| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘శుచియును హంసుండు శుచిషత్తుఁ బరముండుఁ | బరమేష్ఠియును నగు భవ్యుఁ గొలుతు; మునులును సురలు నెవ్వనియున్నరూపెఱుం | గరు సర్వవిదుని నప్పురుషుఁ గొలుతు; శ్రుతులు సెప్పఁగ మహామతులు దుఃఖౌషధం | బుగ నెఱింగెడు పుణ్యమూర్తిఁ గొలుతు; లోకంబు లెల్లఁ గల్గుట నిల్చు టొదుఁగుట | తనయంద యగు మహోత్తరునిఁ గొలుతు; |
|
| తే. |
బక్షి రత్నచయంబు బుష్ప వ్రజంబుఁ | బంజరము త్రాడు నార యుపాశ్రయముగ నుండు చాడ్పున విశ్వంబు నుండుటకు సు | ఖాస్పదం బగు పుండరీకాక్షుఁ గొలుతు. |
20 |
| ఆ. |
హరి సహస్ర శీర్షుఁ బరము సహస్రాక్షు | వేదమయు సహస్రపాదు నలఁతు లైన వారి కంటె నలఁతి పెద్దలకును | జాలఁబెద్ద యగు దయాళుఁ గొలుతు. |
21 |
| క. |
అమృతమయు, ఋగ్యజు స్సా | మముల యుపనిషద్వచ స్సమాజములకు వా చ్యమయిన పురుషోత్తము, ని | క్కము రూపగు వాని భక్తిగమ్యుఁ దలంతున్. |
22 |
| ఆ. |
అరణి నగ్ని వొడము కరణి దేవకి యందు | విప్రకర్మయజ్ఞ వేద గుప్తి కై జనించె నెవ్వఁ డవ్వసుదేవ నం | దను భజింతు నేకతానిరూఢి. |
23 |
| తే. |
ఒకఁడు పండ్రెండు మూర్తులై యుండునట్లు | గా హిరణ్య వర్ణంబగు గర్భ మదితి దాల్చి యెవ్వానిఁ గనియె దైత్యఘ్ను నట్టి | దేవు సూర్యాత్మకునిఁ బ్రణుతింతు విష్ణు. |
24 |
| క. |
సురపితృకోట్లం బూర్వా | పర పక్ష దినముల నమృత పాన ప్రీతిం బొరయం జేయుచు వెలిఁగెడు | హరి సోమాత్మకునిఁ గొల్తు నాత్మేశ్వరునిన్. |
25 |
| తే. |
విశ్వసృజులను మునులచే వితతమగు స | హస్ర వత్సర కలిత మహాధ్వరమునఁ గశ్యపబ్రహ్మ యెవ్వానిఁ గనియెఁ గనక | పక్షు దార్‌క్ష్యాత్ముఁ దలఁతు నప్పద్మనాభు. |
26 |
| క. |
సువ్యక్త క్షేత్రంబున | నవ్యక్తాకృతి నిరూఢి నాసీనుం డై భవ్యత నుండెడు క్షేత్రా | త్మ వ్యపదిష్టుఁ బ్రణుతింతు దామోదరునిన్. |
27 |
| క. |
ప్రకృతి వికృతులను షోడశ | వికారముల బెరసి ప్రకృతి వికృతిత్వము లొం దక యుండఁ గాంతు రెవ్వని | సకల మునులు దలఁతు నట్టి సాంఖ్యాత్ము హరిన్. |
28 |
| క. |
అంతశ్చర మారుతములు | శాంతములుగఁ జేసి యనలసత్వము శమమున్ దాంతియు గల జనములు గను | నంతర్హితుఁ గొలుతు జలశయను యోగాత్మున్. |
29 |
| క. |
ఉపరమముం బ్రాపించిన | యపుణ్య పుణ్యములు గలుగు నతిశాంతులు భ వ్యపుగతిఁ బొందెడు నానం | దపు రూపుని విష్ణుఁ దలఁచెదను మోక్షాత్మున్. |
30 |
| తే. |
చరణ నాభి శీర్షంబులు ధరయు నంత | రిక్షమును దివమును జగచ్చక్షు రగ్ని దిశలు దృజ్ముఖ శ్రోత్రముల్ దీప్తు లెమ్మ | హాంగునకు నట్టి హరిని లోకాత్ముఁ దలఁతు. |
31 |
| క. |
భూతముల మ్రింగి, లోక | వ్రాతము జలమయముఁ జేసి, వశ్యాత్మత ని ద్రాతిశయంబున బాలుం | డై తేలెడు వానిఁ దలఁతు హరి మాయాత్మున్. |
32 |
| తే. |
అంబుదంబులు గేశంబులందు, నదులు | సర్వ తనుసంధులందును, జలధు లుదర దేశమున యందు నున్నట్టి దేవదేవుఁ | గొలుతుఁ దోయాత్ము దేవకికొడుకుఁ గృష్ణు. |
33 |
| తే. |
వదన బాహూరు పదము లెవ్వాఁడు విప్ర | రాజ వైశ్య శూద్రులకు సంప్రభవ దేశ ములుగ వెలుఁగొందు నమ్మహామూర్తి విభవ | దీప్తు వర్ణాత్మకునిఁ బ్రణుతింతు విష్ణు. |
34 |
| క. |
మాసర్త్యయనాబ్దమయో | ద్భాసిత రూపుఁ డయి సృష్టిఁ బ్రళయంబుఁ దగం జేసి పొలుపారు శౌరి ను | పాసింతును యోగి భోగ్యబలుఁ గాలాత్మున్. |
35 |
| క. |
ముని దివిజాదిక లోకము | లనంతుఁ డన జగతి కెల్ల నాధారం బై పెనుపొందెడు శేషాత్ముని | వినుతింతున్ విష్ణుభక్తి విభవ విధాయిన్. |
36 |
| క. |
ఆదిత్య మరుద్వసురు | ద్రాదిదివిజ గణము లెల్ల నవయవ రూపో త్పాదకలితు లెవ్వానికి | నా దేవుని సంస్తుతింతు హరి దేవాత్మున్. |
37 |
| క. |
సర్వము నందును దానున్ | సర్వముఁ దనయందు నుండు సంచారంబున్ సర్వమునకుఁ దన వలనన | సర్వాత్మకు నట్టి వృష్ణిసత్తముఁ దలఁతున్. |
38 |
| క. |
మీనయి తా నతలగతం | బైన నిగమ చయముఁ దెచ్చి యజునకు నొసఁగం గా నేర్చిన సుమనస్స | మ్మానిత విగ్రహు భజింతు మత్స్యా త్ము హరిన్. |
39 |
| క. |
అమృత మథనమున మంథన | గము లీలోద్ధరణకేళిఁ గైకొని సురసం ఘమునకుఁ బ్రియ మొనరించిన | యమేయుఁ గూర్మాత్ము నంబుజాక్షుం గొలుతున్. |
40 |
| క. |
వారాహ రూపమునఁ బెం | పారిన తన దంష్ట్ర నొకట నవని సగిరికాం తారంబుగ నెత్తిన యా | శౌరిం గ్రోడాత్ముఁదలఁతు సమ్యగ్భక్తిన్. |
41 |
| ఆ. |
నారసింహవపు రుదార భావము నొంది | ఘను హిరణ్యకశిపు ఖర నఖముల వ్రచ్చి దీప్తమూర్తి వఱలు నృసింహాత్ము | నాత్మభవుని భక్తి నాశ్రయింతు. |
42 |
| క. |
వామన రూపంబున ను | ద్దామ బలున్ బలి నడంచి త్రైలోక్యాతి క్రామితఁ బేర్చిన యద్భుత | ధాముం గ్రాంతాత్ముఁ దలఁతు దామోదరునిన్. |
43 |
| ఆ. |
పరశురాముఁ డనఁగ భవ్యుఁడు జమదగ్ని | కుద్భవించి యిరువదొక్కమాఱు మనుజపతుల నెల్లఁ దునిమిన క్రోధాత్ము | నధిక భక్తి శారినాశ్రయించు |
44 |
| క. |
క్షత్రాత్ముఁ గొలుతు దశరథ | పుత్రున్ శ్రీరాముఁ డనఁగఁ బొలిచిన దేవున్ శత్రుభయదు రావణు నొక | మాత్రం దునుమాడినట్టి మధుసూదనునిన్. |
45 |
| క. |
హల ముసల ధరునిఁ గరుణా | నిలయ హృదయు రాము రౌహిణేయు సితాంగున్ జలద నిభాంబరుని శుచిం | దలఁతును గోవిందు శౌర్యధను భోగాత్మున్. |
46 |
| మ. |
యదువంశంబున వాసుదేవుఁ డనఁ గ్రీడార్థంబు జన్మించి, దు ర్మద దైత్యావలిఁ గూల్చి, పార్థునకు సారథ్యంబు త్రైలోక్య స మ్మద మారంగ నొనర్చి, దేవముని సమ్మానోద్ధృతిన్ భూభరం బు దొలంగించిన చక్రి నంబురుహనాభుం గొల్తుఁ గృష్ణాత్మునిన్. |
47 |
| క. |
కలికాల చలిత ధర్మము | నిలుపంగల యట్టి విష్ణునిం గల్క్యాత్ముం దలఁతుఁ దురగ వాహను మ్లే | చ్ఛుల నెల్లం గీటడంచు శుభచారిత్రున్. |
48 |
| ఆ. |
క్షరము లైన భూత సంఘంబులం దెల్ల | నక్షర స్వరూపుఁడై వెలుంగు సకల బుద్ధివృత్తి సాక్షి సాక్ష్యాత్ము న | స్పందబోధఘను ముకుందుఁ దలఁతు. |
49 |
| సీ. |
పరమేశ పుణ్య, సుబ్రహ్మణ్య, భక్తవ | త్సల, మహాదేవ, విశ్వప్రకాశ కరణ, హృషీకేశ, వరద నారాయణ, | రాజీవనయన, హిరణ్యనాభ, యఖిల లోక నమస్కృతాంఘ్రి సరోరుహ | యజ్ఞాంగ, యచ్యుత, యమృతరూప! నీకు మ్రొక్కెదఁ గరుణింపవే యతసీ కు | సుమ వర్ణ పీతాంబరము ధరించి |
|
| ఆ. |
యున్న నిన్ను నెవ్వ రుల్లంబునందుఁ ద | లంతు రట్టి వారలకు భయంబు గలుగదెందు నేమి కార్యంబులం దెప్డు | వినుత మంగళాయతనమ వగుట. |
50 |
| క. |
మంగళము విష్ణుదేవుఁడు | మంగళ మెమ్మైఁ దలంప మధురిపుఁ డుద్య న్మంగళ మంభోజాక్షుఁడు | మంగళ మఖిలము విహంగమ ధ్వజుఁ డరయన్. |
51 |
| క. |
నారాయణ పరములు నిజ | మారయ బ్రహ్మంబుఁ బరము నంచిత సత్యో దార తపంబులుఁ గావున | నారాయణపరత వీని నాల్గిటి నిచ్చున్. |
52 |
| తే. |
విష్ణుమయ మగ్ని, హవియును విష్ణుమయము, | విష్ణుమయము సర్వంబును విశదబుద్ధి నిట్లగుటఁ గందుఁ గావున నించుకేనిఁ | గల్మషము నాకు లేకున్కి గానవచ్చు. |
53 |
| క. |
శరణాగతుండ భక్తుఁడఁ | బరమ పదవిఁ గోరెదను శుభంబుగ నన్నుం బరికించి యేది మే ల | య్యిరవు దొరకొనంగఁ దలఁపవే కమలాక్షా! |
54 |
| తే. |
తపమునకు విద్యకును జనుస్స్థానమైన | జనన రహితుని యజ్ఞాత్ము శౌరి వాఙఙఙ్మ యాధ్వరార్చితుఁ జేసితి; నా జనార్ద | నుండు మద్భజనమునఁ బ్రీతుండు గాత!’ |
55 |
| క. |
అని యి ట్లతుల స్తోత్రం | బున హరిఁ బూజించి గంగపుత్రుఁడు మదిలో న నమః కృష్ణాయ యనుచు | వినతశిరస్కుఁ డయి మ్రొక్కె విశ్రుతభక్తిన్. |
56 |
| వ. | అని పలికె నని చెప్పి వైశంపాయనుం డిట్లనియె. | 57 |
| క. |
స్తవరాజం బనఁగ ముని | స్తవనీయం బైన యీ వృషాకపి భవ్య స్తవనామృతార్ణవము సం | స్తవనంబున నిచ్చు సుగతి జగతీనాథా! |
58 |
| క. |
విను జనమేజయ భూవర! | యనుత్తమంబయిన యిమ్మహా స్తవము పఠిం చిన వినినను వ్రాసిన శ్రీ | యును నాయువుఁ బెంపుఁ బేరు నొసఁగు జనులకున్. |
59 |
| వ. | అని చెప్పి వైశంపాయనుండు వెండియు నిట్లనియె. | 60 |
| తే. |
అట్లు హరిఁ బ్రస్తుతించి శాంతాత్మవృత్తి | నూరకున్న శాంతనవుని భూరితేజు న మ్ముకుందునిఁ గీర్తించి రచట నున్న | పరమ మునులు గద్గదికతోఁ గురువరేణ్య! |
61 |
| వ. | అంత నిక్కడ. | 62 |
| ఉ. |
ఆ దివిజాపగాతనయు నంచిత భక్తికిఁ బ్రీతిఁ బొంది దా మోదరుఁ డప్పు డన్నరవరోత్తముచి త్తమునందు సర్వలో కాదృత దివ్యబోధ మహిమాతిశయం బుదయింపఁ జేయుచుం దా దయతోడ సెజ్జ డిగి ధర్మజుమోమునఁ జూడ్కి పర్వఁగన్. |
63 |
| వ. | ‘భీష్ము పాలికిం బోదము ర’ మ్మని పలికి కృతపరికరబద్ధుండై వెడలి రథం బెక్కి ,సాత్యకిం దన పిఱింది వలనం బెట్టికొనియె; ధర్మనందన ధనంజయు లొక్క తేరును మారుతి నకుల సహదేవు లొక్క యరదంబును గృప యుయుత్సు సంజయు లొక్క స్యందనంబును నెక్కి తదీయంబులగు నేమీ నినాదంబులు దిక్కులం బిక్కటిల్ల నుచిత పరివార పరివృతులై నడచి; ర ట్లరిగి యస్థికేశ బహులంబును బహు ద్విప కుంభ ఖండ నర కపాల పాళి నిబిడంబును నై ప్రేతపత్యనుభూతోజ్ఝితం బైన యాపాన భూభాగంబు ననుకరించు, కురుక్షేత్రంబు దఱియు సమయంబున నయ్యంబుజాక్షుండు పాండవాగ్రజుతోడ. | 64 |
| తే. |
‘దూరమున నైదు మడువులు దోఁచుచున్న | యవి నరేశ్వర! మును వీనియందుఁ గాదె పరశురాముండు సేసెఁ దర్పణము నృపుల | రక్తమున భూరితర పితృభక్తి వెలయ. |
65 |
| మ. |
క్షితి నెందుం జరియించి భూపతుల నిశ్శేషంబుగా నేకవిం శతి వారంబులు ద్రుంచి యాతఁడు దుదిన్ శాంతత్వముం బొందె సు వ్రతుఁడై’ నావుడు నమ్మహీశుఁ ‘డతఁ డీ క్రౌర్యంబు సేయంగ నే ల తొడంగెన్? నృపు లెట్లు గల్గి రిల యెల్లం గైకొనం గ్రమ్మఱన్?’ |
66 |
| వ. | అనుటయు నచ్యుతుండు ‘నప్పరశురామ జన్మప్రపంచంబును, దదీయ క్రోధ కారణంబును, నృపలోక మారణంబును, భూపాల వంశ పునస్సంభవ ప్రకారంబును మునులవలన వినిన చొప్పునం జెప్పెద’ నని యజ్జనపతి కి ట్లనియె. | 67 |