పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
నారద ప్రవర్తితం బగు నితిహాసము (సం. 12-264-2)
వ. అని చెప్పి యప్పురుషవరుం డప్పాండవాగ్రజుతో వెండియు నిట్లను ‘నొక్క ధర్మసూక్ష్మ త సెప్పెద నాకర్ణింపు; ముంఛవృత్తి యగు విప్రుం డొక్కరుండు భార్యాసహితుండై వనంబున నుండి యజ్ఞాచరణంబునకుం దొడంగి యహింసాపరుఁ డగుటం బశువిధి యుడిగి ఫలమూలంబుల హవిస్తంత్రంబు నడపం జూచె; నది విహితాచారంబు గామి యెఱింగియు శాపభయంబునం దత్పత్ని యమ్మహీసురవరు నెదుర నిలిచియుం బలుకకుండెఁ; బాకశాసనాదులు హవిర్భాగంబులు గొనం గడంగమి నగ్నియుం బచనశక్తిం దొఱంగె; నట్టియెడ నా సమీపంబునం దిరుగు హరిణంబు మనుష్య వచనంబులం దత్పత్ని దూఱి యమ్మహీసురవరు నెదుర నిలిచి తన్ను హింసించి యాగంబు సెల్లింపు మనిన, నతండట్లు సేయంబొ మ్మనవుడుఁ గొన్ని యడుగులు వోయి మగిడి యాకృష్ణమృగంబు ‘నా యిచ్చు దివ్యదృష్టిం గనుంగొను; మేను చెప్పినట్లు సేసిన ని న్నభినందించువారై యప్సరఃకాంతలును గంధర్వులును వీరె విమానంబుల నేతెంచిన వా’రనుటయు నవ్విప్రుండు విలోకించి దివ్యత్వసిద్ధికై దాని హింసించువాఁ డగుటయు; దానం దదీయతపంబునకు నుత్పాతంబులు పుట్టె; నేణరూపంబున వర్తించు నా ధర్మదేవత యా భూదేవునకు సన్నిధి సేసి నీయజ్ఞశ్రద్ధకు సంతోషించి ధర్మసూక్ష్మ త్వంబు దెలుప వచ్చితి; నర్హంబగు హింసావిశేషం బహింసావ్రతహానింజేయదు; క్రతువు గదాయని యనర్హహింస కర్తవ్యంబుగా దని నిర్దేశించి తత్పత్నీసమాధానంబునం దపశ్శక్తి ప్రత్యాసత్తియుం జేసి యాగవిశేషవిధానంబు వరప్రదానంబున నిర్వహించె; నయ్యితిహాసంబు నారదప్రవర్తితంబని చెప్పిన నప్పుడమిఱేఁడు ప్రీతుండై. 362
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )