| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| చ. |
అనవుడు భీష్ముఁ డిట్లనియె ‘నాతఁడు యోగబలంబు పెంపునన్ ధనదుని మోసపుచ్చి తదుదాత్త ధనం బవలీలఁ గొన్న నె మ్మనమున నొచ్చి చెప్పెఁ బురమర్దనుతోడ; నతండు దానికిం గనలున నమ్మహేశ్వరుఁడు గన్నుల నిప్పులు రాలుచుండఁగన్. |
469 |
| తే. |
శూల ముగ్రత నెత్తి ‘యెచ్చోట నున్న | వాఁడు భార్గవుఁ?’ డనుచు దుర్వారకోప వివశుఁ డగుటయు? నాతఁడు వెఱచి చాల | దూరముగఁ బోయి తుప్పలఁ దూలియుండె. |
470 |
| క. |
అమ్మెయి నిలుచుటకునుఁ జి | త్త మ్మోర్వమిఁ దల్లడంబు దనికినఁ గడు వే గమ్మునఁ ద్రిపురహరుని హ | స్తమ్మునఁ జొప్పడియెఁ గని యతఁడు వెస మ్రింగెన్. |
471 |
| ఆ. |
కడుపులోన నుండి కలగొనఁ బాఱెడు | విబుధవైరిగురుఁడు వెడలకుండు నట్లుగాఁగఁ దెరువులన్నియు మూసి శి | శ్నంబు మూయ కంగజన్మరిపుఁడు. |
472 |
| క. |
వెడలు మని తెరువు సూపిన | వెడలెను భృగునందనుండు; వెండియుఁ గోపం బడరఁగ నాతనిఁ గనుఁగొని | యెడు రుద్రునిఁ జూచి దేవి యిట్లనియె నృపా! |
473 |
| క. |
‘నీ కడుపున జన్మించుట | నాకుం గొడుకయ్యె నితఁడు; నా సుతునకు సు శ్లోకా! యలుగం దగునే | నీకు? సుఖిం జేయు మీతనిం గృపతోడన్.’ |
474 |
| తే. |
అనినఁ దేజస్విఁ జేసి చంద్రార్ధ మౌళి | శిశ్నమున నిర్గమించుటఁ జేసి యితఁడు శుక్రుఁ డనుపేర వర్తించు; సుదతి! నీకుఁ | బ్రియ మొనర్చితి ననియె సంప్రీతితోడ. |
475 |
| తే. |
‘అనఘ! యిది భార్గవుఁడు శుక్రుఁడైన తెఱఁగు’ | నావుడును ధర్మజుఁడు శాంతనవునితోడ ‘నీదు వాక్యామృతమున నా నెమ్మనంబు | తృప్తి సనదు; సద్ధర్మంబుఁ దెలుపు’ మనియె. |
476 |
| వ. | అనవుడు నమ్మహానుభావుం డమ్మహీనాథుతోఁ ‘బరాశర గీతా శ్రవణ ప్రవణుండ వగు’మది ధర్మప్రబోధకం బగునని పలికి యిట్లనియె. | 477 |