పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
భగవన్నామ నిర్వచన ప్రకారము (సం. 12-318-3)???
వ. ‘మఱియు నెవ్విధంబు మనోరథంబులైనను సఫలంబు లను ననిన విని జనమేజయుండు ‘గూఢంబు లగు విష్ణునామంబు లనిర్వచనంబులు వినవలతు వివరింపవే’ యనుటయు వైశంపాయనుం డమ్మహీ నాయకులతో నర్జునుం డడుగం గృష్ణుండు వివరించిన నిజనామంబుల నిరుక్తి తెఱంగెఱింగించెద నాకర్ణింపు మప్పార్థుని బోధించుటకై యద్దేవుం డిట్లనియె. 418
తే. ‘నరుఁడు నారాయణుండు ననంగఁ బరఁగు | నిత్యపురుషులు నీవును నేనుఁ జుమ్ము,
భువనహిత మాచరింపఁగాఁ బూని వేడ్క | వచ్చి యిమ్మహిఁ బుట్టినవార మనఘ!
419
వ. గూఢంబులగు మదీయాభిధానంబుల యర్థంబులు దేటపఱిచెద నాకర్ణింపుము. 420
క. నారము లనఁగా జలముల | పే రయనం బనఁగ నెలవు ప్రీతిగ నాకున్‌
నారము లయనం బగుటను | నారాయణుఁ డండ్రు జనులు నన్నుఁ గిరీటీ!
421
క. వసియింతు నే జగములన్‌ | వసియించున్‌ జగములెల్ల నాయం దిమ్మై
పొసఁగి వెలుంగుచునుండుట | నసదృశగుణ! వాసుదేవుఁ డనఁగఁ బరఁగుదున్‌.
422
క. వ్యాపించి రోదసీకుహ | రాపూర్ణత్వమున నునికి నధికక్రమణ
శ్రీ పొలుపున విష్ణుండను | దీపితనామంబునను బ్రతీతుఁడ నగుదున్‌.
423
తే. దమమునాఁ గల యుత్తమధర్మ మెడఁద | నలవఱిచి నన్నుఁ గామించు నార్యజనము
దివియు భువియు నా నడుమన తేజరిల్లు | నట్టు లగుట దామోదరుఁ డండ్రు నన్ను.
424
ఆ. అన్నమును జలంబు నమృతంబు వేదంబుఁ | బృశ్ని యనఁగ నొప్పుపేరఁ బరఁగు,
నది మదీయగర్భ మగుట విద్వజ్జను | లనఘ! పృశ్నిగర్భుఁ డండ్రు నన్ను.
425
క. ఇనరశ్ములుఁ జంద్రాంశులు | ననలశిఖలు గేశ సంచయము నాకుం గా
వునఁ గేశవాభిధానం | బునఁ గొనియాడుదురు ననుఁ బ్రబుద్ధజనంబుల్‌.
426
క. క్షత్త్రము బ్రహ్మము నై లో | కత్రాణన మాచరింపఁ గావలసి పృథా
పుత్త్రా! యగ్నీషోములు | చిత్రస్థితి వెలుఁగుదురు ప్రసిద్ధాకృతులన్‌.
427
వ. అని చెప్పి బ్రహ్మక్షత్ర పదంబులు విప్రరాజ నిర్దేశంబు లగుట దేటపడం బలికి విప్రుల రాజుల మహానుభావంబులు విలసిల్లినయెడలు నిదర్శనంబులుగా నిరూపించి యుపన్యసించి యవియెల్ల నగ్నీషోమమాహాత్మ్య ంబు గావు టెఱింగించి. 428
తే. బోధనస్థాపనంబులు బుధవరేణ్య! | యగ్నియును సోముఁడును జేసి యఖిలజగము
నఖిలహర్షంబుఁ బొందింతు రవ్యయప్ర | వర్తనత్వంబు దమయందు వఱలుచుండ.
429
క. అనఘా! యగ్నీషోముల | ననుఁగా భావింప జగమునకు నెపుడు హితం
బొనరింతుఁ దత్సుకృతములఁ | బొనరిన మద్భవ్యనామముల వివరింతున్‌.
430
ఆ. పరమ వరద, లోకభావనేశ్వర హృషీ | కేశనామకము లహీనచిత్త!
యనియు మఱియు నిట్టు లను యాగముల భాగ | మాహరింతుఁ గాన హరియునండ్రు.
431
సీ. గో వన మహి యది గుహలోనఁ బడకుండ | జెంది యెత్తుటను గోవిందుఁడనియు
వీతంపు రోమంబుచేత నొప్పార నా | విష్ణుం డగుట శిపివిష్టుఁడనియుఁ,
గర్షణక్రియ భూమిఁ గావింతుఁ, జాయయుఁ | గృష్ణంబు గావునఁ గృష్ణుఁడనియు,
నలవడ సదసద్ద్వయంబును నాయందు | సమవేతమై యున్కి సత్యుఁడనియుఁ,
 
తే. దాత్త్వికంబైన నాకు జాతత్వవికృతి | లేమి నజుఁడనియును, నది లేకపోయి
నపుడు తదనంతరక్షయ మంద కునికి | బుధు లధోక్షజుఁడనియుఁ జెప్పుదురు నన్ను.
432
క. సత్త్వముననుండి తొలఁగమి | సత్త్వము నాచేఁతఁ జేసి సత్తఁ బొరయుటన్‌
సత్త్వమయజన్ముఁ డగుటను | సాత్త్వతుఁ డను నామ మయ్యె జనవర! నాకున్‌.
433
తే. చ్యుతము లేకున్కిఁ జేసి యచ్యుతుఁడ వాత | ముఖ్య ధాతుత్రయాకారమున శరీర
ధారకుండనై యున్కిఁ ద్రిధాతువును న | నంగఁ బరఁగుదు మునివచనంబులందు.
434
క. ఘృత మర్చిస్సంపద యయి | ఘృతార్చి రభిధాన మొందెఁ గ్రీడి! వృషము వి
శ్రుత ధర్మము - ధర్మమయ | స్థితి కతమున వృషుఁడనం బ్రసిద్ధి వహింతున్‌.
435
తే. ఆదిమధ్యాంతములు నాకు నరయ లేమి | నై యనాది యమధ్యుఁ డనంతుఁ డనఁగఁ
జెల్లు పేళ్ళులు, శుచులు నా చెవుల కింపు | లగుట మునులు శుచిశ్రవుఁ డండ్రు నన్ను.
436
ఆ. ఒక్క శృంగమునన యుర్వి యెత్తితి వరా | హావతారలీల యతిశయిల్ల
నట్టు లగుటఁ జేసి యార్యజనప్రియ | నాకు నేక శృంగనామ మయ్యె.
437
క. వినుత మగు లోకరేచన | మున నన్ను విరించుఁ డంద్రు బుధనుత! రవియం
దనుపాధిక విద్యాస్థితి | నునికిం గపిలాభిధాన ముల్లసిత మగున్‌.
438
క. విను యోగంబు హిరణ్యం | బనఁ బరఁగును యోగగర్భుఁడగుటను విద్వ
జ్జనములు హిరణ్యగర్భుం | డని ననుఁ గొనియాడుదురు మహాగుణశాలీ!
439
తే. నరుఁడు నారాయణుండు ననంగ లోక | రక్షణార్థంబు గాఁగ ధర్మమున కేను
బుట్టినాఁడఁ గావున బాండుభూపతనయ! | నాకు ధర్మజుఁ డనియెడు నామమయ్యె.
440
వ. ఇట్లు వుట్టి గంధమాదనంబున నేను దపంబు సేయుచుండ నక్కాలంబునఁ గాలాంతకుండు దక్షునియజ్ఞంబున కలిగిన నది భీతిం బఱతెంచి నా యురఃస్థలంబు నొందిన మదీయ కేశంబులు ముంజనిభంబులగుటం జేసి ముంజకేశుండనుపేరు గలిగె నా రుద్రుండు రౌద్రాకారంబున నయ్యజ్ఞంబు వెనుకొని నాపయిం గవిసిన నొక్క యిషీక పరశురూపంబుగా నభిమంత్రించి యతనిపయిం బ్రయోగించిన నతండు దాని ఖండితధారంబు సేయుటంజేసి ఖండపరశు వను నభిధానంబునుం గలిగె ననుటయు. 441
క. ‘విని పార్థుఁ డిట్లు గలిగిన | యనియం దా రుద్రునొకొ జయము నీకో క
ల్గెను? దాని తెఱంగేర్పడ | వినఁ గౌతుక మొలసెఁ జెప్పవే విశ్వాత్మా!’
442
వ. అనిన విష్ణుం డర్జునున కిట్లనియె. 443
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )