పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
కురుపాండవుల పదునెనిమిదవనాఁటి యుద్ధప్రారంభము (సం. 9-7-43)
వ. ఇట్లు పూర్వసంధ్యాసమయంబునఁ దార్కొని భేరీప్రముఖ తూర్య నిస్వనంబులు నింగి వొంగం జెలంగ. 117
క. ఒండొంటిఁ దాఁకి హేతులు | మండఁగఁ దచ్చూర్ణతతులు మహి రాలఁగ ను
ద్దండతఁ గలయం బెరసెను | రెండు మొనలుఁ గ్రూరతరపరిస్ఫురణములై.
118
వ. ఇత్తెఱంగునఁ దలపడి. 119
క. అరదంబులు నరదంబులఁ | గరులు గరుల హరులు హరులఁ గాల్వురు మఱి గా
ల్వురఁ దాఁకి పెనఁగెఁ గడు భీ | కర భంగులు మెచ్చు దేర గగనచరులకున్‌.
120
చ. పెనుపును నాకసం బవియు బృంహితముల్‌ దము నుగ్రగర్జిత
స్వనములతోడి మేఘముల చందముగా నొనరింప మీఁది యో
ధనికర మేయు సాయకవితానము భీషణవృష్ణి గా రయం
బునఁ బయికొన్న యేనుఁగుల పోరునఁ దేరులు దేలె నెత్తుటన్‌.
121
తే. కరులగమి వొదివి రథముల్‌ గాలుకొనఁగ | నీక మరలిన ఘోటకానీకములను
బిరుదుమగల మొత్తములను బిండిపీఁచు | సేయు బలితంపునేర్పు లచ్చెరువుఁ బెనుఁ ప.
122
క. పటురయమున నాశ్వికు లొ | క్కటఁ బెక్కం డ్రెక్కి రథనికరములు ఝడితి
త్రుటితాకృతులుగ విహరిం | చుట యెక్కుడు వేడ్కసేయ సురగణమునకున్‌.
123
క. పలువుర నొక్కఁడు నొక్కనిఁ | బలువురుఁ దెగటార్చుటయును బలుదెఱఁగుల మూఁ
కలు పలుదెఱఁగులఁ దలఁపడి | పొలియించుట పొలియుటయును బొరి నుగ్రముగన్‌.
124
క. చలమునఁ బోక పెనఁగు కా | ల్బలముపయిఁ దురగములును నిభంబులును రథం
బులుఁ గూడి కవిసి యింతిం | తలు దునియలు సేఁత యనుచిత క్రౌర్యముగాన్‌.
125
క. తెల్లని సవరణ మెఱయ స | ముల్లసితములగు తురంగముల మొత్తము చం
చల్లలిత పక్షములు శో | భిల్లుగతుల నొప్పునంచపిండుం బోలన్‌.
126
వ. అయ్యిరువాఁగును పోరాడునప్పుడు. 127
క. గుణనినదము రథనేమి | క్వణనంబుం దురగఖురరవముఁ గరిఘంటా
రణనమును హేతి సంఘ | ర్షణనాదముఁ దూర్యఘోష సంపదఁ గడచెన్‌.
128
సీ. నెత్తుటఁ దోఁగియు నిగిడి పోరెడు వీరు | లలరిన నడ మోదుగులవిధంబు
గ్రక్కునఁ దెగిపడి కదలెడు బాహు దం | డములు మహాభుజంగములభంగి
యవని రక్తాక్తంబులై యున్న యట్టిబల్‌ | దలలు గెందామరకొలని పగిది
దఱచుగా నెఱి దప్ప నొఱగిన గజములు | గులిశభగ్నాచలకులమునట్లు
 
తే. దునిసి తొఱఁగిన జోదులతొడలు సామ | జములకరములు నొండొంటి చందములు గ
నుంగొనఁగ వింతలగుటను సంగరాంగ | ణంబు రమణీయమును భీషణంబు నయ్యె.
129
తే. ఏమి చెప్పుదు రౌద్రంపు టెసకమందుఁ | దఱచు మెదళులు ఱొంపులు నుఱుములైన
యెమ్ము లిసుకయు సితచామరమ్ము లంచ | లయ్యె రుధిరంపు టేరుల కప్పుడధిప!
130
క. విను మయ్యేఱులలో వా | హనములె యోడలుగఁ జూడ నక్కజమగు ను
క్కున నుద్దామ విహారం | బొనరించిరి వీరయోధు లుర్వీనాథా!
131
వ. ఇవ్విధంబునం బోరు ఘోరంబై చెల్లుచుండ నుల్లసిత విక్రమవిజృంభితులగు భీమపార్థులు నలిరేఁగి నారాచప్రముఖ నానావిశిఖంబుల మనమొనఁ గనుపుగొట్టిన నది బెగడొంది మగిడిన నమ్మేటి మగలుబ్బి పౌండ్రదేవదత్తంబుల నొత్తుటయు ధృష్టద్యుమ్నుండును శిఖండియుం గౌంతేయాగ్రజు మున్నిడికొని తఱుమఁ దోడన కవలును గడంగి రట్లాటోపదీపితులైన పాండవే యుల యురవడికి నోటఱి నీబలంబు హాహాకారంబు లతోఁ బలుదెసలఁ బఱవందొడంగినం గనుంగొని శల్యుండు సారథి కిట్లనియె. 132
ఉ. ‘అల్లదె కంటె? పాండుతనయాగ్రణితేరు సితాశ్వయుక్తమై
తెల్లని యెల్లి నొప్పినది తీవ్రత మార్కొని యానృపాలు శో
భిల్లుట మాన్పఁగా వలయు భీషణభంగి రథంబు వోవ ని
మ్మెల్లజనంబు నా కడిమి యేర్పడ నేఁ డెఱుఁగంగఁ జేసెదన్‌.
133
తే. సురల నైన గెలుతు దురమున విను నాకుఁ | బాండుపుత్రు లెదురె భండనమున?
నేర్పు బలుపుఁ జూపి నిన్ను మెప్పింతు నా | చేతిబరువు సూడు సూతవర్య!
134
వ. అనుటయు వాఁడు పాండవబలంబుల కెదురుగా నరదంబు సముచితరయంబున నడప నమ్మద్రపతి సముద్ర సముద్రేకంబు చందంబైన యా సైన్యంబు సరభసత్వంబు చెలియలికట్టయుంబోలి యుడుపుట యచ్చెరువై యుండె నట్లు శౌర్యధైర్యంబుల నుల్లసిల్లు శల్యుం జూచి మనమూఁకలును మగుడ నిగిడిన సంగ్రామంబు భీమంబయ్యె నందు నకులుండును గర్ణపుత్రుండగు చిత్రసేనుండును దలపడి యొండొరువులకుఁ గృతాస్త్రత్వంబును సమరవిశారదత్వంబును జూపుచుం బెనంగునెడ నా సూతపౌత్రుండు. 135
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )