పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
ధర్మరాజు మడుగున డాఁగియున్న దుర్యోధనుని దూఱనాడుట (సం. 9-30-6)
క. అని వెండియు నాపతి గురు | జననాథుగుఱించి పలుకు ‘శక్రుఁడు దోడై
చనుదెంచె నేని పోవ | చ్చునె నాచేఁ దప్పి యిందుఁ జొచ్చినఁ దనకున్‌?’
50
వ. అనిన విని యచ్యుతుం డతనికి నల్పస్వరంబున నిట్లనియె. 51
ఉ. ‘మాయలు గల్గు దుష్టులకు మాయపుభంగులె మందు గాక ని
ర్మాయత నుల్లసిల్లెడు పరాక్రమ లీలలు గొల్చు నెట్లు? దై
తేయులు దొల్లి మాయల నతిప్రబలాత్మకు లైనఁ దద్వధో
పాయములన్‌ జయింపరె నృపాలక! విష్ణుఁడు నింద్రుఁడుం దగన్‌.
52
వ. హిరణ్యకశిపు వృత్రవధ ప్రకారంబు వినమె? రావణుండు హోమాదిమాయాక్రియావిఘాతంబునఁ గాదె రాముచేత నిర్జింపంబడె? నరకాసుర నేను బరిమార్చిన తెఱం గెఱుంగవే? వీఁడగపడునట్టి విధంబు సూచికొ’ మ్మనిన విని యప్పాండవాగ్రజుండు జలాంతర్గతుం డై యున్న భవన్నందను నుద్దేశించి యిట్లనియె. 53
చ. ‘ఇటు తగునే సుయోధన! మహీవలయంబున నిట్టిదైన్య మె
చ్చట వినఁ జూడఁ గల్గెనె? యసంఖ్యులు రాజులు నీకుఁ గాఁగఁ జ
చ్చుటయును బంధుమిత్రులు విశుద్ధచరిత్రులు పోర నట్లు త్రుం
గుటయును జూచి; తేమిటికిఁ గ్రుంకితి నీళ్ళను? జావు దప్పునే?
54
ఉ. శూరుఁడ వండ్రు నిన్‌ మడువు సొచ్చుట శౌర్యముచొప్పె? మాన మే
యూరికిఁ బోయె? నాజి నృపు లోడుదురే? నృపుఁ డున్న మాత్రయే?
కౌరవవంశజాతుఁడవు గష్టపుఁ జచ్చుట దెచ్చుకొంటి; నీ
పేరును బెంపు మాలి యరిబృందము నవ్వఁగ నిట్లు సేయుదే?
55
తే. క్షత్త్రధర్మంబు విడిచినఁ గలదె యిహము | బరముఁ? బేరోలగంబునఁ బలుకుపలుకు
లెల్ల మఱచితె? విను మవి పొల్లు లైనఁ | గష్టపాటు గా కుసు ఱేల గావ వచ్చు?
56
చ. కొడుకులు దమ్ములుం గలన ఘోరపుఁ జావులు సావఁ జూచి యె
ట్లొడఁబడె నీదుబుద్ధి యొడ లోముట కై? నిను రాజరాజ! యి
మ్మడువున కీడ్చి తెచ్చె విధి; మానము ప్రాణముకంటెఁ జాల నె
క్కు డగుట సెప్పఁగా వినవొకో? కడునీచతఁ బొంది తక్కటా!
57
శా. అంభోగర్భము సొచ్చి పాండుసుతబాహాగర్వ దుర్వారసం
రంభం బోర్వక డాఁగి యుండె నట రారా జిస్సిరో! చచ్చుచో
గాంభీర్యంబును ధైర్యమున్‌ విడిచి దోర్గర్వంబు బెండయ్యెనే?
శుంభన్మానము దూలెఁగా కని జనస్తోమంబు నిందింపదే?
58
తే. కర్ణశకునిదుశ్శాసనుల్‌ ఘనులు గాఁగఁ | దలఁచి వారలఁ గొని మమ్ము గెలుచువాఁడ
వై మనంబున శంకింప కట్లు కీడు | చేసి తా తూఁపు దప్పిన గాసి యైతి.
59
వ. నీ కొలంది గంటి; మగపడితి; వింక నెందుఁ బోవచ్చు?’ నని మఱియు ని ట్లనియె. 60
మ. ‘భయముం బాయఁగఁ ద్రోచి వీరగుణముం బాటించి సంగ్రామని
శ్చయబుద్ధిం దలకొల్పి పౌరుషముమైఁ జా వొండె గెల్పొండెఁ గా
క యధీరత్వము నాకు నీడె యని వీఁకం బేర్చి వే తాఁకు మెం
తయుఁ బే రయ్యెడు; రమ్ము లె; మ్మొదిఁగినన్‌ దైన్యమ్ము వచ్చుంజుమీ!’
61
చ. అని మము నోర్చినం బృథివి యంతయు నేలఁగ వచ్చు; నీవు చ
చ్చిన సురసద్మ సౌఖ్యములు చేకుఱు; రెండుదెఱంగులందు నొ
ప్పనియది లేదు డాఁగ నగుబాటును బ్రాణము చేటుఁ దెచ్చుకోల్‌
విను! మము నీ వెదుర్పఁ దగు వేయువిధంబులఁ జాటి చెప్పెదన్‌.
62
వ. తెంపు చేసి మామీఁద నుఱుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు; పురుషుండ వైతేని దీని ననుష్ఠింపు’ మనిన విని యవ్వసుమతీశునకు సుయోధనుం డి ట్లనియె. 63
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )