పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
కపిలుఁడు స్యూమరశ్మికి వేదంబులు ముఖ్యప్రమాణంబులుగాఁ జెప్పుట (సం. 12-262-14,1)
క. ‘అరయంగా శబ్దంబును | బరంబు నన రెండు సూవె బ్రహ్మములు; గుణో
త్తర! శబ్దబ్రహ్మ భజన | పరుఁడు పరబ్రహ్మ మహిత పదమున్‌ బొందున్‌.
332
క. మనమున నెద్దియుఁ గోరం | డనసూయయు శమము దమము నతులజ్ఞానం
బును గల గృహపతి ధర్మం | బని నడపును వేదచోదితాచారములన్‌.
333
క. భూతదయయు ననహంకా | రాతిశయముఁ గలుగు విమలుఁ డప్రాయశ్చి
త్తాతురుఁడు సూవె! విధులు సు | నీతములైనను దృఢాత్మనిష్ఠ కతమునన్‌.
334
క. విను శాంతులైన విప్రులు | మనుజేంద్రులు గృహమునంద మహితవ్రత సం
జనిత పరిజ్ఞాన నిరం | జనులై పడయుదురు సూవె శాశ్వతపదమున్‌.
335
తే. బ్రహ్మచర్యాదు లగు నాల్గుఁ బాదమహిమ | గాఁగఁ బరఁగెడు ధర్మ మొక్కటియ చూవె!
యెవ్వఁ డెందు వర్తించిన నేమి? సకల | కర్మఫలరూపకత్వ మొక్కటియ కాదె!
336
క. సంతోషామృత సుఖిత | స్వాంతుం డగు నేని నట్టివాఁడు గృహంబుం
గాంతారదేశమును నొ | క్కంతగ నిశ్చింతవృత్తి నక్షోభ్యుఁ డగున్‌.
337
క. విను తృష్ణారాహిత్యం | బున నాలవు నాశ్రమంబుఁ బొందుదురు మహా
జను; లది యుపనిషదుక్తం | బనక యవైదిక మనంగ నగునే నీకున్‌?
338
క. జ్ఞానము ధర్మమున కధి | ష్ఠానము మూలంబు పరమసంతోషము భ
వ్యానూనత్యాగము రూ | పానందము ప్రాఁకు దాని కను వేదంబుల్‌.
339
క. ఏదియుఁ దలఁప నసేవ్యము | గా దాశ్రమసమితిలోనఁ గావున శుచులై
యేదాన నున్న సంసా | రోదధి యాదరికిఁ బోవ నోపుదురు బుధుల్‌.
340
క. సంతోషంబున నేగతి | శాంతాత్మున కొదవు దాని సద్గతిగా వే
దాంతవిదులు గొనియాడుదు; | రింత నిజము; దీని నీవు నెఱుఁగు మనింద్యా!
341
తే. వేద తాత్పర్య మారసి వేదితవ్య | మెఱుఁగు వారలు వేదజ్ఞు; లిట్లు గాని
వారు వేదపాఠకులు; సర్వంబు నరయ | వేద పరినిష్ఠితము సూవె విప్రవర్య!
342
క. త్యాగ మొక నెలవు; శమసం | యోగం బుత్తరము దాని; కూర్ధ్వము సంతో
షాగమము; మోక్షలాభో | ద్యోగికి నివి గమ్యభూము లుత్తమధిషణా!’
343
వ. అని యి ట్లుపదేశించి. 344
సీ. ‘వేదితవ్యంబన విదితంబు నా ఋతం | బనఁగ సత్యంబన నతిశయిల్లి,
సంభృతస్థావర జంగమం బనఁగ స | ర్వాత్మకంబన శుభం బనఁగ వెలసి,
యవ్యక్త మనఁగ బ్రహ్మంబునా నుత్తర | మనఁగ శివంబన వినుతి కెక్కి,
ఫ్రభవం బనంగ నవ్యయ మన శాంతి నాఁ | దేజంబు నా నెందుఁ దేజరిల్లి,
 
తే. క్షమ యనంగ నంబర మనఁగా ధ్రువంబు | నా ననామయ మన నొప్పి లీనరూప
బుద్ధి సంప్రాప్య మగు తత్త్వమునకు వేద | మానిత బ్రాహ్మణులకు నమస్కరింతు.’
345
వ. అని పలుకుటయు స్యూమరశ్మి ప్రీతుఁడగుచుఁ గపిలునిం బ్రశంసించె; నియ్యితిహాసంబు తాత్పర్యంబు నీవుం గనికొను’మని చెప్పినం దద్దయుఁ బ్రియంబంది ధర్మనందనుండు ‘ధర్మార్థకామంబులు మూఁడును వేదశంసితంబులు; వీనిలో నెద్దాని లాభంబున విశేషంబు గలిగియుండు నెఱింగింపవే !’ యనిన గాంగేయుండు గుండధారుం డనువాఁడు నిజభక్తున కుపకారంబు సేసిన ప్రకారం బితిహాస రూపంబునం బ్రవర్తిల్లునది భవత్ప్రశ్నంబునకు నుత్తరంబై యుండు; వినుము చెప్పెద’నని యప్పుడమిఱేని కిట్లనియె. 346
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )