పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు శల్యునిబాణంబులచేత మూర్ఛితుం డగుట (సం. 9-11-66)
క. కోపించి యతఁడు దర్పా | టోపం బుగ్రముగ దశపటుప్రదరము లా
భూపాలు మేనఁ జొనిపిన | భూపాలక! యాతఁడొల్లఁ బోవుటయు వెసన్‌.
199
క. శైనేయుఁ డడరి యుజ్జ్వల | నానావిశిఖముల మద్రనరపతిఁ బొదువం
దా నలిగి విల్లు దునియలు | గా నొక భల్లమున నేసె గర్వోద్ధతుఁడై.
200
క. ఆ రథికవరుని నకులుని | మారుతి సహదేవు మూఁడు మార్గణముల నే
పారఁగ బలుపారఁగ రయ | మారఁగ నొప్పించె నమ్మహాభుజుఁడధిపా!
201
వ. అంతం దెలిసి యక్కౌంతేయాగ్రజుండు మద్రపతిని ముద్గరంబున నేయ నవ్విరోధిపై సాత్యకి దోమరంబును వృకోదరుండు భల్లంబును నకులుండు శక్తియు సహదేవుండు గదయును బ్రయోగించిన నయ్యోధవరుండు వాని నన్నింటిని మింట మెఱుంగు లడర వెడఁద యమ్ములు వరఁగించి త్రుంచి యార్చినం బేర్చిన రోషంబున నా కృష్ణానుజుండు సారథి మూఁడు వాఁడితూపుల నవ్విరోధి రెండు బాణంబుల బెట్టేసినఁ గ్రోధదీప్తుండై యా శల్యుఁడు ప్రచండకాండంబుల నయ్యేవురను స్రుక్కించిన జూచి నీ పుత్రుం డతనిచేతఁ బాండుపుత్రులు పొలియుదు రని తలంచె నట్లు భాసమానుండైన సేనాపతిం గని భీమసేనుండు సహింపక తెంపున బెట్టు గిట్టిన. 202
క. శిని మనుమఁడు గవలును దో | డన యురవడి నడరి పొదువుటయు నగ్గలికం
బెనఁగె నతం డా నలువుర | కనలుఁ గడంకయును సరకు గాఁ గొన కధిపా!
203
వ. ఇట్లు పెనంగుచుండఁ బాండవాగ్రజుండు మున్ను దనచేతఁ జచ్చిన చంద్రసేనుతోడివాని ద్యుమత్సేనుఁ దల ద్రెవ్వ నేసిన జక్రరక్షకహీనుం డయ్యును బొలివోవని కనలున శల్యుండు సటలు వెఱికినం గోపించు సింగంబుచందంబై సమీరణసుతాదులగు జోదుల నలువురయంగంబులఁ దురంగనికరశరీర సారథినికాయసహితంబుగా బహువిధవిశిఖంబులు వరఁగించి నెత్తురులు దొరఁగించినం గని యా ధర్మనందనుండు విషాదంబు నొంది నిజాంతర్గతంబున. 204
క. ‘హరి వచనంబు లసత్యతఁ | బొరయఁగ నేర్చునొకొ! మద్రభూపతి బాహు
స్ఫురణము భీమాదిరథిక | వరు లోర్వని యట్లుగాఁగ వ్రాలెడిఁ దోడ్తోన్‌.’
205
వ. అని తలపోసి తన బలంబునకుఁ జేయి వీచినఁ దోయధివీచివితానవిలాసంబుచందంబునఁ జతురంగబలంబులు శల్యునిపైఁ గవిసిన నా ధైర్య ధౌరేయుండు మందరనగంబులీలఁ గైకొని వారలం గలంచి పాంచాలపుత్ర ప్రభృతియోధప్రకరంబులను బాండవాగ్రజునిం బరమ సాంద్రతీవ్రశరాంధకారంబునఁ గప్పి సింహనాదంబు చేసిన. 206
క. దివిజగరుడఖచరాదులు | వివిధవచనరచన లెసఁగ వినుతించిరి శా
త్రవ భీకరుఁడగు నమ్మద్రవిభుని రణవిహరణములు ధరణీనాథా!
207
వ. ఆ సమయంబున. 208
తే. గురుసుతుఁడు పెనుబ్రాపుగా నరునిఁ బొదివి | యధిప! సంశప్తకులు వివిధా స్త్రతతులఁ
గప్పి రతఁ డందఱను జండకాండవిదళి | తాంగులుగఁ జేసె దోర్లీల యతిశయిల్ల.
209
చ. తెరలక వారు పైపయి నుదీర్ణసముద్ధతిఁ గ్రమ్మి వాజులన్‌
హరిని సిడంబుపైఁ గదియ నాతఁడు సేడ్పడ బాణవర్షముం
గురిసిరి కౌరవేంద్రుమొనకుం బ్రమదంబగు ఘోరభంగి న
ప్పరుషపరాక్రమస్ఫురణ పార్థివసత్తమ! కాన మెయ్యెడన్‌.
210
వ. ఇట్లు సవ్యసాచికిఁ జేయార్ప రాకుండ దర్పంబు సూపిన నా భూవరకుమారవర్యుండు వీరాగ్రహావేశంబున విజృంభించి భల్లార్ధచంద్రక్షురికాముఖనారాచప్రముఖవిశిఖపరంపరలు వరఁగింప నవి యా సైనికుల రథ్యంబులం గూల్చియుఁ గేతనంబులు ద్రుంచియు బాణంబులు నఱకియు బాణాసనంబులు విఱిచియు సూతుల గీటడంచియు నరదంబులఁ జెక్కియు మైమఱువులు పొళ్లుసేసియుఁ జామరంబులు దునిమియు నాతపత్రంబులు రూపుమాపియు నెత్తురు లురలించియుఁ గండలు దొరఁగించియు నెమ్ములు వగిలించియుఁ గాళ్ళు ద్రుంచియుఁ జేతులు దునిమియు వ్రయ్యలుగా వక్షంబులు సీఱియు మర్మంబులఁ జొచ్చియు మకుటంబులు డుల్చియుఁ దలలు రాల్చియుఁ బ్రాణంబులు పీల్చియు రౌద్రం బావహించిన లయకాలరుద్రుని సంక్రీడనంబు చందంబు దోఁచెనప్పుడు రథికవరసహస్ర ద్వితయంబు దెగటారె నవ్వాఁడిమగండు పేరడవి దహించు దావపావకుని చందంబున వెలింగెఁ దదీయతేజోమహిమ సహింపక యుద్దామగతి నశ్వత్థామ గదిసి యక్కవ్వడిం దొడరి దురం బొనర్చె నందు. 211
సీ. అతఁడు పండ్రెండు వాలమ్ము లాబీభత్సు | మెయిఁ, గ్రుచ్చి కృష్ణుని మేనియందుఁ
బది వాఁడితూపులు వఱపిన మదిలోన | నగ్గించి యవ్వీరుఁ డలఁతినగవు
తోడ రథ్యముల సూతునిఁ గూల్చి యాతని | తనువున నెఱ తెగగొనక నాటె
మూఁడు మార్గణములు ముసలంబు పరిఘంబు | నాతఁడు నిగిడింప నదియు నదియు
 
తే. నన్నరుఁడు దోడుతోడ నైదాఱునిశిత | కాండములఁ ద్రుంచి పటుసాయకత్రయంబు
సొనిపె నవ్విప్రు మేన మార్కొనియె నపుడు | గడఁగి యప్పార్థు సంశప్తకవ్రజంబు.
212
వ. ఇత్తెఱంగున. 213
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )