పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
ఇంద్రునకు నారదుఁడు సెప్పిన భృగునామక విప్రుని చరిత్రము (సం. 12-340-4, 5)
వ. అది యట్లుండె; నప్రతిహతగతియై చరించుచుండి యొక్కనాఁడు నారదుం డాఖండలు పాలికిం జనిన నతం డతనికి సముచిత సత్కారంబు లాచరించి సుఖాసీనుండై యున్న యమ్మునివరు నాననంబునం జూడ్కి నిలిపి నీవు మెలంగునెడ నెద్దియేనియు నాశ్చర్యంబు గన్నయది గలదే?యని యడిగిన నమ్మహితాత్ముం డమ్మహేంద్రునకుం జెప్పిన కథ సెప్పెద; నది భవత్ప్రశ్నంబున కుత్తరం బైయుండు. దాని వినుము. భాగీరథీదక్షిణతీరంబున మహాపద్మం బనియెడు పురవరంబునఁ గులశ్రేష్ఠుండగు భృగుండను విప్రుండు గలం; డప్పురుషవరుండు. 546
సీ. ధర్మనిత్యుండు సత్యవ్రత పరుఁ డహిం | సాశాలి యింద్రియజయ విభాసి
నిజకర్మతృప్తుండు నిష్క్రోధుఁ డంచిత | న్యాయసంప్రాప్త ధనముల దేవ
పిత్రతిథిజ్ఞాతి మిత్రకార్యములు ని | ర్వర్తించు, సువినయవంతులైన
తనయులఁ గన్నాఁడు, ద న్నెల్లవారును | వినుతింప మన్నాఁడు, దన మనమున
 
తే. నెట్టి కృత్యంబు మేలొ యే నెద్దిసేసి | కృతపరాయణ ధర్మతా స్థితి వహింతు
నొక్కొ?యని చింతఁ బొందుచు నుండు నాత్మ | నిష్ఠ యలవాటు కాంక్షించి నృపవరేణ్య!
547
వ. అట్లుండ నొక్కనాఁడు. 548
తే. తన గృహంబున కతిథి యుదాత్తుఁ డొక్క | బ్రాహ్మణుఁడు వచ్చె; వచ్చినఁ బరమభక్తి
యుక్తి నాతిథ్య మొనరించియున్నయప్పు | డమ్మహాద్విజుతోడ నిట్లనియె భృగుఁడు.
549
సీ. ‘అనఘ! నీ మధుర వాక్యంబులఁ జేసి మి | త్రత్వంబు నొంది మద్భాగవతము
నీ కెఱింగించెద నీవు నెయ్యమెలర్ప | హిత ముపదేశింపు మేను నియతి
నాత్మావలోకన మాచరించెద నని | తొడఁగుదు నది యలవడదు నాకు
లోకసామాన్య గుణాకలనంబున | బద్ధుండ నగుట నెబ్భంగి నాత్మ
 
తే. నాత్మయంద కని యనామయత్వముఁ బొంది | ఖండరహిత మగు సుఖమున మునిఁగి
యుండువాఁడ? భూసురోత్తమ! చెప్పవే | యనిన నతని కిట్టు లనియె నతఁడు.
550
క. ఏనును నిట్టుల మోహా | ధీనుఁడ నై యాత్మఁగాంచు తెఱఁ గొలయుటకుం
బూని వడుదు, నెయ్యదియో! | కానం దెరు వా శుభప్రకలనంబునకున్‌.
551
ఉ. కొందఱు బ్రహ్మచర్యమునఁ గొందఱు భవ్యగృహస్థధర్మముం
బొందుటఁ గొంద ఱిద్ధ తపమున్‌ వనభూమిఁ దగం జరించుటం
గొందఱు నిష్క్రియత్వమునఁ గొందఱు యజ్ఞవిధాన శాలితం
గొంద ఱనూనదానములఁ గోరి యొనర్తురు నిత్యసౌఖ్యమున్‌.
552
క. జననీజనకారాధన | మున గురుభక్తిని సువృత్తమున శాంతిని దాం
తిని సత్యమున నహింసను | విను కాంతురు మోక్షపదము వేర్వేఱ జనుల్‌.
553
వ. అట్లు బహువిధంబు లగు ధర్మద్వారంబులు గలవు?; గలిగిన కలుచ నెల్లవారికి నాత్మానందం బలవడ నేర్చునే? యొకటి యుపదేశించెద నాకర్ణింపుము. 554
తే. నైమిశారణ్యమునయందు గోమతి యనఁ | బరఁగు నుత్తమనది, మహాపద్మ మనఁగఁ
గలదు పుణ్యహ్రదము దాని యలఘుతటత | లంబు నెలవుగానుండు నాగం బొకండు.
555
క. ఆ తీర్థోత్తమమున మాం | ధాతృఁడు లోనుగ విశిష్టతపముల నిహలో
కాతిశయముఁ బరలోక | ద్యోతనముం బడసినారు దొల్లి యనేకుల్‌.
556
వ. అప్పుణ్యక్షేత్రంబున. 557
తే. పద్ముఁడను పేరి యన్నాగపతి యుదాత్తుఁ | డఖిల ధర్మజ్ఞుఁ డతుల దయాన్వితుండు
సుజన సంభావ్యమానుఁ డస్తోకపుణ్య | నియత నిత్యుఁ డాగంతుకప్రియతముండు.
558
ఉ. ఆతనిఁ గానఁ బొమ్ము ప్రచురాదరణంబున నీదుకోర్కి సం
ప్రీతిగఁ దీర్చు నా గుణగరిష్ఠుఁడు నా పలుకూఁదు మన్న మో
దాతిశయంబు నొంది భృగుఁ డా ధరణీసురవర్యుతో మహా
త్మా! తెలివొందె నా మనము తావక పావన వాక్యసంపదన్‌.
559
క. అని పలికి యిట్లనియె ని | ద్దినశేషము రాత్రియును మదీయనివాసం
బున నిలువు నిలిచి మత్పా | వనుఁడవు గావలయు గౌరవశ్రీభరితా!
560
క. అనిన నతఁడట్ల చేయ న | తనిఁ బూజించుటను మధురతరసల్లాపం
బున ధర్మసత్కథావ | ర్తనమున నక్కాల మతఁ డుదాత్తతఁ గడపెన్‌.
561
క. వేగిన నామంత్రితుఁడై | యా గుణనిధి వీడుకొలిపి యతఁడు ప్రయాణో
ద్యోగంబు సమీచీనవి | ధా గరిమప్రౌఢవృత్తిఁ దగ నొనరించెన్‌.
562
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )