| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘యజ్ఞార్థ మొక్క బ్రాహ్మణుఁడు ధనార్థియై | తపము సేయఁగఁ గుండధారుఁ డనఁగఁ బరఁగెడు దేవానుచరుఁ డచ్చటికి వచ్చి | ‘యభిలాష మేరూప’ మనుడు ‘నర్థ సిద్ధిఁ గోరెద’నని చెప్పినఁ బ్రీతి నా | తఁడు మాణిభద్రుని ధనదభృత్యు నియతిఁ దలంప సన్నిధి సేసె నయ్యక్షుఁ; | డతఁడు ‘మదాశ్రితుం డైన యితని |
|
| తే. |
ధనసమగ్రునిఁ జేయవే’ యనిన ‘నెంత | ధనము వలసిన నిచ్చెద’ ననియె మాణి భద్రుఁ డమ్మహాత్ముఁడు మర్త్యభావ మస్థి | రత్వదూషిత మను విచారంబు వుట్టి! |
347 |
| క. |
‘ధన మేటికి? నీ విప్రుని | మన మొలయఁగ వలయు ధర్మమార్గంబున; దా నన సర్వసంపదలు నగు’ | నని నిశ్చయ మొంది వినయ మతిశయ మందన్. |
348 |
| ఆ. |
యక్షవరునితోడ నవ్విచారము మృదు | వచన రచనఁ జెప్ప వాఁడు దాని కాత్మఁ బ్రీతిఁ బొంది యనుమతి సేయంగ | నధికభక్తి నిరతుఁడై యతండు. |
349 |
| క. |
దేవతలను బ్రార్థించిన | నావసుధామరుని చిత్త మా ప్రొద్ద తప స్సేవనతత్పర మగుడున్ | దేవానుచరునకు నిట్లనియె నతఁ డధిపా! |
350 |
| క. |
‘అనఘా! భవదీయదయన్ | మనంబు దెలివొందె నిపుడు నా; కే నొల్లన్ ధనము తపంబ యొనర్పఁగ | ననుజ్ఞ సేయంగవలయు నాదరణమునన్.’ |
351 |
| ఆ. |
అనిన ‘నట్లకాక యాచరింపుము ధర్మ’ | మనుచు నరిగె నిర్జరానుచరుఁడు భూసురుండు మూలములును బత్రములు నా | హారములుగఁ జేసె నధికతపము. |
352 |
| క. |
క్రమమున జల పవనము లశ | నములుగఁ గొని తపము సేసినం గాయముఁ జి త్తము మానుషంబు లగు చం | దములు విడిచి దివ్యమహిమధామము లయ్యెన్. |
353 |
| వ. | అట్లు సిద్ధుం డగుటయు. | 354 |
| క. |
నను నెవ్వ రాశ్రయించిన | ధన మొసఁగుదు, రాజ్యమిత్తుఁ; దద్దురితములం దునుముదు; నను నగ్గలికలు | మనమున జనియింపఁజొచ్చె మనుజాధీశా! |
355 |
| వ. | అవ్విధంబున మహానుభావుండై. | 356 |
| తే. |
ఆతఁ డతిభక్తిఁ దలఁచె దేవానుచరుని; | నపుడ యక్కుండధారుండు నరుగుదెంచె; నరుగుదెంచిన నతఁడు నిజానుభావ | జనితగంధ పుష్పములఁ బూజన మొనర్చి. |
357 |
| ఉ. |
చక్కఁగఁ జాగి మ్రొక్కుటయుఁ జయ్యన నెత్తి మనం బెలర్పఁగా నక్కునఁజేర్చి యిట్లనియె నద్దివిజానుచరుండు ‘శంక దాఁ దక్కి ధనంబుఁ గామమును ధర్మముతోఁ గలయంగ నెన్నునే యక్కట! యిట్లు వేదమని యప్పురుషార్థమునూఁద మే లగున్.’ |
358 |
| వ. | అని ధర్మం బగ్గించి. | 359 |
| క. |
‘ఆ సుకృతముఁ గడయెయ్ది మ | హాసత్త్వా యోగసేవ నారామత ను ద్భాసితుఁడ వగుచు నిష్ఠా | వ్యాసంగ విహారి వగు మనామయలీలన్.’ |
360 |
| క. |
అని యతఁడు నిజనివాసం | బున కరిగెను విప్రవరుఁడు మునిజనములు పూ జనము లొనరింప ఖేచరు | లనుమోదింప విహరించె నప్రతిహతుఁడై.’ |
361 |