పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
సురథుఁడను పాంచాలకుమారుం డశ్వత్థామచేఁ జచ్చుట (సం. 9-13-35)
క. సురథుఁడు గురుసుతుపైఁ దన | యరదము వఱపించి యేయ నప్పాంచాలో
త్తరు నొక నారసమునకును | నెర సేసె నతండు గినుక యెసకం బెసఁగన్‌.
214
వ. ఇత్తెఱంగున. 215
ఆ. సురథుఁ గూల్చి యతనియరదంబు పైకి ను | ద్ధురత నరిగి గురుసుతుండు చండ
కాండసమితి నిగుడ గాండీవిఁ దాఁకి సం | శప్తకులకు సంతసం బొనర్చె.
216
వ. అయ్యవసరంబున 217
క. కురుపతి ధృష్టద్యుమ్నుని | యురవడిఁ దగ నిలువరించి యుద్ధతి మెఱయన్‌
శరపంచకమున నొంచెను | బరఁగించెను మఱియు సప్తబాణము లొడలన్‌.
218
తే. అతఁడు డెబ్బది యమ్ముల నతని నొంప | నన్నరేంద్రుండుఁ జేడ్పడ ననుజసమితి
బలయుతంబుగ నడరి యబ్బలియు మీఁదఁ | గురిసి రస్త్రశస్త్రంబులు నరవరేణ్య!
219
క. ఆ పాంచాలోత్తముఁ డు | ద్దీపిత కోపుఁడయి వారిఁ దీవ్రతరశరా
టోపంబునఁ గలఁచె రయం | బేపారఁగ నాత్మసేన కేడ్తెఱ మెఱయన్‌.
220
చ. కృప కృతవర్మలం గడిమిఁ గిట్టి శిఖండిప్రభద్రకుల్‌ మహో
గ్రపువడి దోడ్పడంగ భుజగర్వము సూపిన నా బలాఢ్యులుం
గుపితమనస్కులై బలుపుఁ గోల్తలఁ బేర్చినలావు చేవ క
య్యపువెర వేపు దాల్మి సరి నచ్చెరుపాటున ముంచెఁ జూపఱన్‌.
221
వ. అప్పుడు శల్యుండు యుధిష్ఠిరభీమసేననకులసహదేవసాత్యకులపైఁ బటుబాణంబులు గుప్పించి నొప్పించిన. 222
క. నకులుఁడు రభసంబున సా | యకదశక మతని యురంబునందుఁ జొనుప స
భ్రుకుటి యగుచు నయ్యల్లునిఁ | ద్రికాండముల నొంచి యతఁడు దీపించె నృపా!
223
క. తక్కటినలువురు వొదివిన | నొక్కొకనిశరీరమున మహోగ్రాస్త్రంబుల్‌
పెక్కులు వెసఁ బఱపి మదం | బెక్కి నకులుధనువు దునిమె నిషుసహితముగన్‌.
224
వ. ఇట్లు శల్యుండు విజృంభించినఁ గోపించి. 225
మ. నకులుం డొండొక చాప మెత్తి పటుబాణశ్రేణిఁ బర్వింపఁ గీ
చకవిధ్వంసి నిగిడ్చె షష్టిశరముల్‌ శైనేయుఁ డుద్దీప్త సా
యకముల్‌ దొమ్మిది యేయ ధర్మసుతుఁ డీరైదమ్ము లమ్మద్రనా
యకుపై నన్నియుఁ బిన్నతమ్ముఁడును దోడై నాట నాటెం గడున్‌.
226
తే. అతఁడు వెస నవసప్తతి శితశిలీము | ఖముల సాత్యకి నొంచి మార్గణముతోడ
ధనువు ద్రుంచి రథ్యమ్ముల ధరణిఁ గూల్చి | పదిపదుల్‌ బలుఁదూపులు వఱపె మేన.
227
క. ఇవ్విధమున శినివీరుని | క్రొవ్వు చెఱిచి పాండుపుత్రకుల బాణంబుల్‌
నివ్వటిలనీక నలువుర | నవ్వీరుఁడు నొవ్వ నేసె నద్భుతభంగిన్‌.
228
ఉ. పాండవు లట్లు మద్రపతి బాణములం దెరలంగఁ జూచి తా
నొండొక తేరికిం జని సముద్ధతి సాత్యకి దాఁకె నాతనిం
జండతరప్రచారణవిశారదుఁడై వెస వారు గూడి యు
ద్దండత సూపి రక్కజపుదర్ప మెలర్పఁ బెనంగె నాతఁడున్‌.
229
ఉ. ఏవురతోడ న ట్లొకఁడ యేచి పెనంగుటఁ గౌరవేంద్రయో
ధావళి చూచి కూడికొని యారథికోత్తముగాఢ విక్రమ
శ్రీవిలసిల్ల నంపపెనుఁజీఁకటి యాకసమెల్లఁ గప్పఁగాఁ
జేవయు లావుఁ జూపుటయుఁ జేడ్పడి రా ప్రతివీరులందఱున్‌.
230
వ. సేనయు నొక్కుమ్మడి నద్దిక్కు దఱిమినం గని కృష్ణార్జునులు నిజసైన్యంబు సమస్తంబు నేకముఖంబు సేసి మార్కొని రా సమయంబునఁ గిరీటి కృపకృతవర్మలను సహదేవుండు సౌబలుని ద్రౌపదేయులు గొందఱు రాజులను శిఖండి యశ్వత్థామను భీమసేనుండు సుయోధనునిఁ దాఁకఁ బాండవాగ్రజుండు దనకు నకులుండు బాసటగా శల్యు నిలువరించెఁ దక్కునుం గల యోధులుం దక్కటిసైనికులుం దలపడి క్రమంబున నెల్ల బలంబులును గలయం బెరసె నిట్లు నూల్కొని యంతకంతకు రణంబు సమ్మర్దదారుణం బయ్యె నత్తఱి నమ్మద్రపతి రౌద్రంబు రూపుదాల్చిన తెఱంగునం బొంగి పాంచాలయాదవాది రథికవరులకును బాండు కుమారులకును వారింపఁ గొలఁదిగాక రథ చిత్రగతుల మెఱయ నెక్కడఁ జూచినం దానయై నానావిధవిశిఖ వితానంబుల(నింపి) నంబర భాగంబు సంపిహితంబు సేసిన మధ్యందినగతం బయ్యును మార్తాండబింబంబు దోఁపక యుండె నట్టియెడ. 231
సీ. కరులఁ ద్రుంచెడువేళ గిరులఁ దున్మాడు సం | క్రందను కైవడిఁ గానవచ్చు
నరదముల్‌ దెరలించునప్పుడు పఱమొగుల్‌ | విరియించుబలుగాడ్పు విధము మెఱయు
హయములఁ జెండాడ నరుగు చోట్లను లేళ్ళ | గమిఁ గిట్టు కోల్పులికరణి యొలయు
భటులకు నరుగుచోఁ బసలేని పెనుఁ గాన | దరికొనుచిచ్చుచందంబు గలుగు
 
తే. గసిమసంగిన యంతకుకరణి యంత్య | కాలరుద్రుని దర్ప మకాండ మృత్యు
ముఖము నుగ్రభావము దోఁచు మొనయు వీర | సమితిఁ దెగటార్చు నప్పు డా శల్యునందు.
232
వ. ఇట్లు విజృంభించి యత్యద్భుత విక్రమంబున నుల్లసిల్లు నమ్మద్రమహీపతి నుభయసైన్యంబులజనంబులు ప్రశంసించి రంత కంతకు నగ్గలంబగు నగ్గలికఁ జెలంగి యతండు భల్లాదికాండపరంపరలు పటురయంబునఁ బరఁగించు పరమాభీలభంగికి నోహటించి ధర్మజుమోహరంబు దెరలి మరలి పఱవం దొడంగిన నన్నర వరుం డదల్చి కరతలం బెత్తి నిలునిలు మని నివారింప నిలువ దయ్యె. నయ్యుధిష్ఠిరుండు పౌరుషంబు పెంపునఁ దెంపు సేసి యా శల్యునిఁ దాఁకి దర్పంబు సూపినం జూచి మగుడ నిగిడి సేన పోరికిం బురికొనియె నప్పుడు పాండవాగ్రజుండు దమ్ములను దొరలను దనపాలికిఁ బిలువం బంచి వారలతో నిట్లనియె. 233
చ. అమరనదీసుతాదులగు నక్కడివీరుల మీర లందఱుం
గ్రమమునఁ బిల్కుమార్చి భుజగర్వము సూపితి రేను శత్రుపై
న్యమథనకల్యు శల్యుఁ దెగటార్చెద నాకిది కృత్య మీసము
ద్యమ మనివార్యమై నెగడునట్టి తెఱంగు వినుండు చెప్పెదన్‌.
234
వ. ‘నా తేరికి నకులుఁడును సాత్యకియు వలపటను సహదేవుండును ధృష్టద్యుమ్నుండును డాపటను గావలియై రావలయు వెనుకం గదిసి వివ్వచ్చుండును ముందటి కెలన మొనసి వడముడియును నడచునది యింత యేమిటి కనవలదు నన్నొండె నతం డతని నొండె నేను సమయించుట యవశ్యంబును గలుగం జూచితి నిట్లు తెంపుచేసి యమ్మద్రపతి మార్కొను నాకు దుర్దమప్రయత్నంబు కర్తవ్యంబు. కృపకృతవర్మాశ్వత్థామ సౌబల సుయోధనుల య్యోధముఖ్యు రక్షింపం జేయు పరాక్రమంబునకు మీరు ప్రతివిక్రమం బాచరించుచుండ నుదీర్ణంబగు మదీయబాహుపాటవంబున నమ్మేటిమగని గీటడఁగించువాఁడ’ నని పలికిన నారథికవరులును దక్కునుగలవార లమ్మానవపతి పూనికి నగ్గించి యతని రథంబు సవిశేషకల్పితంబు గావించి యతండు సెప్పినతెఱంగున సన్నద్ధులై సముద్ధతిం దేజరిల్లుటయుఁ దత్సైన్యం బుత్సాహదీప్తంబై కడంగినఁ గరిఘంటారవంబులును రథనేమినిస్వనంబులును దురంగకింకిణీక్వణనంబులును సుభట సింహనాదంబులును నిస్సాణాదితూర్యనినదంబులును బెరసి యంబరంబు పిక్కటిల్లఁ జేసె. నివ్విధంబున యుథిష్ఠిరుం డుద్భటుండై యురవడించిన. 235
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )