పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
కర్ణుకొడుకులు చిత్రసేన సత్యసేన సుశర్ములు నకులునిచేతఁ జచ్చుట (సం. 9-9-12)
చ. నకులుని చాపదండము ఘనప్రదరంబునఁ దున్మి, భాస్వరాం
బకములు మూఁడు దీవ్రగతి ఫాలతలంబున నాటి త్రుంచె ఘో
టకములఁ గేతనం బిలఁ బడన్‌ విదళించి వధించె సూతు ఖే
టకమును ఖడ్గముం గొని కడఁగఁ బయిం బరఁగించె భల్లముల్‌.
136
క. ఆ నిశితభల్లములు దన | మేనికి రాకుండఁ బలుక మెఱయ జడియుచున్‌
వే నిగిడి కదిసె మాద్రీ | సూనుం డా సూతసూతిసూను నరదమున్‌.
137
తే. కదిసి మీఁదికి లంఘించి మదమెలర్ప | గళముఁ దునిమిన నమ్మస్తకంబు డొల్లెఁ
గర్ణపూరకిరీటసంకలిత వివిధ | రత్నరోచులు మెఱయ ధరాతలమున.
138
వ. ఇట్లు చిత్రసేనుండు వడినం గనుంగొని కౌంతేయసైనికు లార్చినం బేర్చిన శోకరోషంబుల మనంబుల ముప్పిరిగొన వాని సోదరులు సత్యసేనుండును - సుశర్ముండును నప్పాండుపుత్రుపైఁ గవిసిన నతండు వేఱొక్క-తేరెక్కి బలు విల్లెత్తి దండధర ప్రచండమూర్తియై మార్కొనిన నబ్బిరుదుమగ లయ్యరదంబు భల్లంబుల నఱకం దొడంగిన నుఱక చిఱునవ్వు నవ్వి. 139
చ. కడువడి సత్యసేను తురగంబులఁ గూల్చి శరాసనంబుఁ జ
క్కడిచిన నొండుతేరికి రయంబు మెయిం జని యన్యచాప మె
క్కిడుటయు నక్కుమారు నిశితేషుయుగంబున నొంచి నొంచెఁ గ
వ్వడియనుజన్ముఁ డుగ్రుఁ డయి వాని సహోదరు రెండు తూపులన్‌.
140
తే. అతని ధను వా సుశర్ముఁ డుద్ధతి దలిర్పఁ | ద్రుంచుటయు నొండువింట బల్‌దూపు లొడలఁ
బఱపి వాని సిడంబున నఱకి సత్య | సేను విలు ద్రుంచె నా పాండుసూనుఁ డధిప!
141
శా. ఆ రాధేయతనూజుఁ డన్యధను వుగ్రాకారుఁడై యెత్తి దు
ర్వారప్రక్రియ నేసె నావిశిఖముల్‌ వారించి యాతం డతి
క్రూరస్ఫారశరత్రయం బతని వక్షోభిత్తిఁ గీలించి వే
నారాచంబులు రెండు దమ్మునిమెయిన్‌ నాటెం గడున్‌ బెట్టుగన్‌.
142
క. వా రలిగి యొక్కయుమ్మడి | సారథిఁ దెగటార్చి యార్చి చాపము దునియం
దేరు వికలముగ మేను వి | దారితముగ నేసి రత్యుదగ్రస్ఫురణన్‌.
143
వ. ఇవ్విధంబున. 144
మ. విరథుండున్‌ వినికృత్తచాపుఁడు శరావిద్ధుండునై మేదినీ
వర నీపుత్రుఁడు చంచదుగ్రతర జిహ్వం బైన చండాహి నాఁ
గర మాభీలతఁ బొల్చుశక్తిఁ గొని యల్కన్‌ సత్వరుండయ్యె సు
స్థిరసంరంభత సత్యసేనుఁ బడవైచెం జూప ఱగ్గింపఁగన్‌.
145
ఆ. అన్నపాటు సూచి యనుజుఁ డుల్లంబున | నడలు కనలుఁ గదుర నంపవానఁ
గప్పె నకులు నంతఁ గాంచి భీముకుమారుఁ | డెయిదె నతనియరద మెక్కె నతఁడు.
146
వ. ఇట్లు ద్రౌపదేయుండగు శ్రుతసోముని యరదంబెక్కి బలువిల్లుగొని యక్కుమారుండును దోడుపడ నా సుశర్ముని బటుశరపరంపరలం బొదివినఁ బొలివోక యతండు. 147
తే. వాఁడి తూపులు నకులుమై మూఁడు నాఁటి | యిరువదింటఁ దత్పుత్రుని యురము నొంప
నర్ధచంద్రబాణాహతి నవ్విరోధి | శిరము దునిమె నప్పాండుభూవరసుతుండు.
148
శా. మాద్రీపుత్రునిచేతఁ గర్ణసుతు లీమాడ్కిం బడం జూచి వీ
రోద్రేకం బెడలంగ నీ సుతుబలం బొక్కుమ్మడిన్‌ విచ్చిన
న్మద్రాధీశుఁడు సింహనాదము రణన్మౌర్వీసముల్లాసమున్‌
రౌద్రప్రక్రమసూచకంబులుగ సంరంభస్ఫురస్మూర్తియై.
149
తే. హస్తతల మెత్తి నిలునిలుమని యదల్పఁ | బోకతిరిగి యమ్మూఁకలు పోరి కమరెఁ
బాండవేయుల మొనలు నుద్దండవృత్తి | నురవణించిన సంగర ముగ్రమయ్యె.
150
చ. అడరి ధనంజయాదులగు నక్కడి వీరులు విక్రమింప ని
క్కడ భవదీయనందనముఖప్రభవోద్భట యోధవర్గము
ల్వడిఁ దఱుమంగ నప్పుడు బలద్వయమున్‌ విశిఖాగ్ని పేర్చి యె
క్కుడయిన భీతి నొందె రణఘోరత భూవర! యేమి సెప్పుదున్‌?
151
వ. ఇట్లు మథితంబయ్యును బౌరుషంబు పెంపున నిరువాఁగును వేగంబు గుందక వింత చందంబునం బేర్చుక్రందు గగనచరులకుఁ గన్నులపండువుగా బృంహితధ్వనులను ఘంటానినదంబులను నేమినిస్వనంబులను గేతుకింకిణీక్వణనంబులను రింఖారవంబులను హేషాఘోషంబులను భుజస్ఫాలనంబులను సింహనాదంబులను దిక్తటభేదనం బొనర్ప నద్భుతోత్సాహంబున నాహవక్రీడ సలుపుచుండఁ బుండరీకాక్ష రక్షితులగు పాండుపుత్రుల బలశౌర్యసంపదల సొంపునం బెంపొదవు ధృష్టద్యుమ్న శిఖండిసాత్యకి ప్రముఖులైన దండిమగలు గూడికొని తఱుమ దారుణనైపుణంబున బాహాటోపంబు సూపినఁ గార్చిచ్చు గవిసినం గలంగు మృగకులంబు కైవడిం గౌరవసైన్యంబు దైన్యంబు నొందిన. 152
క. పెనురొంపి లోపలను బ్రుం | గిన ధేనువు నెత్తుపోలికిని శల్యుం డ
మ్మొనఁ దనభుజబలమునఁ గలఁ | గని యట్టుగ నిలిపె శౌర్యగర్వము మెఱయన్‌.
153
వ. నిలిపి పేర్చిన సమయంబున మన దిక్కున నుల్కాపాత ప్రముఖంబులగు దుర్నిమిత్తంబులు వొడమిన నీ కొడుకులు గూడుకొని చేయం గలసైనికులం గూర్చికొని తిరంబయి పెనంగి రట్లు పెనంగునెడఁ గడంగి తలకడచి మిగిలి మద్రపతి మార్గణాసారంబు వరఁగించుచుఁబాండవాగ్రజు నగ్రభాగంబున నున్న భీమసేన సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయమాద్రేయులఁ దాఁకి పదిపదిప్రదరంబుల నొప్పించి కదిసి యన్నరపతికిని బదితూపుల వేఁడిమి సూపి మలసినఁ బాంచాలప్రభద్రకబలంబు లా జెట్టిబిరుదు చుట్టుముట్టిన. 154
ఉ. వాలి యతండు బాహువిభవం బలరించినఁ బేర్చి రౌద్రతం
గూలుగజంబులుం గెడయు గుఱ్ఱపుతండముఁ ద్రెళ్ళు తేరులుం
గీలెడలించినట్ల పడుకేతువితానము నుగ్గునూచమై
రాలు పదాతి వర్గములు రక్తపుటేఱులుఁ బ్రేవుప్రోవులున్‌.
155
వ. మఱియును. 156
క. ఏ రూపులయిన రూపఱ | ఘోరాశనులట్ల శల్యు క్రూరాస్త్రంబుల్‌
కౌరవులు వొంగఁ బాండుకు | మారులసేనపయిఁ దొరిఁగె మనుజాధీశా!
157
వ. అట్లు దొరుఁగు దారుణమార్గణాసారంబున వెగడుపడి యాబలంబు పాండవాగ్రజు వెనుక కొదిఁగిన నమ్మహీపతి పురికొలిపికొని శల్యు మార్కొని నిశితవిశిఖవర్షంబునం బొదివిన నమ్మద్రవిభుండు గ్రూరనారాచం బతనిమేనుచ్చివో నేయ నా ధర్మనందనునకుఁ దలకడచి యేడమ్ముల నవ్వడముడియు సహదేవుం డయిదు తూపులను నకులుండు నవశరంబులను బ్రతివింధ్యాదిద్రౌపదేయులు బహుబాణపరంపరలను నవ్వీరు నేయ నప్పుడు కృపాచార్యుండును గృతవర్మయు శకునియుఁ దత్సుతుం డులూకుండును నీ కొడుకులుం గవిసిరి. గురుపుత్రుండు మందహాసంబుతో నమందగతి వచ్చి వారిఁ గూడికొనియె. నక్కడి సైనికులును రభసంబున నా రథికవరులఁ దాఁకి రట్టియెడ. 158
క. కృపుఁడును ధృష్టద్యుమ్నుఁడు | నుపమాతీతాతిఘోరయుద్ధంబున బా
హుపటుత్వమ్ములు సూపి ర | ధిప! యొండొరులకు సమత్వదీప్తాకృతులై.
159
క. ఒకని నొకనిఁ బదిపది సా | యకముల నొప్పించె వీరులగు పాండుకుమా
రకు లేవుర నంతట ద్రో | ణ కుమారుఁడు మోము చిఱుతనగవున నొప్పన్‌.
160
ఆ. వాయుతనయు ఋశ్యవర్ణాశ్వముల మద్ర | పతి ధరిత్రిఁ గూల్చె నతఁడు దేరు
డిగ్గి నిజగదాపటిష్ఠతఁ జూపెఁ గౌ | రవ్య సైన్యమునకు రాజముఖ్య!
161
క. అనిలజుని యశ్వములఁ గూ | ల్చిన యప్పుడు శల్యునిం గలితనము మెఱయం
దన యంపవెల్లిచే ముం | చె నకులుతమ్ముండు నీదుసేన దలంకన్‌.
162
తే. అతని హయములు నమ్మద్రపతి శరములఁ | బడిన నప్పాండవునిఁ దలకడచి బలము
పొదివె నయ్యోధముఖ్యుఁ దత్పుత్రుఁ డపుడు | గదిసె నా సహదేవుపైఁ గడిమి మెఱయ.
163
చ. కవిసిన దట్టకెంపడరు కన్నులతోడఁ గృపాణపాణియై
యవనికి దాఁటి యాతనిశరావలిఁ ద్రుంచుచుఁ గిట్టి తేరిపై
కి వడిఁ జలంబుమై నరిగి కేళియపోలె శిరంబు ద్రుంచి పో
యె వెసఁ బొగడ్తకెక్క ధరణీశ్వర! యొండురథంబు మీఁదికిన్‌.
164
వ. ఇవ్విధంబున. 165
క. సుతుఁ డీల్గిన మద్రమహీ | పతి శోకక్రోధవేగభరితాత్మకుఁడై
శితశరపంపరల ను | ద్ధతిఁ బాండవసైనికుల మదం బడఁగించెన్‌.
166
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )