పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
భృగుం డను విప్రుండు పద్ముం డను సర్పరాజుం గనవచ్చుట (సం. 12-343-2)
వ. ఇవ్విధంబున నుద్యుక్తుండై భృగుండు బంధుమిత్రజన సమ్మతం బగు తెఱంగునం గదలి యెడనెడ బహుతీర్థసేవనంబు సేయుచుం జని పుణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి గోమతీతీరంబు సేరి, సుప్రసిద్ధం బగు మహాపద్మహ్రదంబు తటంబునం బొలుచు భుజగేంద్రమందిరంబు గాంచి తగం బ్రవేశించి నట్టియెడ. 563
తే. భక్తితోడ నన్నాగేంద్రుపత్ని యెదురు | వచ్చి తోడ్కొని చని యర్చలిచ్చి ‘మీర
లిందు రాకకుఁ గారణమేమి సెప్పుఁ | డెద్ది పనిచినఁ జేసెద నిద్ధచరిత!’
564
వ. అనుటయు నమ్మహీదేవుండు ‘దేవీ! భవదీయపతిం గాన వచ్చితి నెచ్చోనున్నవాఁ డవ్విభుం గానిపింపు’ మనిన నతని కా భుజంగాంగన యిట్లనియె. 565
క. ‘తనకు నెలవరుస వచ్చిన | నినరథ వహనమున కాతఁడేఁగినవాఁ డే
డెనిమిది దివసములకు నిట | సనుదెంచుం దథ్యమిది ప్రసాద ప్రవణా!
566
క. అతని తెఱంగిట్టిది వాం | ఛిత మెయ్యది యిత్తు ననఘ! చెప్పు’ మనుడు నా
సతి కిట్లను భృగుఁడు ‘భవ | త్పతిఁ గనుటయ కాక వాంఛ దక్కును గలదే?
567
వ. అయ్యురగవల్లభు వచ్చునంతకు నుల్ల వనంబున నిలిచెద; నవ్విభుండు వచ్చినప్పుడు మఱవక నా తెఱం గెఱింగింపవలయు’ నని పలికి పోయి భృగుండు గోమతీతట పుణ్యారణ్యంబున జప్యపరుండును నిరాహారుండునునై యుండె; నట్లుండ నా భుజంగపతి బాంధవులు దదీయ పత్నీపుత్ర సహితంబుగా నమ్మహీసురవరు పాలికిం జనుదెంచి మృదుమధురవాక్యంబుల ననునయించి ‘నీ వాహారంబుగొనక నిలువం దొడంగిన నాఁటికి నేఁ డాఱవదినం బయ్యె నే మతిథిపూజా పరులము మాకు ధర్మవిరోధంబు గాకుండ మా చేయు నాతిథ్యంబు నాదరింపు మస్మత్ప్రార్థనంబున నన్నంబు ఫలంబు మూలంబు మఱియు నెయ్యదియైనను భుజించి మమ్ము రక్షింపవే?’ యనిన వారలతో నా సువ్రతశీలుం డిట్లనియె. 568
ఉ. ‘ఇంతన నేల? యేను భుజగేశ్వరు రాకయ వార్చినాఁడ, నా
కం తవునంతకుం గుడువ నాఁకలి నీళ్ళు ద్రావఁ దృష్ణ యొ
క్కింతయు లేదు గా కలిగి యే యటవీస్థలి కేఁగుదెంచి యే
కాంతమ యున్నవాఁడ? నియమాభిరతున్‌ నను నేఁపనేటికిన్‌?
569
క. మీకును ధర్మవిరోధము | గాకుండుట కేన పూఁట గారవమున నా
లోకింపుఁ డింక దివసయు | గాకలనమునఁ గల్గ వ్రతసమాప్తియుఁ గలుగున్‌.
570
క. వినుఁ డష్టమమగు దివసం | బున ముదమారంగ నిందు భుజగేంద్రుఁడు రా
కునికి గలిగెనేనియుఁ బర | దినమునఁ గుడిచెద భవన్మతిం బ్రియ మెసఁగన్‌.
571
వ. మీర లిత్తెఱంగున కనుజ్ఞ సేయవలయు’ నని సంప్రార్థనీయస్వరంబునం బలికిన వారలందఱు నొడంబడి నిజనివాసంబులకుం జని రయ్యష్టమ దివసంబున. 572
క. వరుస దినంబులు దీఱిన | నరవిందాప్తుండు దనకు ననుమతి సేయం
గురువంశముఖ్య! తగ న | య్యురగాధీశుండు విభవమొప్పఁగ వచ్చెన్‌.
573
ఉ. వచ్చిన సంభ్రమంబు గరువంపు టెలర్పును నుల్లసిల్లి మే
నచ్చు పడంగఁ జేయఁ జెలు వా భుజగేశ్వరుపత్ని యాతనిం
జెచ్చెరఁ దా నెదుర్కొని విశిష్టసమాదరయై యుపాయనం
బిచ్చి తదీయచిత్తమునకిం పెసలారఁగఁ బాద్య మిచ్చినన్‌.
574
వ. సంప్రీతుండై సముచితప్రకారంబున నుండె నట్లున్న యన్నాగేంద్రుండు సమీపాసీనయైన యద్దేవి నాలోకించి. 575
తే. ‘అతివ! సేమమె? తగ దేవతాతిథి ప్ర | పూజనంబులు నడచునే? పూర్వవృత్తి
యెడలి యేను లేకునికి నేమేని వికల | మయ్యెనో? చెప్పు’ మనవుడు నా మృగాక్షి.
576
ఉ. ఆతనితోడ నిట్లనియె ‘నంత యెఱుంగమి రాదు నీదు శి
క్షాతిశయంబు గల్మి భుజగాధిప! నాకుఁ దగన్‌ సమస్తదే
వాతిథి పూజనంబులు సమగ్రములై నడచెన్‌ సుహృజ్జన
ప్రీతియు మున్నపోలె నవిభేదత యొప్పఁగ నిర్వహించితిన్‌.’
577
వ. అని వెండియు. 578
సీ. గురుభక్తి శిష్యులకును, వేదపరత వి | ప్రులకును, జనరక్ష భూపతులకు,
న్యాయార్జనంబు వైశ్యజనంబులకుఁ ద్రివ | ర్ణారాధనంబు శూద్రావళికిని,
బతివాక్య కరణంబు భటులకు, సర్వోప | కారక్షమంబైన సారభూత
మనఁగఁ బెంపొందు గృహస్థాశ్రమంబుపై | వారని ప్రియ మెల్లవారలకును,
 
తే. లోక మేల? యేనేల? యి ట్టేకతంబ | యింద్రియంబులఁ గుదియించి యిచ్చ నడఁచి
యుండువాఁడఁ గాకను మతి యోగికిని, బ | తివ్రతాత్వంబు భార్యకు సువ్రతములు.
579
వ. కావున ధర్మసూక్ష్మ సంవేది వగు నీదు చిత్తంబున భేదం బొక్కింతయేనియు దొడరునట్టి విధంబున వర్తింతునే? యొకండు విన్నపంబు సేయంగల దవధరింపుము. పరమపావనమూర్తి యొక్క మహీసురోత్తముం డిచ్చటికి వచ్చి యభ్యర్చితుండై భవత్పతి దర్శింప వచ్చితిననియెఁ గార్యంబేమి? యని యడిగిన నాకుం జెప్పకుండె; నేను నీ వట సనుటం జెప్పిన విని యట్లయిన నా భుజంగవిభుండు వచ్చునంతకు నుల్ల వనంబున నుండెద నతండు వచ్చిన నా తెఱం గెఱింగింపు మని చని యేడెనిమిది నాళ్ళేని జప్యపరుండును నిరాహారుండునై యున్నవాఁడు; నీ వచ్చటి కరిగి యతని సంభావింపవలయు నని చెప్పిన నా సర్ప గ్రామణి గుపితచిత్తుండై. 580
క. ‘ఏనటె! యొక్కెడ కొక్కొరుఁ | గానఁగఁ బోదు నటె! దేవగణము నసురులున్‌
లోనుగ నన్నే చందము | మానుగ నడపుదురు తలఁపుమా చతురమతీ!
581
తే. అనిన నీ రాక వార్చి మహాశతోడ | నున్న విప్రుని యభిలాష మొక్కభంగిఁ
దీర్పకుండుట ధర్మువే? ధీరశాంత | చిత్త! నీయట్టి యాచారవిత్తమునకు.
582
క. ధరణీసురు నాస సెఱిచినఁ | బొరసిన పాపాగ్నిఁ గాల్పఁ బూనెదవే? నీ
పురుషార్థంబును సముచిత | పరత్వమును గృపయు ధర్మపాండిత్యంబున్‌.
583
క. విను మాశావిచ్ఛేదన | మునఁ బాటిలు బ్రహ్మహత్య, భుజగోత్తమ! ధ
ర్మనిరూఢుఁడైన పురుషున | కును దద్ద్విజునాస దీర్పఁగోరుట వలదే?
584
క. మౌనమున దృఢజ్ఞానము | దానంబున నభ్యుదయము ధర్మనిరత! యా
శా నిర్వహణంబున నర | కానీక నిహరణ సౌఖ్య మగునండ్రు బుధుల్‌.
585
తే. చాతకము వానఁగోరెడు చందమొంద | నెదురుచూచుచు నున్నవాఁ డిందు నీదు
రాక కక్కట! యడవిలో బ్రాహ్మణుండు | రోష ముడుగుము ధర్మనిరూఢ హృదయ!’
586
వ. అని పత్ని బోధించిన. 587
చ. అనయముఁ దేఱి నాగపతి యక్కమలానన మోము సూచి యి
ట్లను ‘నొరుఁ గానఁ బొమ్మనిన యంతన రోషము వచ్చి యిట్టు లొ
ప్పని పలుకుల్‌ సగర్వమునఁ బల్కితి దానికి శంకలేక చె
ప్పిన జతనంపు ధర్మమునఁ బేర్మియు నాకు నొనర్చి తుగ్మలీ!
588
ఆ. కార్తవీర్య దశముఖ ప్రముఖులు జమ | దగ్ని తనయ రాఘవాదులైన
పురుషవరులచేతఁ బొలియరే సక్రోధ | వృత్తిఁ గాన యలుకవిడుపు మేలు.
589
క. నీయట్టి భార్య కలుగుటఁ | దోయజదళనయన! యిట్లు దొలఁగితి దురితా
పాయంబునఁ బొరయక, యేఁ | బోయెద నవ్విప్రు కోర్కి పూర్ణము సేయన్‌.
590
క. అని పలికి సత్వరంబుగఁ | జని భృగునిం గాంచె వినయసంభ్రమములతో
జనపాలోత్తమ! యతఁడు న | తనిఁగని యుల్లమునఁ బ్రియము దళుకొత్తంగన్‌.
591
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )