| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
‘ఏనుఁగులు సుట్టిరాఁ బే | రేనుఁగుపై మణిమయంపుటెల్లులు మెఱయం గా నీ వే తెంతువు మముఁ | గానికిఁ గొన వప్పు డిపుడు గాడిదవైతే! |
389 |
| క. |
కనకమయయూప మొప్పఁగ | ననూన విభవమున నీవు యాగం బొనరిం చిన యొప్పును నిప్పటి నీ | యునికియునుం జూచి నాకు నుమ్మల మయ్యెన్. |
390 |
| ఆ. |
ఉముక దినుచు నిట్టులుండి నీ తొల్లింటి | లీలఁ దలఁచి యుమ్మలింతొ? లేదొ? యున్నరూపు సెప్ప వన్న! గార్దభరూప | దారుణైకనిపుణ! దానవేంద్ర! |
391 |
| సీ. |
అన విని బలి దేవతాధీశుతో ‘నీకు | నా విభవంబు గానంగ రాదు; గుప్తమై యున్నది గుహయందు; నా కిచ్చ | వుట్టిన నిప్పుడ పొలిచి తోఁచు; నది యటులుండె; నీ వధికుండ వల్పుల | యెదుర రజ్జులు వల్కుటేటి పెంపు? పొమ్ము దుశ్చ్యవన! నీ పోయెడు తెరు’ వన్న | నాతండు నవ్వుచు నతనిఁ జూచి |
|
| ఆ. |
మున్ను పల్కినట్ల కన్నోటలేక ప | ల్కుటయు, నతఁడు ‘భూతకోటి మంచు వోలెఁ దోచు విరియు; బుద్ధిమంతులు దాని | కిచ్చ వగవ; రింత యెఱుఁగ వెట్లు?’ |
392 |
| వ. | అని వెండియు విరోచననందనుండు. | 393 |
| క. |
‘పొరి నర్థంబు ననర్థము | మరణము జీవితము సుఖ సమాగమమును దు స్తర దుఃఖసంగమంబును | దొరకొన నే నెపుడు సమత తోడన నిలుతున్. |
394 |
| చ. |
బలమును నొప్పు బుద్ధియును బ్రౌఢతయుం గలవారు లేనివా ర లనక యొక్కభంగిఁ దఱి రాకయ చూచి హరించుచుండు వి చ్చలవిడిఁ గాలుఁ; డట్లగుట సారమతిం గని యున్నవాఁడ; ను మ్మలికయు నుబ్బు నాదుమది మందున కైనను లేదు వాసవా! |
395 |
| ఉ. |
గాడిద రూపు దాల్చి యుముకల్ దినుచుండఁగఁ జూచి యుల్లసం బాడెదు శక్ర! శాంతిసమయం బగుటన్ విను మింకఁ గొన్ని నీ వాడిన నాదు చిత్తమున నల్క యొకింతయుఁ బుట్ట దిట్లు నీ వాడితె మున్ను? ని న్నెఱుఁగనా? వలదా నను నీ వెఱుంగఁగన్? |
396 |
| క. |
ఎలమియు వాడుటయును దన | వలచిన యట్టివె యెఱుంగవా? విధి చరితం బులు బలవంతంబు లగుట | వలదె? వివేకంబు పెద్దవారికి నింద్రా! |
397 |
| క. |
ఇటు గర్వించుట నీచత; | యెట వోయెదొ పొమ్ము; మానుమీ వలవని త్రు ళ్ళుట; వజ్రము నీవును బిడి | కిటి తాఁకున నొఱగు దేను కినిసితినేనిన్. |
398 |
| క. |
ఇది మేలపు మాట సుమీ! | మది నుద్ధతి లేదు నాకు; మహితాశ్చర్యా స్పదమగు విధాతృ చెయ్దిం | దుది నీవును దుస్సువోదు; త్రుళ్ళు టుడుగుమీ. |
399 |
| వ. | శాంతుఁడ వగు’ మని పలికె; నట్టియెడ నవ్విరోచన నందను శరీరంబున నుండి సురూపయు సుగౌరయు నగు నొక్కమగువ నిర్గమించినం గని కౌశికుండు విస్మయ వికసితాక్షుం డగుచు నతనితో ‘నివ్వనిత యెవ్వత?’యనిన నాతం ‘డే నెఱుంగ నీవ యీ యమ నడుగు’ మనుటయు నయ్యనిమిషపతి యమ్ముద్దియ మొగంబు గనుంగొని ‘మాకు నిన్నెఱింగింపు’ మనవుడు నద్దేవి యతనితోడ. | 400 |
| క. |
‘శ్రీయును భూతియు లక్ష్మి యు | నా యభిధానములు మీరు న న్నెఱుఁగమి పె ద్దే? యింద్ర! యెజ్జగంబుల | నే యుగములయందు నెఱుఁగ రెవ్వరు ననినన్.’ |
401 |
| క. |
అనవుడు నతండు ‘నీ వీ | దనుజేశ్వరుఁ బాయుటకుఁ గతం బేమి యొకో!’ యనిన విని లక్ష్మి ‘సత్యం | బును ధర్మము దమము దానమును నా యిక్కల్. |
402 |
| క. |
అవి గలిగి పరాక్రమయుతుఁ | డవు పురుషునిపాల నిలుతు నమరాధిప! యా దివిజారి దొల్లి యట్టిఁడ | యవినీతత నిపుడు బ్రాహ్మణాసూయ మెయిన్. |
403 |
| క. |
తొల్లిటి సచ్చారిత్రము | లెల్లను దిగవిడిచెఁ గాన యీతనికడ నే నొల్ల నిలువ, వచ్చెద సుర | వల్లభ! నీ పాల నెలమి వసియింపంగన్. |
404 |
| ఆ. |
ఆ గుణములు మఱియు నాగమోదిత సమా | చారములును గలిమిఁ గోరి యింద్ర! నిన్నుఁ బొంది యేను నిల్చెద; నేమిట | నేమఱంగ వలవ దెపుడు నీవు.’ |
405 |
| వ. | అని పలికె నిట్లు లక్ష్మి చేతం బరిత్యక్తుండైన బలి యాఖండలు నాలోకించి. | 406 |
| క. |
‘అయనవశంబునఁ దేజో | వియుక్తుఁ డై రవి ప్రతాపవిరహితుఁ డగు నా క్రియఁ బొనుఁగుపడినఁ బొంగకు; | జయింతు నిను దేవదనుజ సంగర మగుడున్. |
407 |
| వ. | అనుటయు మహేంద్రుండు. | 408 |
| క. |
‘అది యట్టులుండె నీతోఁ | బదరం బని లేదు నాకుఁ బద్మభవుని మా ట దలంపవలయు నీపై | భిదురం బిడ దనుజనాథ! ప్రియ మందు మెదన్.’ |
409 |
| క. |
అనిన విని యొండు పలుకక | దనుజాధీశ్వరుఁడు వోయె దక్షిణ దిశకుం; జనియె నుదఙ్ముఖుఁడై దివి | కనిమిష నాథుండు గౌరవాన్వయముఖ్యా! |
410 |
| వ. | అని చెప్పి యనిమిషనదీనందనుండు వెండియుఁ బాండవాగ్రజున కిట్లను ‘నింద్ర నముచి సంవాదం బను నితిహాసంబు హృదయప్రసాదకరంబు; దాని నాకర్ణింపుము. | 411 |