పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
శ్వేతద్వీపవాసియగు నారాయణుండు నారదున కుపదేశించిన తత్త్వము (సం. 12-326-10,11)
క. ‘ననుఁ గానఁ బడయ రెవ్వరు | ననఘా! యేకాంతికులక యర్హము మద్ద
ర్శన మీ వేకాంతికుఁడవు | ననహంకారుఁడవుఁ గాన యబ్బెం జూడన్‌.’
379
వ. అని పలికి వరంబు వేడుమనుటయు నతండు ‘దేవా! భవద్దర్శనంబుకంటె మిగుల వరంబునుం గలదే?’ యనుటయు నద్దేవుండు సవిశేషప్రసాదభరితుండై. 380
సీ. ఇంద్రియంబుల కందఁ డెల్ల భూతంబులుఁ | దెగినను దెగకుండుఁ ద్రిగుణరహితుఁ
డఖిలంబునకు నాత్మ యన సర్వసాక్షినా | నజుఁ డన నిష్కళుండన వెలుంగు
క్షేత్రజ్ఞుఁ డాతండు జీవుండు వాసుదే | వుండును సంకర్షణుండుఁ జూవె
వారు మనం బహంకారంబు వరుసఁ బ్ర | ద్యుమ్నానిరుద్ధనామోపహితము
 
తే. లింతయును మన్మయంబ యే నిరువదియును | నాల్గునగు తత్త్వకోటికి నాథుఁడైన
పంచవింశకాభిఖ్యుండఁ బరమపురుషుఁ | డనియు నాపేరు మఱి పర మరయ లేదు.
381
క. విను మేకాంతికుఁ డెవ్వనిఁ | గని నిత్యానందపదము గను నప్పరమా
త్ముని వాసుదేవు నిష్కలు | ననుపముఁగా నను నెఱుంగు టాత్మహితమగున్‌.
382
క. భూతాత్మకమైన యఖిల | ధాతుచయము వెలిగ లేదు తను నా మొత్తం
బాతతజీవవ్యాప్తి స | మేతము గాకున్నఁ జేష్ట నెసఁగదు వత్సా!
383
క. జీవశరీరములు పృథ | గ్భావాకలితములు గాఁగఁ గనుటయు వలయున్‌
జీవునిఁ గంటి ననుట మా | యావిలసన మస్మదీయ మది మునివర్యా!
384
క. జీవుఁడు మత్సముపేతుఁడు | గావు టెఱుఁగవలయు దృఢముగా భక్తిమయం
బై వఱలు నాశ్రయంబున | నేవాఁ డొందు నను వాని కిత్తు విముక్తిన్‌.
385
క. ఆదిత్య మరు ద్వసురు | ద్రాది దివిజగణము నంబుజాసనుఁడుఁ జతు
ర్వేదములు మదాత్మకతం | గాదే తత్తద్విశేష గౌరవమొందున్‌!
386
తే. కమలగర్భు సృజించి సకలజగద్ధు | రానియుక్తునిఁ గావించి యే నివృత్తి
పరత నేకాకినై దివ్యభవ్య మగు స | హాయముగ సంచరింతు మధ్యస్థవృత్తి.
387
వ. ఒక్కొక్క కాలంబుల జగద్ధితంబుగా జన్మకర్మంబులం బూనుదు వినుము వారాహ రూపంబు దాల్చి హిరణ్యాక్షుని నారసింహమూర్తి ధరియించి హిరణ్యకశిపుని భృగువంశంబున జామదగ్న్యుం డన జనియించి సర్వక్షత్రంబును దశరథుండను రాజునకు రామనామంబునం బుట్టి రావణాసురుం బరిమార్పంగలవాఁడ. భూభారంబు వాపుటకై యాదవకులంబునఁ బ్రభవించి పురందరనందనుండై యవతరించిన నరుండు దోడ్పడ నక్కార్యంబు నిర్వహింతు. నేను దొల్లి నరనారాయణు లనియెడు నామంబుల మూర్తిద్వయంబును ఋషిత్వంబును వెలయ నొలసి లోకరక్షణం బాచరించుచున్నవాఁడ. నమ్మూర్తుల పదంపడి కేళీమానుషత్వంబు గైకొని యిట్లు సేయు నయ్యవతారంబునఁ గంస కాలయవన ముర నరక బాణప్రముఖులైన కంటకులం జెఱుతు. నందు బాణాసురుం గాతునని పూని మహాదేవుండు మహాసేనానీసహితుండై యడ్డపడ నమ్మహాత్ముని జయించి బాణునిం బరాభవింతు. నింతకుమున్ను మత్స్య త్వంబుకూర్మత్వంబుల నొంది నిఖిలచ్ఛందోబృందారక హితం బొనర్చితి మచ్చరితంబులు నీకుం గర్ణగోచరంబులు గాకుండెడునే? మఱియు ధర్మరక్షణార్థంబుగా నేమేమి సేయవలయు నవియెల్లనుం జేయువాఁడఁ గృత్యంబులు గృతంబులైన మదీయ ప్రకృతిం బొందుదుఁ బరమేష్ఠినందనా! నీ వేకాంతికుండ వగుట నీకు నా తెఱంగెల్ల నెఱింగించితి’ నని చెప్పి యమ్మునిం గని యనాహారులు ననింద్రియులు నస్వేదులు సుగంధి శ్వేతదేహులు నగు నమ్మానవులం జూపి ‘వీరేకాంతికులు’ మన్మయధ్యానపరులునై యున్నవారు వీరలకు సమ్మర్దంబుగా మెలఁగం దగదు. నీవింకం బొ’మ్మని పరమాదరంబునం బలికి వీడ్కొలిపిన నద్దేవమునిసత్తముండు పరమానందభరితుఁ డై బదరికాశ్రమంబునకుం జనుదెంచి నరనారాయణులం గాంచి. 388
తే. భక్తి వీడ్కొని చని మునిప్రతతి కెందు | నచ్యుతాననోద్గతము వేదార్థమయము
యోగసాంఖ్యాత్మకమునైన వాగమృతముఁ | గర్ణపుటపేయముగఁ జేయు గారవమున.
389
వ. నారదుం డట్లు విష్ణుని దివ్యవాక్యవితతి విద్వజ్జనంబులకు వినిపించుచు బ్రహ్మసభ కరిగి యందునుం బ్రకటించె’ ననుటయు ‘నప్పద్మభవునకు నది వింతయే?’ యనిన నక్కౌంతేయాగ్రజుతో శాంతనవుం ‘డా శతానందునకు నపరిజ్ఞాతంబునుం గలదే? యతనిం గొలువ వచ్చినట్టి సిద్ధసాధ్యాదులకు వినిపించెఁగాక’ యని పలికి వెండియు నిట్లనియె. 390
క. ‘క్రమమున వాఙ్మయమగు న | య్యమృతము లోకమునఁ బరఁగె నది మజ్జనకుం
డమితదయఁ జెప్పె నాకును | శమయుత! యేఁజెప్పితిని విశదముగ నీకున్‌.
391
క. మునులును సురలును దీనిని | విని కొనియాడుదురు విష్ణు వినుతింతురు భ
క్తినిరూఢులై జపింతురు | మనమునఁ జపింతు రతిసమాహితు లగుచున్‌.
392
తే. నీవు నిట్టుల చేయు వినీతిపరుఁడు | విష్ణుభక్తుండు శమదమాన్వితుఁడు నైన
యట్టివానికిఁ జెప్పుమీ యచ్యుతాన | నోద్గతంబైన యిప్పురాణోత్తమంబు.
393
క. నీ వినిన యుపాఖ్యానము | లేవియు సరిగావు దీని కిది దీర్ఘాయుః |
శ్రీవిభవారోగ్యములం | గావించుఁ బఠించినం దగం దను వినినన్‌.’
394
క. అని శాంతనవుఁడు సెప్పిన | విని మోదమునొంది పాండవేయులు దీనిన్‌
వినుచుఁ బఠించుచు విష్ణుం | గొనియాడుదు రధికభక్తిఁ గురువంశవరా!’
395
వ. అని చెప్పి వైశంపాయనుండు వెండియు. 396
ఉ. ‘సాత్యవతేయుఁ డీ పరమ జప్యము భక్తిఁ బఠించుచున్‌ వియ
ద్గత్యభిరాముఁడై నియమతత్పరతం జను దుగ్ధవార్ధికిన్‌
నిత్యము విష్ణుఁగాంచి మహనీయతరం బగు పూజనంబు సం
స్తుత్యముగాఁగఁ జేఁతకుఁ గుతూహలసంపద పల్లవింపఁగన్‌.’
397
వ. అనిన విని జనమేజయుండు మోదంబునొంది యమ్ముని సత్తమునితోడ నీవు మోక్షం బత్యంత సుఖం బని చెప్పుదు. సకలజనంబులు నభ్యుదయకరంబులైన కర్మవిశేషంబులం దగిలి యుండుదు ‘రొరుల నననేల? దేవతలును దద్ధర్మంబు వాటింపక హవ్యభోజనపరత్వం బూని యుండుదు రమ్మహాత్ము లట్లగుట యెట్లొకో? యని యేను విచారించుచుండుదు నత్తెఱంగు దేటపడ నెఱింగింపవే?’ యని యడిగిన నప్పారాశర్యశిష్యుం డా భూవరున కిట్లనియె. 398
క. విమలాత్ముఁడు పారాశ | ర్యమునీంద్రుఁడు శిష్యులను మహాభారతపం
చమములగు వేదముల మే | రుమహీధరవాసియై కరుణఁ జదివించెన్‌.
399
వ. అట్టియెడ నేనును సుమంతు - పైల - జైమినులు నీ విప్పుడు నన్నడిగిన చందంబున నమ్మహాత్ము నడిగితిమి దానికి సుముఖుండయి సర్వజ్ఞుండును సదయహృదయుండును నగు సాత్యవతేయుండు మాకు నిట్లని యానతిచ్చె. 400
తే. ఏ నతీతంబులును వర్తమానములు న | నాగతమ్ములు నగు జగదఖిలవర్త
నంబులును గను దివ్యబోధంబు గోరి | పాలకడలి తీరమునఁ దపంబుసేసి.
401
వ. నారాయణప్రసాదంబునం జేసి సిద్ధమనోరథుండ నైతిం గావునం గల్పాదియందుఁ గమలసంభవప్రముఖ బృందారకు లాచరించిన కృత్యంబులు గానవచ్చు వానిం జెప్పెద దాన మీ యడిగిన యర్థంబు దేటపడు వినుండు. 402
క. ఆదిత్యమరుద్వసురు | ద్రాదిసురులు మునులు నంబుజాసనుఁగని మా
కేది కరణీయ మీశ? ద | యా దృష్టిని మమ్ముఁ జూచి యానతి యీవే?
403
వ. అని విన్నవించిన విని భరితాదరుండగుచు నప్పరమేష్ఠి వారితో ‘మీ కెయ్యది కర్తవ్యంబో యను తలంపు మున్న నా చిత్తంబునం బొడమి యున్నయది. మీరు నిమ్మాట సెప్పి మేలు సేసితిరి. మీకును నాకును బ్రబలత్వం బెద్దానం గలుగు దాని నుపదేశించుటకుం బురుషోత్తము శరణు సొత్తము రం’ డని పలికి వారునుం దానును దుగ్ధవారాశితీరంబునకుం బోయి ఘోరంబగు తపంబు బహుసహస్ర సఖ్యంబులగు దివ్యవర్షంబు లాచరించిన వారలకు గంభీరమధురప్రకారయగు వాణి యిట్లని వీతెంచె. 404
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )