పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
శల్య ధర్మనందనుల ద్వంద్వయుద్ధము (సం. 9-15-54)
క. కురువిభుఁడు దనదు మొనలకు | బరవస మొప్పంగ మద్రపతి మును శౌర్యో
ద్ధురుఁడయి కడఁగ నడరి య | వ్వరూథినిం దాఁకె ధరణి వడవడ వడఁకన్‌.
236
వ. అట్టియెడ. 237
తే. పులులు దలపడిన యుబ్బును | బలుపును దోఁపంగ మద్రపతిధర్మసుతుల్‌
తలపడి యొండొరువులపై | నలఘుప్రదరములు వఱపి రధికరయమునన్‌.
238
వ. వారి నాలోకించి యుభయసైన్యంబులు విజృంభించి సంరంభంబునం గలయం బెరసినఁ గ్రందుకయ్యం బయ్యె నందు. 239
ఉ. నీ తనయుండు సింహకమనీయతరం బగు భీమునుల్లస
త్కేతన మర్ధచంద్రశరతీవ్రహతిన్‌ మణికింకిణీనినా
దాతిశయంబుతోడఁ బడునట్లుగ నేసి శరాసనంబు బల్‌
వాతిశరంబునం దునిమె వారివరూథిని యేపడంగఁగన్‌.
240
చ. అతఁడు ప్రదీప్తకోపముఖుఁడై పటుశక్తి నురంబు వైచినం
బతి యరదంబుపైఁ బడియె బల్వగుమూర్ఛమునింగి యప్పు డా
యతధను వెత్తి సూతుతల యక్కురుఘస్మరుఁ డేసె డొల్ల వే
గ తొలఁగ నీడ్చెఁ దేరు దురగంబులు మూఁక గలంగి సొం పఱన్‌.
241
క. కని యశ్వత్థామయుఁ గృపుఁ | డును గృతవర్ముఁడును నెక్కుడు బరవసమునన్‌
మరసేనకుఁ దలమిగిలిన | మనుజేశ్వర! కవిసెఁ గ్రీడి మద మెలరారన్‌.
242
క. అమ్ముఖమున సమరము రౌ | ద్రమ్ము పెనిచె మద్రవిభునిఁ దలకడచి యనీ
కమ్ము బహులాస్త్రశస్త్ర చ | యమ్ముల ధర్మజునిఁ బొదివె నత్యుగ్రమునన్‌.
243
వ. పొదివిన నయ్యుధిష్ఠిరుండు. 244
చ. అరదము చిత్రసంచరణ మక్కజమై విలసిల్లఁ దేరులుం
గరులును ఘోటకంబులును గాల్బలముం దనచేతఁ గూలఁగాఁ
బొరలఁగ మేదినిం దునియ ప్రోవులుగా రుధిరంపురొంపి బ్రుం
గ రణవిహారముం జలిపెఁ గౌరవనాథ! యనేకభంగులన్‌.
245
క. నరులు మృదు వితఁ డనంగాఁ | బరఁగు యుధిష్ఠిరుఁడు శత్రుబలముల కతి ని
ష్ఠురుఁ డయ్యె నపుడు సుర ల | చ్చెరువందిరి చూచి ద్రోణు శిక్షఁ బొగడుచున్‌.
246
క. మునుము బయలైన నలిఁ బే | ర్చినయమ్మనుజేంద్రుమీఁద శితవిశిఖము లే
పున నిగిడించుచు శల్యుఁడు | దనరు భుజాబలముతోడఁ దఱిమెం బెలుచన్‌.
247
క. అవ్వీరుని వాలంపఱ | క్రొవ్వు నడఁచి తనదునంపకోల లడరఁగా
నవ్వసుధాధిపుఁ డల్లని | నవ్వొలయఁగ మాఱుకొనె ఘృణారహితుండై.
248
వ. ఇవ్విధంబున మార్కొని ధర్మజమద్రపతులు నిజశంఖంబులు పూరించిరి. భేరీప్రముఖతూర్యస్వనంబులు నింగి వొంగారఁ జెలఁగె నయ్యిరువురు నొండొరులపైఁ జండకాండపరంపరలు పరఁగించి తనువుల నెత్తురు లురలించి పూచిన బూరువుల పొలుపు దాల్చి రట్టి యెడఁ గనుంగొను జనంబులు. 249
చ. వెరవును లావుఁ జేవయును వీరల కారయ నొక్క రూప దు
స్తరభుజశక్తి ధర్మజుఁడు శల్యుని రూపడఁగించి యివ్వసుం
ధర గొను నొక్కొ? నేఁడితనిఁ దా సమయించి సమస్తమేదినీ
శ్వరుఁడుగఁ జేయ నోపునొకొ శల్యుఁడు గౌరవరాజనందనున్‌?
250
వ. అని సందేహడోలాయమానమానసులై; రప్పుడు. 251
తే. మద్రపతి ధర్మజుని విల్లు రౌద్రమెసఁగఁ | ద్రుంచి నూఱమ్ములేసి యుద్ధురతఁ బేర్చె
నతఁడు వేఱొక్క ధను వెత్తి యతని ధనువుఁ | దునిమి వెస నేసె మున్నూఱు తూపు లధిప!
252
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )