పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
కృపకృతవర్మాశ్వత్థామలు దుర్యోధనుం గని సంభాషించుట (సం. 9-29-41)
క. ‘లెమ్ము కురునాథ! కడఁగుము | మమ్ముం గొని పాండుపుత్రమథనమునకు; సై
న్య మ్మదియును నీచేతఁ గృ | శ మ్మయ్యెడుఁ జుమ్ము! వలదు శంకింపంగన్‌.
31
వ. అట్లు కాక గెలిచి భూమి యేలుట యొండెఁ జచ్చినాకలోకసుఖం బనుభవించుట యొండెం గాని నీయట్టివాని కిట్టితెఱంగు కర్తవ్యంబుగా’ దని పలికిన విని యవ్విభుండు వారల కి ట్లనియె. 32
చ. ‘తనువు ఘనాస్త్రశస్త్రములతాఁకున నొప్పిని డప్పి వుట్టె నా
మనము వశంబు గా కెడలె మాటల చందము సూడ మీరు డ
స్సినయటు లున్నవార లనుజీవులు లేరు తొలంగి నేఁటి మా
త్ర నిలువుఁ డెల్లి పైకొని యరాతుల గెల్తము లావు వచ్చినన్‌.
33
వ. అనవుడు నగ్గురునందనుండు. 34
ఉ. ‘ఏ లనుమాన? మేను సమయించెద వైరము నేఁటితోడఁ; బాం
చాలుర నెల్లఁ దీవ్రశరజాలములం బొలియించి కాని భూ
పాలక! పుచ్చఁ గత్తళము; పాటిగఁ బట్టుము నాదుమాట; లి
య్యాలితనంబు వాపెదఁ; బ్రియం బొనరించెద నీకుఁ దండ్రికిన్‌.’
35
వ. అనియె; నపుడనిల సుతుని వేఁట కాఱులు మాంసభారంబులతోడఁ బరిశ్రాంతులై జలపానార్థం బమ్మడువునకు వచ్చి; రంతకుమున్ను ధర్మనందనుం డొక్కబోయం బొడఁగని ‘దుర్యోధనుండు దొలఁగెం జెట్టుచేమల నడంగి యుండునో? మీరు మెలంగు నెడల నరయవలయు’ ననిన వాఁడును వృకోదరుని మృగయులలోనివాఁ డగుటఁ దమవారికి నెదురు వోయి యమ్మాట తెఱం గెఱిఁగించుటం జేసి యప్పని మనంబులం దున్నట్టి యాబోయ లట్లు కెలన నేమరి సల్లాపంబులు సేయుచున్న యన్నరనాథుని యారథికవరుల వచనంబులు విని పూర్వాభ్యాసంబువలన నయ్యుక్తి ప్రత్యుక్తుల పరిపాటి దేటపడిన నన్నీటిలో నీకొడుకు డాఁగి యుంట నిశ్చయించి తమలో మెల్లన నిట్లనిరి. 36
క. ‘ఈ రథికులు తను నిమ్మెయిఁ | బోరికిఁ దఱుమంగఁ దాను బురికొన కిచటం
గౌరవపతి డాఁగినగతి | బోరనఁ జని చెప్పవలయు భూనాథునకున్‌.
37
తే. అతఁడు పసదన మొసఁగు మారుత తనయుని | మున్ను గని మెచ్చు వడయుద; మన్నరేంద్రు
నతఁడ కాన్పించు మనల; రయమునఁ బోవ | వలయు; మాంసభారంబులు వలదు లెండు.
38
వ. అని మోపులు డిగవిడిచి వెసం బాఱి; రయ్యవసరంబునఁ బాండునందనులు నీ నందను వెదక ననేక చారులం బొలికలని కెలంకులకం బుచ్చి, యాతండు తను కగపడమికిఁ జింతాక్రాంతు లై యుండ నాబోయలు భీమునిపణిహారులఁ ద్రోచికొనుచుం దన్మందిరంబు దఱియం జొచ్చి, యతనిం గాంచి, యమ్మడువున నమ్మహీపతి డాఁగి యునికి యెఱింగించి. 39
క. తమవిన్నమాట లన్నియుఁ | గ్రమమునఁ జెప్పిన నతండు గడుఁ బ్రియమున న
ర్థము లొసఁగె వారికి ననే | కములు వహింపంగఁ గొలఁది గాకుండంగన్‌.
40
వ. ఒసంగి యా లుబ్ధకుల నగ్రజుఁ గానిపించి ‘దేవా! దుర్యోధనుండు ద్వైపాయనహ్రదంబున నొక్కక్షుద్రవిద్యంజేసి జలంబులు నిజశరీరంబు సోఁకకుండునట్లుగాఁ జేసికొని డాఁగియున్నవాఁడు; వీ రెఱింగి వచ్చి’రని యతనికి విన్నవించి, యా సుయోధనగురునందనాదుల సల్లాపంబు లెఱిఁగించిన, నతండు పరమహర్షంబున నా బోయలకు బహువిధంబు లగు పసదనంబు లిచ్చి తక్కిన తమ్ములకును గృష్ణునకుఁ జెప్పికొని వారును సకలబంధు మిత్రపరిజనంబులును దోడన చనుదేర నుద్దామగమనంబున. 41
తే. తురగ ఖురపుటరథనేమికరిపదాతి | ఘట్టనంబుల నేల గ్రక్కదల శంఖ
పణవనిస్సాణ కాహళ రణన మెల్ల | దెసలఁ బరఁగంగ వచ్చె నద్దెసకునధిప!
42
వ. అట్లు ధర్మనందనుం డేతెంచు కలకలం బాలకించి యంతకమున్ను రణోత్సాహంబునకై రాజు నిర్బంధించు చున్న యగ్గురుపుత్రకృతవర్ము లతనితో నిట్లనిరి. 43
మ. ‘ధరణీనాయక! పాండుపుత్రులు సముద్దామోద్ధతిన్‌ వీరె వ
చ్చిరి వీరిన్‌ వడిఁ గిట్టి తాఁకుదమొ? నీచిత్తంబు పోరాటకుం
జొరదే నిప్పటికిం దొలంగి చని యెచ్చోనైన నేముండి చె
చ్చెర రూపించినవేళఁ జెప్పినెడకుం జేరంగ నేతెంతుమో?’
44
ఆ. అనుడు నా నృపాలుఁ డయ్యోధవరులతో | ‘నిప్పు డనికి నుత్సహింప కెచటి
కేనిఁ దొలఁగిపోయి యిచటికి మగుడంగ | రండు పగలు సనిన రాత్రి యగుడు.
45
వ. వారు వారణపురంబున కనివారణఁ బోయెదరు; వోవుదురు గాక యిచ్చేరువఁ బోయిరేనియు ని మ్మడువున నాయునికి యెఱుంగలే; రట్లు గాక యెఱింగిరేనియు నన్నుఁ జేరరాదు; మదీయ విద్యా విశేషసంస్తంభితాంభో దుర్గంబున నిర్భయుండ నై యుండెదఁ బొం’ డనినం బొగులు మనంబులతోడ నా రథికజనంబులు వోవం బతి జలంబులు శిలాసదృశంబులుగాఁ బరిస్తంభించె; నేనును బాండుసూనుల చారు లెల్లకడల మెలంగుటం జేసి రాజు నప్పుడు వెలువరించుట కర్జంబు గా దనియు నతనితోయస్తంభవైదగ్ధ్యం బెఱుంగుట నొలసిన యూఱటను ముందటియట్ల వారలతోడం జని చని చిత్తంబు గలంగినం జాలక యరదంబు డిగ్గి యచ్చట నొక్కయెడ నొదిఁగి నిలిచెద నని వారలకుం జెప్పి యమ్మడువు నఱుత నొక్కపఱపు గలపొదయీఱమిం దూఱి పొంచియుండితి; వారలు దూరంబు సని యొక్క విపులవటంబు పొంత విశ్రాంతి నొంది నీనందను వలనికిం జనిన హృదయంబులతోఁ దదీయకార్యచింతాభరంబు పట్టుకొనఁ దదనుబంధ సంభాషణంబులు సేయు చుండి రక్కడ. 46
క. కలకల నవ్వుచుఁ బెలుచం | బలుకుచుఁ దమకెలఁకులందుఁ బాంచాలకుమా
రులు సనుదేరఁగఁ బాండుసు | తులు వచ్చిరి సంతసంబుతో మడువునకున్‌.
47
వ. ఇట్లు వచ్చి ధర్మతనయుండు భవత్తనయమాయాస్తంభితం బైన యాజలాశయంబు నిరూపించి తత్ప్రకారం బెఱింగించి యచ్యుతునితో నల్లన ని ట్లనియె. 48
క. ‘చొరరాదు మనుజులకు నె | వ్వరికిని నిజ్జలము కౌరవక్షితిపతి ని
ర్భరమాయా సంరక్షా | భరితం బై; కాన వీతభయుఁ డాతండున్‌.’
49
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )