| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
విను మత్యాశ్చర్య మొకటి | మనుజోత్తమ! యొక్కనాఁడు మధ్యాహ్నమునం దన వెలుఁ గినుని వెలుఁగుతో | నెనగా గగనమున నొక్కఁ డేతెంచె వడిన్. |
604 |
| క. |
అంబరపాటనమునఁ బో | లెం బెద్దయు మెఱయు తనదు లీలాగతి క య్యంబరమణి యధికప్రమ | దంబున నభిముఖుఁడుగా నుదగ్రస్ఫూర్తిన్. |
605 |
| చ. |
కదియఁగఁ బాఱుతెంచిన వికాసవిభాసిముఖారవిందుఁడై యెదురుగఁ జేయి సాఁచె దివసేశుఁ డతండును లీలఁ గేలు నొ ప్పిదముగఁ బట్టి రూపము లభిన్నతఁ బొందఁగఁ జొచ్చె బింబమున్ సదనముఁ జొచ్చునట్ల విలసద్గతి నింకిట యేమి సెప్పుదున్? |
606 |
| వ. | అట్టియెడ. | 607 |
| చ. |
అరదముమీఁద మున్ పొలుచునాతఁడొ? యిప్పటియాతఁడో? దివా కరుఁ డను సందియంబు భుజగంబుల చిత్తము లందుఁ బుట్టి యొం డొరువులతోడ వారు గడు నొయ్యనఁ బల్కఁగ నే వినీతసు స్థిరమృదుభాషినై యడిగితిం బ్రభువున్ ధరణీసురోత్తమా! |
608 |
| క. |
ఇతఁ డెవ్వం?డని యమ్మెయి | నతిచకితాత్ముండ నగుచు నడుగుటయు నహః పతి నా మీఁదఁ గృపాసం | గతమగు తన చూడ్కి వొలయఁగా వత్సలుఁడై. |
609 |
| సీ. |
‘సురయక్ష గంధర్వ గరుడోరగాదుల | లోన నెవ్వఁడు గాఁ డలోలుపాత్ముఁ డుంఛవృత్తి మహీసురోత్తముం డస్ఖల | నియముండు ఫలమూల నీరమారు తాహారుఁడగు ముని యాకాంక్ష సేయఁడు | ప్రాప్తంబు గాని పదార్థములకు సర్వభూత హితత్వశాలి యిమ్మెయి సిద్ధిఁ | బ్రాపించె నని చెప్పెఁ బ్రకటఫణితి |
|
| తే. |
ననఘ! యిట్టి విశేషంబు గనుఁగొనంగ | వినను గాంచితి’ ననిన నవ్విప్రవరుఁడు ప్రమద మెద నిండి పొంగారఁ బాపఱేని | యాననము సూచి యిట్లను మానవేంద్ర! |
610 |
| క. |
‘ఇవి యన్నియు నాశ్చర్యము | లవుఁ దెరువును నాకుఁ జూపి తన్వర్థత నొ ప్పు వివిధ శబ్దంబుల బో | ధవరేణ్యా! పోయి వచ్చెదం బ్రియమొందన్. |
611 |
| క. |
నను మఱవక పనుపం దగు | పనులెల్లను బనుపు శిష్యభావశుభము నా కనఘా! కలిగెను నీ దెస | ననూనభద్రములు నీకు నయ్యెడు మెపుడున్.’ |
612 |
| చ. |
అన విని, నన్నుఁ గాంచితి ప్రయత్నమునన్, వినిపింపు మీవు వ చ్చిన పని నాకు, నీ కొకటి సేసితినే? యిటు వృక్షమూల వా సుని క్రియ లేచిపోక తగుచొ ప్పగునే? భవదీయవాంఛ సె ప్పిన నది యేను దీర్తు, మఱి పెం పెసఁగం జను భూసురోత్తమా!’ |
613 |
| వ. | అని వెండియు. | 614 |
| తే. |
‘అనఘ! నాయందు నీవు నీయందు నేనుఁ | గలము నీకు నీ సర్వలోకంబుఁ గలదు చింత కవకాశ మెద్ది? నిశ్చింతభావ | మొందు’ మనియె నా దందశూకోత్తముండు. |
615 |
| వ. | అనిన విని భృగుండు పద్మునకి ట్లనియె. | 616 |
| తే. |
‘భోగివర! యిది యిట్టిద భూతములును | నీవు నేనును సర్వగతావిశిష్ట విధములము వేదితవ్యంబు విదితమయ్యె | నిట్టి సందర్శనము వ్రతమింక నాకు. |
617 |
| క. |
ఈ విధము నిశ్చయము నే | భావింపఁగఁ గంటి నీ కృపారతివలనన్ నీవు కృతార్థుఁడవు సుజన | సేవిత! యామంత్రణంబు సేసినవాఁడన్.’ |
618 |
| వ. | అని పలికి యివ్విధంబునఁ గృతనిశ్చయుండై భృగుండు భుజంగవిభు వీడ్కొని దీక్షావిశేషకాంక్షం జేసి భార్గవకుల పవిత్రుం జ్యవనుం గాంచి నిజవృత్తాంతంబు సెప్పి తత్కృతసంస్కారంబునం గృతకృత్యుం డయ్యె; నిప్పుణ్యకథ యబ్భార్గవుండు జనకసదనంబున నారదునకు వివరించె; నద్దేవమునివరుండు దేవతావరునకు వినిపించె నమ్మహాత్ముండు వసువులకుం జెప్పె జామదగ్న్యు తోడి సంగ్రామంబున నుద్దామచిత్తుండనైన నన్నుం దేర్చుటకై వసువులు సకలభూత సమదర్శిత్వ సంపాదకంబైన యీ యితిహాసంబు నాకుం జెప్పిరి. నీవు పరమధర్మం బెయ్యది? యని యడిగిన నేను నీకుం జెప్పితి సర్వసమతాసముపహితంబైన యనాకాంక్షిత్వంబు ధర్మోత్తమంబు నిరతిశయానందంబునకు నిధానంబు.’ | 619 |
| క. |
అని యిట్లు ధర్మసుతునకు | ననిమిషతటినీతనూజుఁ డధికప్రేమం బునఁ బెప్పుట వైశంపా | యనుఁడును జనమేజయునకు నర్థిం జెప్పెన్. |
620 |
| వ. | చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనుతో నిత్తెఱంగునఁ బితామహుండు హితోపదేశంబు సేసిన నమ్మహీశుం డెవ్విధంబు దశావిశేషంబు నొందె మునీంద్రా! చెప్పవే’ యనుటయు. | 621 |