| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
మణిహేమ పర్యంక మహితోపవేశుని సురుచిరాభరణ విస్ఫురితగాత్రుఁ, గౌస్తుభరత్న వికాసి వక్షస్స్థలుఁ, బీతకౌశేయ సంవీతమూర్తి, మేరు తటీగత మేఘసంకాశు నక్షత్రగణావృత గగన సదృశు, నూతనోదిత రవి ద్యోతితోదయ గిరి నిభు రుక్మ బద్ధేంద్రనీల తుల్యు, |
|
| ఆ. |
నమ్మురారిఁ గని కృతాంజలి యై భక్తిఁ | జిత్తవృత్తి గరము జొత్తిలంగ నంతకంత కాననాంబుజ మలరంగ | నిట్టు లనియెఁ దియ్య మెసక మెసఁగ. |
3 |
| తే. |
‘కడపితే రాత్రి సులభసౌఖ్యంబుగా? మ | నంబు గాఢప్రసన్నమే యంబుజాక్ష! దైవి యగు నీదు బుద్ధి కతమునఁ గాదె | ధర్మగతిఁ బ్రాభవంబుఁ బొందంగఁ గంటి. |
4 |
| వ. | త్రిభువన వ్యాప్త విక్రముండ వగు నీ కటాక్షంబున కలిమిం గాదె జగత్త్రయ సంభావనీయుండనై వెలింగితి’ ననుచుం జేరంబోయి. | 5 |
| క. |
తన యుచితాలాపములకు | మనుజేశ్వర! మాధవుండు మఱుమాట యొకం డును బలుకక భవ్య ధ్యా | న నిరూఢత నున్న యపుడు నరపతి యతనిన్. |
6 |
| వ. | నిరూపించి యిట్లనియె. | 7 |
| సీ. |
‘పంచాత్మకంబైన పవనంబు నిగృహీత మైనది, భవదింద్రియములు మనము నందాఁగఁ బడ్డవి, యవియును నదియును | బుద్ధియం | దొదిఁగించి శుద్ధమైన నాలవ తెరువున లోలతారహితముల్ | గాఁగ నిన్నియును సంకలితములుగ నంచిత క్షేత్రజ్ఞునందుఁ గూర్చినవాఁడ | వీ పరమధ్యాన మేమి కతన |
|
| తే. |
నొలసెనొకొ! లోకములకు నొండొక్క వింత | లేక నెమ్మది యున్నదియే? కరంబు విస్మయముఁ బొందె నా మది; వినఁగ నర్హ | మేని వినిపింపవే నాకు నిత్తెఱంగు.’ |
8 |
| వ. | అని యిట్లు ధర్మనందనుండు నివాతనిశ్చలదీప ప్రకారంబున నున్న యప్పరమపురుషుం బ్రార్థించి మఱియును. | 9 |
| తే. |
‘క్షరము నక్షరమును నీవ; కర్తయును వి | కర్తయును నీవ; యాద్యంత గతులు నీవ; యొక్కఁడై వెలిఁగెడు పురుషోత్తమాభి | ధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్య! |
10 |
| వ. | ప్రసన్నుండ వగుము; నా డెందంబు సందియంబు వాయం జేయవే!’ యని విన్నవించినం బాంచజన్యధరుండు బుద్ధియు మనంబు నింద్రియంబులును గోచరత్వ సంప్రాప్తంబులు గావించి, కొంచెపు నగవున నెమ్మొగం బొప్ప నప్పుడమిఱేని నాలోకించి యిట్లనియె. | 11 |
| సీ. |
‘గంగ యెవ్వనిఁ ‘దన గర్భంబునం దతి | శ్లాఘా సమేతయై సంభరించె; భార్గవుం డెవ్వనిఁ బరమశిష్యుఁడు గాఁగఁ | బడసి గురుత్వ మెక్కుడుగ నెగడె; నారాముఁ డెవ్వనితో రాసి యిరువది | మూఁడు దినములకు వాఁడి దఱిఁగెఁ; గాశీశు కన్యలు గారణంబుగఁ బోరి | యెవ్వని కోడి రనేక నృపులు; |
|
| తే. |
వేదములు నాలుగును ధనుర్వేదమును మ | హాస్త్రములుఁ జెంది యెవ్వనియందు వెలిఁగె నట్టి భీష్ముండు న న్నిప్పు డాత్మఁ దలఁచు | చునికిఁ దద్గతమయ్యె నా మనము నధిప! |
12 |
| క. |
అనలము శమించు చాడ్పున | ననఘ! యతండు పరమోన్ముఖాత్ముండై తా ననుఁ దలఁచె నింద్రియంబులు | మనమునఁ దగ నిగ్రహించి మహిత సమాధిన్. |
13 |
| క. |
శరతల్పగతుం డతఁడే | శరణంబుగ నాశ్రయించి సద్భావ వ్యా ప్తిరతుం డగుటను విను త | త్పరత నతనియందు నాదు భావం బెలసెన్. |
14 |
| వ. | ఇది మదీయ ధ్యానంబు తెఱం; గమ్మహాత్ముండు వసిష్ఠు శిష్యుండు, భూత భవిష్య ద్వర్తమానవేది, సర్వ విద్యా ధార భూతుం డాతం డస్తమించిన ధాత్రి యస్తమిత సుధాగభస్తి యగు రాత్రియుంబోలె నగు; సకలజ్ఞానంబులు ననాశ్రయంబులై పొనుంగు పడుం; గావున నీ వతని పాలికిం బోయి నీ యడుగం దలంచిన యఖిల ధర్మంబులు నడిగి చెప్పించుకొని నిశ్శేష నిరస్త సంశయుండవు గావలయు’నని యానతిచ్చిన నమ్మానవపతి గద్గద కంఠుం డగుచు నా వైకుంఠున కి ట్లనియె. | 15 |
| ఉ. |
‘శంతనుసూనుగౌరవము సర్వము మున్నును వింటి విప్రు ల త్యంతము వేడ్కఁ జెప్ప నతఁ డట్టిఁడ; యాతని నీవు మున్నుగా నెంతయు భక్తిఁ గాంచుటకు నే మదిఁ గోరెద నమ్మహాత్ముఁడున్ సంతసమందు నీదయిన సన్నిధిఁ గాంచిన భక్తవత్సలా! |
16 |
| వ. | ఉత్తరాయణంబు వేచికొని యున్న యన్నరోత్తముండు బ్రహ్మమయనిధి యయిన నీ సందర్శనంబు గోరు; నా మీఁది యనుగ్రహంబునను నతని యెడం గలుగు పరిగ్రహంబునను దేవా! నీ విట్లు సేయవలయు’ ననుటయు, నద్దేవకీ నందనుండు సమీప గతుం డగు సాత్యకిం గనుంగొని ‘రథంబు సమకట్టుమని దారుకునకుం జెప్పుము; భీమార్జున నకుల సహదేవులను గృప యుయుత్సు సంజయులను రావింపు’ మనిన నతం డట్ల చేసె దారుకుండునుం దే రాయితంబు గావించె. | 17 |
| క. |
అది రత్నరుచుల పెల్లున | నుదితార్కునిఁ బోలి వెలుఁగుచుండెను జవసం పదుదీర్ణ సత్త్వ సారా | స్పద సుగ్రీవాదిరథ్య సంశోభిత మై. |
18 |
| వ. | ఆ సమయంబున నక్కడం బారాశర్య నారద దేవల దేవస్థాణు వాత్స్య దేవరాత ప్రభృతి పరమ మునీంద్ర పరివేష్టనంబు గలిగి గాంగేయుండు గ్రహగణ పరివృతుండైన చంద్రుండునుంబోలెఁ దల్పీభూత శాతశరశతంబుల చేత శోభిల్లి సందర్శనీయగభస్తి వితానుండగు నస్తమయ సమయ భానుం గ్రేణిసేయుచుఁ గృష్ణుం జిత్తంబున నిరతిశయ నిష్ఠ నిలిపికొనియుండి చేతులు మొగిడ్చి సుపుష్టస్వరంబున నిట్లని స్తుతియించె. | 19 |