| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
రాజు నుత్తమగుణ భ్రాజిష్ణు నభిషిక్తుఁ | గావించుకొని, యెల్ల కార్యములును దన్ముఖంబునఁ జెల్లఁ; దద్దయు సుఖముండఁ | బడయుదు; రొకఁడు భూపాలనంబు సేఁతలేకున్న దుశ్చేష్టితు లై జను | లన్యోన్య దారధనాపహరణ మాచరింతురు; మీల యట్టుల బలవంతు | లల్పులఁ దమకు నాహారములుగఁ |
|
| తే. |
గొండ్రు; భూపతిలేకున్న మండ్రె జనము? | లధిప! కృషి సేయుటయును బేహార మాడు టయును గోరక్ష గావించుటయును మొదలు | గాఁగఁ బ్రదికెడు తెరువులు గాసిగావె! |
255 |
| వ. | వినుము. | 256 |
| సీ. |
జను లొక్కతఱిఁ దొల్లి సమయంబుఁ దమలోనఁ | జేసి క్రూరతయు మ్రుచ్చిమియు ఱంకు సైఁపక యట్టి దుర్జను నందఱును గూడి | శాసించువారుగాఁ జాలి తమకు నధిపతియుఁగ నొరునాసపడక యుండి | నడవడి బహుకారణములఁ జిక్కు వడిన, విషణ్ణులై బ్రహ్మఁగానఁగఁ బోయి | మాకు రక్షకుఁడుగ మహిపుఁ డొకఁడు |
|
| తే. |
వలయు రూపింపు; మాతని గొలిచి బ్రదుకు | వార మనుటయు, నజుఁడును వారి వలని కరుణ మనువు నిరూపించె; నరు లసత్య | చరితు లని పాలనమునకుఁ జొరఁడ యతఁడు. |
257 |
| వ. | చొరకున్న నజ్జనంబు లమ్మహాత్మునితో ‘నీకుం బుయిలోడ నేల? ప్రజలచేతఁ బశువులయందును బసిండిని నేఁ బది యగు నంశంబును, ధాన్యంబున దశమ భాగంబును భండారంబుగాఁ బుచ్చికొని శస్త్రోపజీవుల నెల్ల నీ వారిం జేసికొని బలవంతుండవై దుష్టనిగ్రహ శిష్ట ప్రతిపాలనం బాచరింపు; మే మందఱము ని న్ననుసరించి నీ పనుపు చేయంగల వార; మధర్మ వర్తనులు నీ చేతం జెడువారు; ధర్మవర్తనులు చేసిన ధర్మంబున నాఱవపాలు నిన్నుం జేరంగలయదిగా నొడంబడితి; మింద్రుండు దేవతల రక్షించు మాడ్కి’ మమ్ము రక్షించుకొని సుఖంబుండు మనుటయు. | 258 |
| క. |
అతఁ డొడఁబడి యత్తెఱఁగున | నతిబలవంతుఁ డయి నీతి నంచిత మగు ను ద్ధత విక్రమమునఁ దగ నీ | క్షితిఁ బాలించె; సుఖులై రశేష జనములున్. |
259 |
| ఉ. |
కావున మేలు సేయదె జగజ్జనకోటికి రాజునాజ్ఞమైఁ బోవుట; యాతనిం దగిన పూజలఁ దృప్తునిఁజేఁత; దేవసం భావనఁ గొల్వ తండొకటఁబాడి తొఱంగిన సైఁచు టిట్లు సం భావితుఁ జేయఁగా నతని పంపొనరింతురు మ్రొక్కి శత్రులున్. |
260 |
| క. |
తనవారు పెద్ద సేయని | మనుజేశు నరాతిజనులు మదిని సరకుగాఁ గొన; రది భూప్రజ కొప్పదు | విను! కావునఁ బతికిఁ బ్రజలు వెఱచుట యొప్పున్. |
261 |
| తే. |
వాహనాసన శయ్యా నివాసములును, | భోజ్య గంధ మాల్యాంబర భూషణములు, గుప్తియును నరపతికి నెక్కుడుగ వలయు | నను తలంపునఁ బ్రజలకు మనుట గుణము. |
262 |
| చ. |
అతఁడును మందహాస సహితాలపనంబును, సత్యభాషణ వ్రతమును, సంవిభాగ నిరవద్యతయున్, సమభావముం, గృత జ్ఞతయు, జితేంద్రియత్వముఁ, బ్రసాద గుణంబును గల్గి భూమికిం బితృసముఁడై విరోధి జన భీషణ సారత నొప్పఁ బెం పగున్.’ |
263 |
| వ. | అనుటయుం గౌంతేయాగ్రజుండు ‘మనుష్యుల కెల్ల రా జధిపతియును దైవంబునుంగా విప్రులు చెప్పి; రట్లగుట యేమిటనో? యని యుండుదు;నది మీవలనం బ్రస్ఫుటంబుగా వింటి’ నని పలికిన; గాంగేయుఁ ‘డింకనుం జెప్పెదఁ దొల్లి వసుమనుం డను మానవేంద్రుండు నీవ పోలె వితర్కించి బృహస్పతి నడిగిన, నతం డతనికిఁ జెప్పిన భంగి యాకర్ణింపు’ మని యిట్లనియె. | 264 |