపించుం; గలిమియ | పలువురు సద్బుద్ధి యనఁగఁ బరఁగం జేయున్‌.
51
క. ఏవాని బంధుమిత్రులు | జీవధనంబులును డప్పిఁ జెందును గృశునిం
గా వాని నెన్నఁగాఁ దగుఁ, | గేవల తనుకార్శ్వయుతుఁడు గృశుఁడె నరేంద్రా!
52
వ. కావున నర్థోపార్జనంబును బంధుమిత్త్రపరితోషంబును భూపతులకుం బరమ పురుషార్థం; బదియునుం గాక. 53
తే. జ్ఞాతి నాశనమునఁ గాదె సకల దేవ | తలు ప్రవర్ధన మొందుట; ధనము లడిచి
పొడిచి యొప్పనివారిచేఁ బుచ్చికొనక | యడఁగియుండంగఁ జేరునే యండ్రు బుధులు.
54
వ. వేదంబులు నిట్లు సెప్పుఁ బృథివి బలువునం గైకొని పార్థివు లర్థంబు లుపార్జించి పర్జన్యాదులగు నాదిత్యుల నధ్వరక్రియాజాతంబునం బ్రీతులంజేసి యుత్తమలోకంబులు వడయుదు; రిట్టితెరువు వట్టి దిలీప నృగ నహుషాంబరీష మాంధాతలు నడచుట వినమె? తత్పదవి నీ కొదవి యున్నయది; తదీయ ప్రకారంబున బహుళ దక్షిణవిధానంబుగాఁ బ్రభూతంబైన యజ్ఞంబు సేయవైతేనిఁ జూవె నకిల్బిషుండ వగుట; యశ్వమేధంబు సేసిన రాజు లెల్ల నవభృథంబునం బరిపూతాత్ము లగుదు’ రని పలికిన న య్యజాతశత్రుండు. 55
క. వెడవెడ నప్పలుకులు చెవి | నిడి, కొండొకసేపు చింత యెసకంబున పా
ల్పడి యూరకుండి చిత్తం | బడలునఁ జిక్కువడ నిట్టు లను నర్జునుతోన్‌.
56
క. ‘నేమపుఁ దెరు వొక్కటి గల; | దే మెచ్చితి దాని; నడుగు మెయ్యది యని సు
త్రామసుత! యడుగకున్నను | నేమి? వినుము చెప్పెదను మునీంద్రుల కెక్కన్‌.
57
సీ. ‘సారహీనము లగు సంసారసుఖములు | విడిచి, యేకాకి నై యడవి కేఁగి,
తాపస వాక్యామృతములు వీనులఁ గ్రోలి, | చెలిమి వేర్పాటను చిరమరలకుఁ
జొరక, నిందాస్తుతుల్‌ సరిగాఁ గొనుచుఁ గత్తి | నొకఁడు వ్రేసినను వేఱొక్కరుండు
చందనం బలఁదిన డెంద మయ్యిరువుర | యెడ సమంబుగ మూఁగజడుఁ డనంగ
 
తే. మెలఁగి, తగువేళఁ బర్ణశాలలకు నరిగి | యెత్తఁగా భిక్ష యెవ్వార లెట్టు లేమి
యిడినఁ గైకొని నాలుగే నెడల మాత్రఁ | గన్నదానఁ దృప్తుండనై యున్న మేలు.
58
క. అటుగాక కర్మగతి లం | పటుఁడ నగుదు నేని నల్పఫల భాగితమై
నట యిట దిరుగుచు మోక్ష ని | కట వృత్తికి బాహిరుండఁ గానె కుమారా!
59
వ. కావున నాకు దొరకొన్న విమలప్రజ్ఞామృతం బనుభవింపక తక్కుదునే? యిది శాశ్వతపదప్రదం’ బనిన విని యనిలతనయుం డతని కిట్లనియె. 60
క. ‘శ్రుతివిహిత కర్మజాత | స్థితి యోగ్యుఁడ వైన నీకుఁ జేయఁగ వశమే
యతిలోకజ్ఞానసమ | న్వితయతిజనకృత్య? మటు వివేకింపు మెదన్‌.
61
చ. అడలున రాజధర్మములయందు జనించె నసూయ నీకు ని
ప్పుడు; మును నిస్పృహుండ వయి పోవఁగఁ గన్నఁ గులంబువారు ని
ప్పుడమి నృపాలురున్‌ బ్రతికిపోదురు నెమ్మది; నట్టులైన నే
ముడుగుదు మస్త్రజీవన సముద్ధతిఁ, జొత్తుము భైక్షవృత్తికిన్‌.
62
క. వాఁడి యగు నలుక లోకము | పోఁడిమి సెడఁ గయ్య మట్లు పొడిచి వనటమై
నేఁ డింక నడవికిం జను | వాఁడం గా కనినఁ బుడమివారలు నగరే!
63
సీ. పనివడి త్రవ్వి కూపమునందు నుదకంబు | పానంబు సేయని వాని భంగి,
యున్నతతరు వెక్కి జున్ను సేకుఱఁ గొని | తేనియ యానని వాని భంగి,
యాఁకొని యొడఁగూర్చి యన్నంబు తళియకు | వచ్చినఁ గుడువనివాని భంగి,
తమకించి యొకభంగిఁ దనవశంబుగఁ జేసి | మానినిఁ గవయని వాని భంగి,
 
ఆ. గాదె కురువరేణ్య! ఘనశక్తి శౌర్య సం | పన్నులైన పగఱ భండనమున
నోర్చి పూజ్యరాజ్య మొల్లక యడవికి | నేఁగు; టీవ యెఱుఁగు దిత్తెఱంగు.
64
క. నీ వడవి కరుగ నొడఁబడి | నీ వెనుకన వచ్చునపుడు నిందింతురు మ
‘మ్మీ వెఱ్ఱు లితని మాన్పం | గా వలఁతులు గార’ యని జగజ్జను లధిపా!
65
క. భోగములఁ బాపి నిందా | భాగులఁగాఁ జేసి యడవి పాల్వఱిచెదవే
నీ గారవంపుఁ దమ్ముల | సాగరవృతధరణిఁ గలుగు జనములు వగవన్‌.’
66
క. ‘కేవల నిష్కర్మత మో | క్షావహ మగునేని గిరులు నవనీజములున్‌
భూవర! ముక్తిం బడయం | గా వలవదె; యడవి నునికి కైవల్యదమే?
68
క. ఫలములయెడ బ్రహ్మార్పణ | కలనపరుం డగుచుఁ గార్య కర్మము నడపన్‌
వలయుం; దత్త్త్వజ్ఞానము | దలకొనినం గర్మశమము దానై కలుగున్‌.
69
వ. కావునం గర్మహీనత్వం బపవర్గకరంబుగా’ దనవుడు నర్జునుండు ధర్మనందను నుద్దేశించి ‘దేవా! యొక్కయితిహాసంబు గల దవధరింపు’ మని యిట్లనియె. 70
సీ. ‘కొందఱు బ్రాహ్మణుల్‌ గొండుక లాత్మ కు | లోచితాచారంబు లుడిగి కాన
లకుఁ జన్న వజ్రి వారికిఁ గృప చేసి ప | తత్త్రిరూపమునఁ దత్పార్శ్వమునకు
నరిగి, ‘మీ కైకొన్న తెరు వొప్ప’ దనవుడు | విని, వా రఖిల మార్గవేది యద్భు
తాస్పద మీపక్షి యని దాని కభిముఖు | లై ‘సత్పథం బెద్ది యనఘ! చెపుమ!’
 
తే. యనిన ‘నలుగాలివాన గోవును, నశేష | శబ్దముల మంత్రమును, లోహజాతిఁ గాంచ
నమును, మనుజుల విప్రుండు సమధికత్వ | భాజనము లండ్రు వేదప్రపంచవిదులు.’
71
వ. ఇ ట్లుత్తముం డైన విప్రుం డుత్తమ మంత్రోపాశ్రితంబులగు విహిత కర్మంబులు నడపుట రత్నకాంచన సాంగత్యంబునుం బోలె లోక సంస్తుత్యంబై యుండు; నాలస్యంబునఁ గ్రోధంబున శోకంబునఁ దదనుష్ఠానంబు విడుచుట పాతకం; బజ్ఞానులగు నర్థహీనులు సన్న్యాసకాల వివేకంబు లేక వేగిరపడి యుభయభ్రష్ఠు లగుదురు; గృహస్థ ధర్మంబున వర్తించి యతిథి దేవ పితృసంతృప్తి సేయుచు శిష్టాన్న భోజన పరులగు పుణ్యులకుం బుణ్యలోకంబు లఱచేతిలోనివి గావె?; బ్రహ్మార్పితం బయిన సత్కర్మకలాపంబు మహానందంబుఁ జేయు ననుటయు. 72
క. విని వారు దెలిసి మరలం | జనిరి గృహస్థత్వ ధర్మ సదనుష్ఠానం
బునకు; నటు లగుట నేలుము | జనవల్లభ! పుడమి; నడపు జన్నము లెలమిన్‌.’
73
వ. అని చెప్పె; నప్పుడు నకులుం డన్నరనాథున కిట్లనియె. 74
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )