పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
జనకుని ప్రశ్నంబులకు సులభ ప్రత్యుత్తరంబు లిచ్చుట (సం. 12-308-95,96)
క. విను పాంసూదకముల చా | డ్పున జతుకాష్ఠముల భంగి భూతంబులకున్‌
మనుజేంద్ర! కలుగుఁ బొం దా | పని నన్యోన్యసమధీనభావము గలదే?
192
ఆ. ఒక్క మేనియంద యుర్వీశ! పంచభూ | తములు దశమితేంద్రియములు మనసు
బుద్ధియును బ్రధానమును గల వివి యొక్కఁ | డొకటియవియె, యేల యొండు సెప్ప?
193
వ. నిక్కంబునకు నెవ్వరు నెవ్వరివారుం గామి తెలియవే? యని పలికి వెండియు. 194
తే. ‘సకలలోకములను సదశ్వంబు కరణి | ధావనము సేయుచుండుఁ బ్రధాన మింత
యెఱిఁగి జననాథ! యెవ్వరి నెచటనుండు | వార లనువార మమ్మాటవలను సెపుమ!
195
తే. నీవు నీయందు నినుఁగను నెఱియ యొరుల | యందుఁ గానంగవలవదే యధిప! తన్ను
నొరులనొక్కటిగాఁ జూచు పురుషుఁ డెచట | మీరలుండుదు రెవ్వరివార లనునె?
196
తే. అరులు మిత్త్రు లుదాసీను లనుచు సంధి | విగ్రహాది షడ్గుణముల వెరవు లొకరుఁ
డలవరించుచు విజయంబు నాసపడుచు | నుండునటె? ముక్తితెఱఁ గిటులున్నె యరయ?!
197
ఉ. కావున నీవు ముక్తుఁడవు గా విటు గాకయు నిన్ను ముక్తుఁగా
భూవర! చూచె దిక్కలఁక బుద్ధులు సెప్పి తగం దొలంగఁగాఁ
ద్రోవఁగఁ బాడి బంధులకు దుర్మతి వుట్టినయట్టి మర్త్యు వా
రే విధినైన మందు లిడి యెప్పటి బుద్ధి ఘటించుచాడ్పునన్‌.
198
వ. ఏనెట్లు ముక్తుండఁగా? నంటేని విను మింకనుం జెప్పెద. 199
సీ. వర్గత్రయంబున వలనను సప్తాంగ | ములయందుఁ జిత్తంబు మెలఁగుచుండ,
రాజులు-మజ్జనభోజన నిద్రావ | సరములు లోనుగా జనులుసేయు
విజ్ఞాపనము విని యాజ్ఞాపనం బొన | రించుచు, మంత్రులుఁ బ్రేమపాత్ర
తరుణులు నస్వతంత్రతఁ జేయ, నర్థుల | కొసరి తిండియు ధనగుప్తిమీఁది
 
తే. భరముఁ దమలో విరోధులై పట్టి మనసుఁ | జిక్కువఱుపంగఁ, బెక్కండ్రు సిరికి నడువఁ
బరిహరించుచు - బహుదుఃఖపరులు నల్ప | సౌఖ్యులును నగుచునికి రాజ్యంబు తెఱఁగు.
200
వ. వారలు ముక్తులు గామి దెల్లం బది యట్లుండె నీకు విశేషించియు. 201
చ. సదయ మనీషఁ బంచశిఖసంయమి మోక్షము దెల్పెనంటి, నీ
హృదయము నాదు చొచ్చుటకు నెంతయు రోసితి, ముక్తు చందమే
యిది? నిరపేక్షుఁడైన విను మెయ్యది యెట్లయినం బ్రశాంతిసం
పద నొకయింతయుం గలఁగఁ బాఱకయుండఁడె నిర్వికారుఁడై?
202
క. విను శూన్యస్థానంబున | నునికి యతికిఁ గృత్య మగుట నుర్వీశ్వర! ము
క్తుని మానసంబు శూన్యం | బని చొచ్చితి, ముక్తి లేమి నది తప్పయ్యెన్‌.
203
వ. అట్లుం గాక. 204
ఆ. కాలుఁజేయి మొదలుగాఁగల నాయంగ | కములలోన నిన్నుఁ గలయ దొకటి
యేని, రిత్త యిప్పుడేటికిఁ గటకటం | బడుచు నిట్లు దూరఁబలికి తధిప!
205
వ. అని యమాత్యుల దిక్కు సూచి. 206
ఆ. వీరు పెద్దవారు; వీరలు విన నిట్టి | తులువమాటలాడ దొరకుఁదగునె?
యెదిరిఁ దూలవుచ్చు టే మంచివెరవు? గాం | భీర్యహాని దలఁచు పెంపు లేదె?
207
క. వనితల పురుషులయెడఁ బు | ట్టినయది వెల్లివిరిసేఁత డిమ్మరితన, మె
ట్టి నికృష్టుం డైనను ని | ప్పనికిఁ జొరఁడు; దగునె యిది నృపాలసుతునకున్‌?
208
చ. బిసరుహపత్రలగ్న జలబిందువు చాడ్పున సంగవర్జితో
ల్లసనమునన్‌ వసించితి నిలావర! నీ మది నిట్టిదానిఁగాఁ
బొసఁగ నెఱుంగవైతి నను; బొంకగు టేర్పడియెన్‌ విముక్తి చొ
ప్పు సదయవృత్తి నీకు మునిపుంగవు చెప్పుట మాటలేటికిన్‌?
209
క. నీవు గృహధర్మ పరతయుఁ | బో విడిచితి; నీకు మోక్షమును విదితము గా
దేవలనికిఁ గా కిట్లు ధ | రావర! మిథ్యా ప్రబోధరతుఁడై తరయన్‌.
210
క. ముక్తులు ముక్తులఁ గలయుట | యుక్తమ - యది నభము నభము నొందు తెఱఁగు, నీ
ముక్తత బొంకని దీనిని | సక్తతగా నీవు గనుట సాలదె తెలుపన్‌?
211
వ. మనము ముక్తులము గాకున్నను మనకు సాంగత్యము గలుగుట నింద్యంబుగా దెట్లంటేని. 212
సీ. నిఖిలజన శ్రోత్రసుఖకరం బగు చరి | త్రమునఁ బెంపారెడు ప్రథన నృపతి
కులమునఁబుట్టితి, సులభ నా పేరు, మ | త్పూర్వులు శతశృంగమునను ద్రోణ
మునను శక్రద్వారమున మహాధ్వరములు | సేసిరి, విను పాకశాసనుండు
దమ పాలి కేతేరఁ దద్గోష్ఠిఁ బరమార్థ | చింత సేయుదురు, భూకాంత! యేను
 
తే. నాకు నెనయైన పురుషుండు లేకయునికి | మోక్షధర్మ ప్రవర్తనమునఁ జరింతుఁ,
గాన నీ చూచు వర్ణసాంకర్య మస్మ | దీయ సాంగత్యమున లేమి దెల్లమరయ.
213
క. నను డాఁప నేల దానం | గనియెడునది గలదె? ముక్తి గలదో? లేదో?
జనకున కరసెదఁ గా కని | చనుదెంచితిఁ, దప్పె యది విచారింపంగన్‌.’
214
క. అని యిట్లు పలుకు పలుకులు | విని పలుకకయున్న జనకవిభు నాననముం
గనుఁగొని సులభ నగుచు ని | ట్లనియె నతనితోడఁ గౌరవాన్వయముఖ్యా!
215
తే. ‘అగ్ని వెచ్చనొ? చల్లనో? యని మనమునఁ | గరము సందియ మందుట గాదె నిన్ను
నధిప! ముక్తుండవో? కావొ? యని తలంచు | టది మదీయ బాలిశభావ మని తలంపు.
216
చ. జనవర! నీ సుభాషల నసత్యమొకండును లేదు నీవు స
న్మునిగణకీర్తనీయుఁడవు మోక్షము నీ కఱచేతిలోనిదై
యునికి దృఢంబుగాఁ గనియు నొండొక చందము మాటలాడితిన్‌
నిను నగుపింపఁగా వలసి నీదగు మన్నన శంక వాసినన్‌.
217
క. అవియెల్ల నసత్యంబుల | యవనీశ్వర! యరయవచ్చుటది యొక్కఁడు ని
క్కువ మీ యపరాధము భవ | దవిరళ సౌజన్యమగ్న మగుఁగాక తగన్‌.
218
క. సులభానామము సంసృతి | పొలమొల్లక తిరుగుటయును భూలోకవరా!
కలరూప నేఁటి కిచ్చట | నిలిచెద నీవు మునిసేవనీయుఁడ వగుటన్‌.’
219
తే. అనినఁ దానును మంత్రులు నవ్విభుండు | సులభఁ గొనియాడె; నాఁడెల్ల నలఘుగోష్ఠిఁ
బ్రియము రెట్టింప నయ్యోగినియును దారు | నెమ్మి నొక్కట నుండిరి నృపవరేణ్య!
220
వ. మఱునాఁ డజ్జనపతి యనుమతిసేయ నమ్మహానుభావ నిజేచ్ఛం జనియె’ నని చెప్పిన నప్పౌరవోత్తముండు ప్రమోదాయత్తస్వాంతుండయి శాంతనవునితో ‘శుకుని కెవ్విధంబున వైరాగ్యంబు సొప్పడియెం జెప్పవే?’ యనుటయును నతం డా ధర్మ సుతున క్లినియె. 221
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )