| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
‘నా కలిమితోడ నిచ్చెద | నీ కెయ్యది యిష్ట?’ మనిన నృపతి ‘నృపులు దా నైకపరులు గొనువారలె? | యే కామ్యములయిన నిత్తు నీ వడుగు తగన్.’ |
141 |
| వ. | అనిన విని విప్రుం డవ్విభున కిట్లనియె. | 142 |
| క. |
‘కొనువారు ప్రవృత్తులు గా | క నివృత్తులు గొందురయ్య? కామ్యంబులు నా మనమున లే; వే నేమియుఁ | గొన; నిత్తున కాన యధిప! కోరుము తగఁగన్. |
143 |
| వ. | పూజారూపంబున నిచ్చిన యది యతిథి గైకొనుట యెగ్గుగా’ దనుటయు నమ్మనుజపతి ‘నీ విచ్చువాఁడవయేని నీ సకల జపంబు ఫలంబును ని’ మ్మనిన నమ్మహీదేవుండు. | 144 |
| క. |
‘జపఫలమున సగ మిచ్చెద | నృప! యంతయు నైనఁ గొనుము నీ’ వనవుడు ‘న జ్జపము ఫలం బెయ్యది?’ యని | నృపుఁ డడిగిన నాతఁ ‘డేను నిరపేక్షుండన్.’ |
145 |
| క. |
కావున ఫల మిట్టిది యని | భావింప; నెఱుంగ నొరులఁ బనివడి యడుగన్; నీ వాఫలంబు గొను మది | దా వినఁబడుఁ బిదప ధర్మతత్త్వజ్ఞులచేన్.’ |
146 |
| వ. | అనుటయు నయ్యినతనయుండు ‘ఫలం బిట్టి దని యెఱుఁగ వేనిం గొననొల్ల’ ననవుడు నతం డితని కిట్లనియె. | 147 |
| క. |
‘నీ వడిగి తేను నిచ్చితి | భూవల్లభ! యింక సత్యమున కూనము గా దే వరియింపమి?’ నావుడు | నా వసుధాధీశుఁ డద్ధరామరవరుతోన్. |
148 |
| వ. | ‘రాజులకు యుద్ధంబు సుకర్మంబు గావున నీతో వివాదయుద్ధంబు సేసితి’ ననిన నతండు ‘నీవేమి సేసితేమి? యది యట్లుండనిమ్ము.’ | 149 |
| క. |
విను మిచ్చెద నని యీమియుఁ, | గొనియెద నని పలికి పిదపఁ గొనకునికియు, న త్యనృతంబులు సత్యవ్రత | మునకుం దొలగంగ మనకు భూవర! తగునే? |
150 |
| క. |
సత్యమ తపమును యజ్ఞము, | సత్యమ వేదంబు దాంతిశాంతులు నగుటన్ సత్యము దొఱఁగుట నిర్మల | నిత్యానుష్ఠానములును నిష్ఫలము లగున్.’ |
151 |
| వ. | అనిన విని ధర్మంబు వారల నుద్దేశించి యమాదులు విన ‘వీరికి వివాదంబు వలదు. విప్రుండు దానఫలంబును రాజు సత్యఫలంబును బొందువా’ రనియె. నట్టియెడ నాకంబు నరాకృతి దాల్చి వచ్చి తన్నెఱింగించి యయ్యిరువుర నాలోకించి ‘వాదేల? మీరిద్దఱుం దుల్యఫలప్రాప్తుల రయ్యెద రిట్లు సేయుం’డని పలికె నవ్విభుం ‘డట్లేని నితండును నా యిచ్చునది గొనవలయు? ననుటయు నమ్ముని ‘యేను దపస్స్వా ధ్యాయనిరతుండం బరిగ్రహవిధి యందు విరతుండ.’ | 152 |
| క. |
అనవుడు నరనాథుఁడు ‘నా | కును నీకును సరియ కాఁగఁ గోరెద సత్క ర్మ నిరూఢి మత్సుకృతఫల | మనఘా! కొనవే? యనుగ్రహంబు దలిర్పన్.’ |
153 |
| వ. | అని ప్రార్థించె నప్పుడు వికృతవేషులగు పురుషు లిరువురు దమలో వివాదంబు సేయుచు వచ్చి ‘యవ్విభుండు మనల శాసింప నొడయం’ డనుచు నిక్ష్వాకు ముందఱ నిలిచిరి. వారి తెఱంగు వినుము. | 154 |
| తే. |
ఒకఁడు గోదాన మొనరింప నొక్కరుండు | తత్ఫలము వేఁడఁ బ్రీతి నాతండు నొసఁగఁ గొనినవాఁ డిది దక్కువ దనకు నని త | లంచి యుత్తమ గోయుగళంబు విలిచి. |
155 |
| వ. | సత్ పాత్ర దానక్రియ నిర్వర్తించి తత్ఫలంబు మున్ను దనకు గోదాన ఫలం బిచ్చిన యతని కిచ్చువాఁ డయిన నతండు గొనువాఁ డయి యుండి కొనక యెడసేసి తిరుగం దిరుగ నప్పుడు ముట్టం బట్టిన వాదు పుట్టిన వచ్చినవారై; రత్తెఱం గెల్ల నుక్తి ప్రత్యుక్తుల నప్పుడమిరేనికి నేర్పడం జెప్పి; రట్లు సెప్ప వినిన యవ్విభుతోడఁ దొలుత నొసంగినవాఁ ‘డితం డడిగిన నెమ్మిం బ్రతిగ్రహింపఁగా నొసంగితిఁ బ్రతిగ్రహంబొల్లని నన్ను నితండు నిర్బంధింపం దగునే?’ యని చెప్పినఁ బిదపటి యాతం ‘డితండు గొనియెద నని యొడంబడి కొనమి పాతకం బగుట కర్మకాండవిదు లెల్ల నెఱుంగుదు’ రనవుడుఁ గౌశికుం డిక్ష్వాకు నుద్దేశించి ‘వింటె? యప్పురుషుని వచనంబు’లని పలికి వెండియు. | 156 |
| క. |
‘నృప! నీవు మదీయంబగు | జపము ఫలం బడిగి; తేను సమ్మతి నీఁగా విపరీత ఫణితు లాడిన | శపియింతుఁ జుమీ! యెఱుంగఁ జాటితి నీకున్.’ |
157 |
| తే. |
అనిన నాతఁడు భయమంది యాత్మలోన | ‘నొరుల యీగికి నకట చే యొడ్డకుండు నట్టి నా కిది వలసెనే!’ యనుచుఁ గరము | సాఁచె నవ్విప్రు దెసకు నిశ్చయముతోడ. |
158 |
| వ. | అతండు ‘ననేక వర్షంబులు సేసిన జపఫలంబంతయు నీకిచ్చితి’ ననుచు ధారవోసిన నమ్మహీసురువరు నాననం బాలోకించి భూపాలుండు ‘నా కరంబున జలంబులు వడియె మనకు నిద్దఱకును సత్కర్మ సమత్వంబు గలుగవలదే? నాయదియైన యాగఫలం బేనును నీ కిచ్చెదఁ గైకొను’మని పలికె. నట్టియెడ వికృతవేషులగు నప్పురుషు లిరువురు నన్నరనాథు నుద్దేశించి ‘యేము కామక్రోధులము. ధర్మయమాదులచేతను మాచేతను మీరిద్దఱుం బరీక్షితులరైతి రింతియ కాని యిచ్చుటయుఁ గొనుటయును నివి దైవాచరితంబులు మీకుం బనిగా’ దని పలికిన విని యవ్విప్రుండు భూవిభునితో నిట్లనియె. | 159 |
| ఆ. |
‘శ్రద్ధయును బలంబు జపవిధియందు సా | విత్రి నాకు నిచ్చె వేఱజపము నాచరింపఁ దగునె? యైనను నిందఱ | యెదుర నీవు గోరి తివ్విధంబు. |
160 |
| క. |
కావునఁ బ్రార్థన సెఱుపం | గా వెఱచెద నట్ల కాక! గైకొంటి ధరి త్రీవల్లభ! నీ సుకృతం | బే వెంటం దిగిచె నరుగు మీ వగ్గతికిన్.’ |
161 |
| వ. | అనియె నయ్యిరువుర సత్కర్మనిష్ఠావిశేషంబునం బ్రీతులయి బ్రహ్మాదిదేవతలు వారల మీఁదం బుష్పవృష్టి గురియించుచు నయ్యెడకు నరుగుదెంచి యభినందించిరి; దేవతూర్యంబులు మొరయ నప్సరోగణంబు లాడుచుం బాడుచు నుల్లసిల్లె; నయ్యవసరంబునఁ గౌశికు నిక్ష్వాకు నుద్దేశించి నాకం బిట్లనియె. | 162 |
| తే. |
‘అనఘులార! సంసిద్ధుల రయితి రింకఁ | దడయనేటికి? నిర్మలోదాత్తగతికి నుత్సహింతురుగా’ కన్న మత్సరాది | బంధకంబులఁ బోఁ ద్రోచి బ్రాహ్మణుండు. |
163 |
| వ. | ధర్మయమాదులను నాదిత్య సంఘంబును సవినయ ప్రణామ సహితంబుగా నామంత్రితులం జేసి. | 164 |