పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - చతుర్థాశ్వాసము
యమ కాల మృత్యు భూసురేక్ష్వాకుల సంవాదము (సం. 12-189-6)
సీ. వేదాంతవిదు లనుమోదించు నట్టిది | జపకర్మ మత్యంత శౌచశాలి
యై కుశాస్తీర్ణ సమావనీతలమునఁ | గుశముష్టి సేకొని విశదచిత్త
వృత్తి నింద్రియములు విషయసక్తంబులు | గాకుండ నిలిపి తదేకపరత
మత్సరాహంకార మాన దంభాపగ | మంబును బ్రహ్మచర్యంబుఁ గలిగి
 
తే. జపము సెల్లించు పురుషుండు సర్వలోక | విజయ నిస్పృ హ మగు జపవిధి విశోక
హర్ష రాగాదికంబును నవ్యయంబు | నైన పదముఁ బొందించు నృపాగ్రగణ్య!
130
క. శౌచాది గుణము లెడలుట | నీచత్వము వాటిలంగ నిశ్చలమతి దు
ష్టాచరితమైన జపవిధి | నా చెప్పిన సుగతి లేదు నరకముఁ దెచ్చున్‌.’
131
వ. అని చెప్పి వెండియు నిట్లనియె. 132
సీ. ‘వేద వేదాంగ సంవేది గౌశికుఁ డను | ధరణీసురుఁడు సంహితాజపంబు
విహితశీలతఁ జేయ వేయి వత్సరములు | సనిన సావిత్రి యమ్మునివరునకుఁ
బొడసూపి తనుఁ జెప్పఁ గడుభక్తితో నతం | డెఱఁగిన ‘నిచ్చెద నిష్ట’ మడుగు
మనిన నాతండు జపాతినిష్ఠయ కోర | నది యిచ్చి, దేవి ‘నీ కత్యుదాత్త
 
తే. గతియు నగు; ధర్మ మర్థి నీకడకు వచ్చు; | యముఁడు గాలుండు మృత్యువు నరుగుదెంతు
రనఘ! నీకును వారికి నావహిల్లు | వాద’ మని చెప్పి చనియె భూవరవరేణ్య!
133
క. ధరణీసురుఁడును జప త | త్పరుఁడై దివ్యాబ్దములు శతంబు గడపె న
ప్పురుషవరు కడకు ధర్మము | పరమప్రీతిఁ జనుదెంచెఁ బౌరవముఖ్యా!
134
తే. అట్లు సాకారమై వచ్చి యతనితోడ | ‘నీ జపంబున సిద్ధించె నిరతిశయము
లైన పుణ్యలోకములు; నీ వందుఁ జనుము | తనువుఁ జిత్తంబు విడిచి యుత్సవ మెలర్ప.’
135
వ. అనిన విని యమ్ముని ధర్మంబున కిట్లనియె. 136
క. ‘తనువు దొఱఁగి సను లోకము | లనఘా! యే నొల్ల మేల యైనను దుఃఖం
బున కోర్చి నా తపంబున | కనుగుణమై యుండ దీని నగునె తొఱంగన్‌?’
137
వ. అనుటయు ధర్మంబు. 138
క. ‘ఒడ లెట్లు విడువవలదే? | కడు రమ్యము నాక మింత గానవొకో?’ నా
వుడు ‘మేను వెలిగ నటవో | నొడఁబడ’ నని పలికె బ్రాహ్మణోత్తముఁ డధిపా!
139
వ. అని పలికిన ధర్మం బతనితో ‘నీ వొడలు విడువనొల్లవుపో యమకాల మృత్యువులు వీరె వచ్చిరి; చూడు’ మనియె; నయ్యవసరంబున వారలు వచ్చి యమ్మహీసురవరు ముందఱ నిలిచి, తమ్ముం బేర్కొని; రాతని నుద్దేశించి యముండు నీ జపంబు ఫలంబు సిద్ధించె’ ననియుఁ, గాలుండు ‘నీకు నాకలోకారోహణంబునకుం గాలంబైనం దోఁచితి’ ననియును మృత్యువు ‘కాలచోదితనై నిన్ను నేఁడు గొనిపో వచ్చితి’ ననియుం బలుకుటయు, నమ్మాటలు గీటునం బుచ్చుచు వారల వదనంబులు విలోకించి సవినయ వ్యాహృత స్వాగతుండయి యవ్విప్రుం‘డేను మీకు నెప్పని సేయువాఁడ?’ నని పలికె; నట్టి యెడఁ దీర్థయాత్రా పరుండైన యిక్ష్వాకుం డచ్చటికి నేతెంచి వార లందరకుం బ్రణతుండై బ్రాహ్మణుం డతిథిగా నిరూపించి యాదర భరితుండై. 140
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )