పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
విష్ణుఁ డదృశ్యరూపంబున బ్రహ్మాదిదేవతల కుపదేశించిన హితప్రకారము: (సం. 12-327-47,48,49)
క. ‘మీ వచ్చినపని యెఱుఁగుదు | నీ వనజభవుండు జగము లిన్నిటికి గురుం
డే విధిఁ బనిచిన నది శ్రుతి | భావితకర్మంబు దానఁ బరఁగుదుఁ దగఁగన్‌.
405
వ. ఏనునుం జెప్పెద వినుండు వేదహితం బగు నొక్క యాగంబు సేయుం డందు భాగంబు నాకుం గల్పింపవలయు’ ననిన వారుం బ్రీతిఁ బొంది. 406
క. కమలజు పంచిన క్రియ యా | గము వైష్ణవ మనఁగఁ జేసి, కల్పించిరి భా
గము విష్ణున కం, దతఁ డ | య్యమరుల మునివరులపై దయను గగనమునన్‌.
407
వ. అదృశ్యుండై నిలిచి వారలతో నిట్లనియె. 408
క. నా పంపునను బ్రవృత్తి | వ్యాపకయైనట్టి సత్క్రియం జేసితి రి
ట్లీ పుణ్యంబునకును ఫల | రూపంబగుదాని నే నిరూపింతుఁ దగన్‌.
409
వ. మరీచి యంగిరసుం డత్రి పులస్త్యుండు పులహుండు క్రతువు వసిష్ఠుఁ డను వీర లవ్వారిజభవునకు మానసపుత్రు లిమ్మహాత్ములు నట్టివార; వేదాచార్యులు యజ్ఞకార్యధుర్యులు; వీరు విధింప సర్వయజ్ఞంబులును మానవులు మాననీయంబులుగా నడప మీ కెల్లను నయ్యాగంబుల భాగంబులు గలిగి తద్భాగంబుల నాప్యాయితులై యుపబృంహణంబు నొందువారలు సన సనక సనందన సనాతన కపిల సనత్కుమారులు పరమేష్ఠిమనోనిర్మితులు సహజజ్ఞాన విజ్ఞానులు నివృత్తిపరులునై సాంఖ్యయోగంబులకుం బ్రవర్తకు లగుచుండుదురు. వీరలచేత మోక్షధర్మంబులు సువ్యంజితంబు లగు. మీకుం దల్లియుం దండ్రియు గురుండును నివ్విరించియ. మదీయానుశాసనంబున నితండు సర్వానుశాసకుండై వర్తిల్లువాఁడు. మత్ఫాలప్రభవుండైన రుద్రుండు సర్వలోకారాధనీయుండును సకలవరప్రదుండునుం జుండీ! మీరు వొండు ; వేదోదితకర్మంబు లిక్కమలభవుండును మరీచ్యాది ప్రజాపతులునుం బంచినట్లు నడవం గలయవి. యిది కృతయుగం బను పేరింటి యుత్తమకాలంబు; దీనియందుఁ బశువులు హింస్యంబులు గావు సంశయంబు వలవదని నిర్దేశించిన. 410
క. మునులును సురలును విష్ణు | న్వినుతించి నమస్కరించి నిజపదములకుం
జనిరి పరమేష్ఠి యొకరుఁడ | చన కచ్చట నిలిచె హరియు సన్నిహితుండై.
411
తే. హయశిరోభాసితుండును హస్తకలిత | లలిత దండకమండలూజ్జ్వలుఁడు సాంగ
వేదముఖరముఖుండునై యాదరార్ద్ర | దృష్టి నిగుడంగ నిలిచి యద్దివిజముఖ్యు.
412
వ. కౌఁగిలించుకొని నీవు సర్వంబునకును విధాతవు గురుండవు ప్రభువవు నయి నడపుము. నీయందు సర్వభారంబునుం బెట్టి సుఖినై యుండెద. నడపుట నీకెప్పుడేనిఁ గడిందియై తోఁచె నప్పు డేను దోఁచి సమస్తంబును సునీతంబు సేయంగలవాఁడ ననియెఁ దదనంతరం బావిష్ణుం డంతర్హితుం డయ్యె. నిట్లు యజ్ఞంబు లందగ్రభాగార్హుండును యజ్ఞధారియునైన యప్పద్మనాభుండు ప్రవృత్తిధర్మంబు బ్రహ్మాదులకుం గృత్యంబు సేసి నివృత్తి ధర్మంబునందు నిష్ఠుండును విద్యాసహాయుండునునై సర్వగతుం డగుచుఁ జరియించు నని చెప్పి యప్పారాశర్యుండు. 413
క. మొదలఁ గలిగించి జగములఁ | బదిలంబుగ నునిచి వానిఁ బదపడి తనయం
దొదిఁగించి మఱియు నెమ్మెయి | నుదారగతి నడపు చిన్మయుని గొలుతు హరిన్‌.
414
ఆ. అజుని విశ్వరూపు నమరుని సర్వామ | రాధినాథు నాద్యు సాంగవేద
వేదితవ్యు నాత్మవేద్యు నీశాను న | వ్యయుఁ దపఃఫలాత్ము నాశ్రయింతు.
415
వ. అని మఱియు ననేకప్రకారంబుల నప్పరమముని యప్పుడు భావంబున నెలకొన్న నారాయణుం బ్రస్తుతించి మమ్ముం గలయ నవలోకించి పూర్వవృత్తాంతంబు ప్రజ్ఞాదృష్టిని నా కన్నయది మీ కెఱింగించితి విష్ణుని దివ్యవచనంబుల చొప్పున నడచునది. యప్పరమేశ్వరుం గొలువుండు; వేదవాక్యంబులం దత్ప్రకీర్తనంబు సేయుం డనియె; నేము నట్లకాక యని ఋగ్యజుస్సామంబుల నా త్రిధాముం బ్రస్తుతించి మనంబుల నారాధించితి’ మని చెప్పి వైశంపాయనుండు వెండియు. 416
సీ. సర్వజ్ఞుఁడగు పరాశరనందనుని చేత | భాషితంబైన యప్పరమపుణ్య
వృత్తంబు సదివిన విన్నను విప్రుండు | వేదవేదియు, రాజు విజయశాలి
యును, వణిజుండు లాభోపేతుఁడును, శూద్రుఁ | డత్యంతసుఖియును నగు నరేంద్ర!
కన్య సద్వరకరగ్రహణంబు వడయు, గ | ర్భిణియైన కాంత సద్గుణునిఁ బుత్రుఁ
 
ఆ. గాంచుఁ, బ్రసవకాలకలయందు నెఱి దప్పి | యున్న బిడ్డగలుగునువిద సుఖక
రప్రసూతి నిర్భరతనొందు, వంధ్య సం | తానసిద్ధి సమ్మదంబు నొందు.
417
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )