| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని యడిగిన నా దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. | 220 |
| క. |
‘కోపంబు లేమి, సత్యా | లాపము నిజ దార పర విలాసము శుచితా గోపన మద్రోహం బవ | నీపాలక! సర్వవర్ణ నియత గుణంబుల్ |
221 |
| ఆ. |
బ్రాహ్మణునకు దమము పరమ ధర్మం బవ | శ్యంబుఁ గృత్య మధ్యయనము; దాన సర్వ కర్మములును, శాసితంబులు; వాని | నడపవలయు నిష్ఠ యెడప కతఁడు. |
222 |
| ఉ. |
కాని పథంబునం జనక, కారుణికత్వము గల్గి, శాంతిమైఁ దా నడవంగ విప్రున కుదాత్తధనం బొడఁగూడె నేని సం తానముఁ గూర్ప నర్హులకు ధర్మ నిరూఢతఁ బంచి పెట్ట దు ర్మాన విదూరుఁడై పరఁగఁ బ్రాప్తుఁడు కౌరవవంశదీపకా! |
223 |
| చ. |
యజనము దాన కర్మమును నధ్యయనంబును దస్యుహింసయుం బ్రజ కనురాగ మొందఁ బరిపాలన చేఁతయు సంగరంబున న్విజిత విభీతిమై నురవణించుటయున్ నృపధర్మముల్; కురు వ్రజ తిలకాయమాన! సమరంబు సుధర్మువు వీనిలోపలన్. |
224 |
| తే. |
అధ్యయన దాన యజ్ఞంబు లధిప! వైశ్యు | నకును గృత్యముల్; శుద్ధార్జనమున ధనము సంచితవ్యంబు పసుల రక్షించువాఁ డ | తండు; వానికి నిది మహా ధర్మ మనఘ! |
225 |
| క. |
ఈ మూఁడు వర్ణములకును | దా మంచిగఁ బనులు సేఁత ధర్మువు కురు ధా త్రీ మహిళేశ్వర! శూద్రున | కామెయి జీవనము వాని కజుఁడు విధించెన్. |
226 |
| క. |
ధనధాన్యంబులు కూర్చుట | జనపతి యనుమతము లేక చన;దతనికి దా ననిరూఢి శ్రద్ధ గలిగినఁ | జనునది సుపవిత్ర యగుట జగతీనాథా! |
227 |
| తే. |
అధిప! త్రైవర్ణికులకును యజ్ఞవిధుల | శ్రద్ధ కలిమికి మిగులు ధర్మంబు లేదు; యజ్ఞమునకంటె నధికమైనదియుఁ గలదె? | యజ్ఞకర్తయ చూవె సర్వాధికుండు. |
228 |
| వ. | ఆశ్రమ ధర్మంబు లాకర్ణింపుము. | 229 |
| మ. |
గురుశుశ్రూషయు, నాగమాధ్యయనమున్, గోష్ఠీ నిరాసంబుఁ ద త్పరతం బొందొరయంగఁ దాఁ జొరమియున్, భైక్షాశనత్వంబు, ష డ్వర కర్మంబులయందు రాగభరగాఢద్వేషముల్ లేక, యె వ్వరితోడం బగగాక యున్కియును భవ్య బ్రహ్మచర్యోక్తముల్. |
230 |
| మ. |
నిజదారైకపరత్వముం గరుణయున్ నిక్కంబునుం దాల్మియున్ సుజనా సంగము దేవ పిత్రతిధి సంశుద్ధార్చనల్ హవ్య భు గ్భజనంబున్ సకలాశ్రమస్థులను శక్యప్రకియం బ్రోపుఁ బం కజగర్భుండు గృహస్థ ధర్మములుగాఁ గల్పించె నుర్వీశ్వరా! |
231 |
| శా. |
తానున్ భార్యయు నేఁగుఁ బేరడవికిం దా నొక్కఁ డైనం జనున్ మానాహంకృతులూడ్చు నింద్రియములన్ మర్దించు నచ్చో జడల్ పూనుం దాపస శాస్త్రముల్ చదువుఁ జల్పున్ గోష్ఠి తత్‌జ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుఁడు ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. |
232 |
| శా. |
ఎచ్చో నైనను నిల్చు, నాఁకటికి నేమేనిం గొనున్, రాత్రియై నచ్చో నెమ్మి శయించు, నగ్ని పరిచర్యం బాసి వర్తించుఁ, దా నిచ్చం గోరఁ డొకండు, నింద్రియ జయం బేపారు భోగంబులన్ మెచ్చున్ మ్రొక్కును నొల్లకుండు యతిపేర్మిన్ నిర్మముండై నృపా! |
233 |
| క. |
ఈ నాలుగాశ్రమములకుఁ | బూని చొరందగినవాఁడు భూదేవుఁడు రా జైనను వీనను వైశ్యుం | డేనియు వర్తించు శుద్ధ హృదయత కల్మిన్. |
234 |
| తే. |
సుమతిఁ ద్రైవర్ణికులకు శుశ్రూష సేసి | యాప్తసంతానుఁడయ్యు నిలాధినాథు ననుమతంబున శూద్రున కాశ్రమాంత | రంబు తగుఁ గాదు యతి గాఁగ రాజముఖ్య! |
235 |
| క. |
నిజధర్మవర్తి యగు స | ద్ద్విజుఁ డగుఁ బాత్రంబు దాన విధి మఖముల క ట్ల జనేశ్వర నృపముఖులకు | నిజవిత్తము లీయ మాననీయత కలుగున్. |
236 |
| తే. |
వర్ణములు నాశ్రమంబులు వసుమతీశుఁ | డుక్తపథమున నడపించి యుభయలోక సిద్ధి గనుఁ దప్పఁ ద్రొక్కని శిష్టజనులు | గల నరేంద్రున కింద్రుండుఁ దలఁప సరియె? |
237 |
| వ. | అదియునుం గాక. | 238 |
| సీ. |
ఏనుంగు హజ్జలో నెల్ల సత్త్వంబుల | హజ్జలు నడఁగిన యట్ల పోలె; రాజిత క్షత్ర ధర్మమునకు లోనయి | సర్వ ధర్మంబులుఁ జను మఖములు; వేదంబులును శుభవృత్తంబులును దండ | నీతి మాసినఁ జెడు భూతలంబు; సంస్కార రహితమై చాల హీనతఁ బొందు | నట్లైనఁ బ్రజకుఁ జే టావహిల్లు; |
|
| తే. |
రాజు లరసిన నెమ్మది బ్రదుకుఁ గాన | రాజు సర్వోత్తముఁడు; ధర్మరాజియందు రాజధర్మంబ యెక్కుడు; రా జనంగ | ధర్మదేవత యన వేఱె ధర్మతనయ! |
239 |
| వ. | ఆకర్ణింపుము. | 240 |
| తే. |
తొల్లి మాంధాతృఁ డను మహీవల్లభుండు | విష్ణు సందర్శనము సేయ వేఁడి యొక మ హాధ్వరము నిష్ఠమైఁ జేయ నమరవిభుఁడు | సన్నిహితుఁ డయ్యెఁ బ్రీతి నజ్జనవిభునకు. |
241 |
| వ. | అ ట్లింద్రుండు ప్రత్యక్షం బగుటయు. | 242 |
| క. |
అన్నరపాలుఁడు తానున్ | జన్నమునకు వచ్చినట్టి జగతీశులు భ క్తి న్నమ్రు లైరి దేహము | లు న్నేలయు ముదము మనములుం గలయంగన్. |
243 |
| వ. | అట్లు దండ ప్రణామంబులు సేసి లేచి చేతులు మొగిచి నిలిచిన సురేంద్రుఁ డన్నరేంద్రునితో నిట్లనియె. | 244 |
| ఆ. |
విష్ణుఁ జూడ నీవు వేడుక పడితి నా | కైన నజున కైన నరిది విష్ణు దర్శనంబు నీదు తలఁ పెద్ది యెఱిగింపు; | మది యొనర్చెదను మహానుభావ! |
245 |
| క. |
అనవుడు సాంసారిక వ | ర్తన ముడుపుము, భైక్షచరణ తత్పరత మనం బున దృఢముగ నొందింపుము | ననుఁ జరితార్థునిఁగఁ జేయు నావుడు నగుచున్. |
246 |
| మ. |
‘ధరణీశా! నృపధర్మ ముత్తమము సద్ధర్మంబులం దెల్ల నే తెరువున్ రా జరయంగఁ గాదె తగ సిద్ధిం బొందుఁ గామంబుఁ గ్రో ధరయంబున్ మగిడించి దండము సమత్వవ్యాప్తిఁ జెల్లించుచున్ ధరఁ బాలించిన రాజు వొందుగతిఁ బొందన్ శక్యమే యేరికిన్? |
247 |
| వ. | అని పలికి పురందరుం డందఱు రాజులం గలయం గనుంగొని. | 248 |
| తే. |
‘లోకపాలాత్ములరు మీరు మీకు భైక్ష | చరణ మర్హమే? ప్రజఁ బ్రోపు సమరముక్త దేహు లగుటయు నమ్మేలు తెచ్చు సంశ | యంబు; వలవదు మీ పద మధికతరము. |
249 |
| వ. | అని చెప్పి దేవేంద్రుండు దివంబునకుం జనియె. | 250 |
| చ. |
అది యొకఁడేల వేదములయందుఁ బురాణములం బ్రసిద్ధకో విదులు బహుప్రదేశముల వేమఱుఁ గాంచి మనుష్యులెల్ల భూ మిదయితుకంటెఁ దక్కువ యమేయ సుధర్మము లీడుగావు ని ర్మదకృత దండనీతి కనరా మనమెల్ల వినంగ నెప్పుడున్. |
251 |
| ఉ. |
కావునఁ గామరోషములఁ గ్రాఁచుచు నాశ్రమకోటిఁ గాచుచున్ భూవలయ ప్రజన్ సమతఁ బ్రోచుచు రాజ్యముసేఁత మేలు; భి క్షావిధి లోనుగాఁ గలుగు సారపు ధర్మములన్ ఘటించు మేల్ వావిరి నప్రయత్నమున వానికి వచ్చు నృపాల! యెమ్మెయిన్. |
252 |
| చ. |
అతిథుల దీనకోటుల ధనార్థిత లేని యతివ్రజంబు స మ్మతిఁ బరికింపు హర్ష మదమాన విషాదములం జొరంగ నీ క తొలఁగఁ ద్రోవు నా యొడలు గావక భూప్రజఁ గాతు న న్విని శ్చిత దృఢ బుద్ధి గల్గు మిది చేయు సమస్త సుధర్మసిద్ధులన్.’ |
253 |
| వ. | అనిన విని యజాతశత్రుండు ‘మహాపురుషా! వర్ణాశ్రమ విధంబులుం దద్రక్షణంబు చొప్పును దాన వచ్చు పెంపును నెఱింగించితి; రాష్ట్ర జనంబు లెయ్యది యాచరించి సుఖు లగుదు; రెఱింగింపవే!’ యని యడిగిన నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. | 254 |