పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుఁడు నీరిలోన యుండి ధర్మజున కుత్తరం బిచ్చుట (సం. 9-30-35)
సీ. ‘నరుఁడు ప్రాణభయంబుఁ బొరయుట యరు దయ్య! వినుము తెల్లంబుగా మనుజనాథ!
రథవాహసారథిరహితుండ నగుటను | బాణాదిహేతిసంపదలు లేమిఁ
బరివారశూన్యత వాటిల్లుటను బంధు | మిత్రసహాయులు మిడి యడంగఁ
జచ్చుటయును బోట్ల నొచ్చి మేనును డప్పి | గూరి చిత్తంబును బోరి కెలయ
 
తే. కునికిఁ జేసియుఁ దొలఁగితి నొదిఁగి సేద | దేర్చుకొని రణమునకు నుదీర్ణవృత్తి
వచ్చువాఁడను నీవు మీవారు విశ్ర | మింపుఁ డంతకు మఱి రండు సొంపు సూప.’
64
వ. అని పలికినఁ బాండవాగ్రజుండు. 65
క. ‘ఇందాఁక విశ్రమించితి; | మిందు నినుం దడవి కంటి; మిప్పు డిచట నీ
కుం దేఱె డప్పి; కురుపతి | నందన! ర మ్మింక రణమునకు నాయిత మై.’
66
వ. అనుటయు. 67
తే. ‘ఎవ్వరికిఁ గాఁగ రాజ్యంబు నెల్లభోగ | ములును గోరుదు రక్కుమారులును నాదు
తమ్ములును లేరు; తురగరథ ద్విపప్ర | హీన యయ్యె నీ క్షోణీయు; నేల పెనఁగ?
68
చ. ద్రుపదతనూజులన్‌ గెలిచి దోర్బలసంపద నుల్లసిల్లి మి
మ్మపజితదర్పహీను లగునట్లుగఁ జేసి సమస్తభూపతి
త్వపదము గంటినేనియు వృథారభసం బది యింపు గాదు క
ర్ణుపడుట భీష్ములేమిని గురుండు మృతుం డగుటన్‌ ధరాధిపా!
69
క. తనవారుఁ దానుఁ గూడఁగ | ననుభవసుఖ మందఁ డేని యది రాజ్యమె రా
జునకు? భవత్పరిజనములు | ననుజన్ములు బ్రదికి; రేలు మఖిలధరిత్రిన్‌.
70
క. ఏ నింక సమర మొల్ల మ | హీనాయక! నీక యుర్వి నిచ్చితి శాంతిం
గానకుఁ జని వల్కలపరి | ధానుఁడ నై తప మొనర్చెదను మునుల కడన్‌.
71
ఆ. ఓడి వచ్చినాఁడ నుద్ధతి నా కేల? | యుడుకు మాని నీవ యుర్వి యేలు
గుఱ్ఱములును నేనుఁగులు లేని బయలు నీ | తలనె కట్టికొనుము ధర్మతనయ!’
72
చ. అన విని యన్నరేశ్వరుఁడు హాసముతో నతనింగుఱించి యి
ట్లనుఁ ‘దనుజానుజన్మసుహృదాప్త సహాయుల సన్నఁ గాదె శ
ల్యునిఁ గొని మమ్ము గెల్చి సకలోర్వియు నేలుట కుత్సహించి తీ
పనవుట లేల? మాను మిది; పాటిగఁ బట్టుము లెమ్ము పోరికిన్‌.
73
సీ. నీ యీగి నేను భూనాయకుఁ డగు టొల్ల | రాజకోటికిఁ బరిగ్రహము సనునె?
నిను ననిం దెగటార్చి నేలఁ బాలించెద | నను నోర్చితేని పెంపున సుఖింపు
మేమిటి వాఁడవై యిచ్చితి పుడమి నీ | కనియెడు మాట యిట్లాడె దిపుడు
నీవు ధరిత్రి యీ నేర్చినఁ గురుకులం | బునకు నిట్లాఱడిఁ బోవ నేల?
 
తే. శాంతి నొందుటకై ధర్మసం విభాగ | కరణ మొనరింపవచ్చినకమలనాభు
వాక్యవృత్తిఁ బాటింపక వాఁడి సూది | మోపి నంతైన నుర్వి యీనోప నంటి.
74
క. ఏమి విధంబునఁ బొరలియు | భూమి కురునృపాల! నీకుఁ బుచ్చుకొనఁగ రా
కీమెయి దైన్యపడితి? నా | కేమార్గము వట్టి యిచ్చె దేర్పడఁ జెపుమా!
75
క. అరులకు సిరి యిచ్చితి నను | వెరవి డియుం గలఁడె? దీని విడువుము నాకున్‌
ధర యిచ్చి తేనియును నినుఁ | బొరిగొన కే విడువ నఱిమి పోరుట యొప్పున్‌.
76
క. నాచే నీ ప్రాణంబులు | నీచే నా జీవితంబు నిజ మున్నవి యి
న్నీచత యవకార్యము రా | జోచితకర్మకృత నిశ్చయుఁడ వగుము నృపా!’
77
వ. అని వెండియు నిట్లను ‘జతుగృహంబు దహించితి, పాములం గఱపించితి, నీటం ద్రోయించితి, విషాన్నంబు వెట్టించితి; వెన్ని కపటోపాయంబలు సేసినను నీచేతఁ జెడక యునికి యెఱుంగవే? యింక నట్ల య మ్మాయలం బ్రయోజనంబు లేదు. 78
క. లే లెమ్ము! బిరుద వై ర | మ్మాలమునకు; నీవు నెఱుఁగ దవ్విధము కడున్‌
మే లొండు తెరవు లే; దిం | కేల యొదిఁగి కష్టపడ? నరేశ్వర! చెపుమా!
79
వ. అని యివ్విధంబున నమ్మనుజేంద్రుండు మఱియుం బలుకఁ బెఱవారు నట్ల పలికి’ రనిన విని ధృతరాష్ట్రుండు. 80
తే. ‘ఇట్లు జంకింపఁబడి మఱి యేమి సేసె | నాతనూజుండు? మున్ను నెన్నఁడును జంకఁ
బడినవాఁడు గాఁ డక్కట! పుడమి నాల్గు | సెఱఁగులును వెఱఁ దన పంపు సేయ బ్రదికె.
81
క. పరిజనహీనత దీనతఁ | బొరసినయెడ ముట్టుకొని రిపుప్రకరము ని
ష్ఠురవాక్యమ్ముల నమ్మెయిఁ | బరితాపము సేయ నేమిభంగి నిలిచెనో?’
82
వ. అనుటయు సంజయుం డమ్మనుజపతి కిట్లనియె ‘నట్లు ధర్మతనయుండును దమ్ములుఁ గొడుకులును ద్రుపదపుత్రులును బొదువుకొని పలుకు పరుసని పలుకులుకుఁ జిత్తం బుత్తలపడ నాననంబు పల్లటిల్లఁ గరంబులు విదిర్చి దురం బొనర్చువాఁడై యప్పాండవాగ్రజున కిట్లనియె. 83
సీ. ‘మీ రేవురును బరివార బాంధవమిత్ర | సహితుల, రఖిలాస్త్రశస్త్రవంతు
లరు, కరిస్యందనతురగసమేతుల; | రే నొకరుండ, విహీనసహచ
రత్వంబు విగతాయుధత్వంబు వాహన | హీనత నొందితి; నే విధమున
నని యొనర్పఁగ వచ్చు? నది గాక పోటుల | డస్సితిఁ గడు; మీకు డప్పి లేదు;
 
తే. వరుసఁ దగ నొక్కఁ డొక్కఁడ వచ్చి పోరుఁ; | డిపుడ వెడలి మిమ్మందఱ నెల్ల చెలులఁ
జుట్టముల రూపుమాపెదఁ; జుట్టుముట్టి | పలువు రొక్కనితోఁ బోరఁ బాడి యగునె?
84
వ. అట్లు మీరు సాలరేని. 85
ఉ. తమ్ముల నిన్నుఁ గేశవునితమ్ముని ద్రౌపదియన్నదమ్ములం
గ్రమ్మన గీ టడంచెద నొకండన యే నిదె వచ్చి బాహుద
ర్పమ్మున నిర్లవారమును భానుఁడు దోఁచి సముజ్జ్వలాత్మతే
జమ్మున రూపుమాపు క్రియ; సజ్జత నిల్వుము సుస్థిరుండవై.
86
తే. వినుము నీకుఁ గృష్ణునకును వెఱచి కాదు | ముంద రేనట్టు లాడుట యెందుఁ జెల్లు
సమరధర్మంబు తెఱఁగు దెల్లముగ నెల్ల | వారలకుఁ దెల్పుటకుఁ గాని వసుమతీశ!
87
వ. నేఁడు మిమ్మందఱ సమయించి భీష్మద్రోణకర్ణభగదత్తబాహ్లికజయద్రథశకునిశల్యాదు లగు బంధుమిత్ర సహాయుల ఋణంబు దీర్చెద’ నని పలికినం బాండవాగ్రజుం డి ట్లనియె. 88
చ. ‘సమరము పాడి నీ వెఱిఁగి శత్రుల గెల్వఁగ నుత్సహించు టొ
ప్పు మనుజనాథ! యొక్కఁడును బూని మహాద్భుతబాహుసంపదన్‌
మము వడిఁ దాఁకెదం బిలుకు మార్చెద నంట యుదాత్త మైనధై
ర్యమహిమ గాదె! యి ట్లనిన యంతన యే నటు లేల చేసెదన్‌?
89
చ. వలసిన యస్త్రశస్త్రములు వాహనముం గొను; మొక్కరుండ నిన్‌
గలన జయించువాఁ; డతనిగర్వము నీ వడఁగించితేని యీ
యిల సకలంబు గైకొని వహింపుము రాజ్యవిభూతి; వాఁడు నిన్‌
దలపడి పోరుఁ జుట్టలును దక్కటివారలు నిల్చి చూడఁగన్‌.’
90
వ. అనిన విని భవన్నందనుండు ధర్మనందనున కి ట్లనియె. 91
చ. ‘అరదము లెక్కి ఘోరవివిధాస్త్రచయంబుల మున్ను పోరమే?
నరవర! క్రొత్తచందము రణంబు కరంబు ప్రియంబు సేయు; ని
ష్ఠురగదలం బదాతు లయి శూరతయున్‌ మహనీయధీరతా
స్ఫురణమునుం బొగడ్త వడఁ బోరుట మే లని నిశ్చయించితిన్‌.
92
తే. వింతకూరలు గుడుపున వేడ్క సేయు | భంగి సంగ్రామమున నూత్నభంగు లెడఁదఁ
గౌతుకము సేయుఁ గావున గద ధరించి | నిను సహోదరులను యోధులను జయింతు.’
93
చ. అనుటయుఁ బొంగి ధర్మసుతుఁ డాతనితో ‘గద నొక్కరుండ నేఁ
గొనియెద నీదుప్రాణము లకుంఠితబాహువిలాసభాసి నై’
యనవుడుఁ బుట్ట లోపలి మహాభుజగేంద్రుఁడు రోఁజునట్టు రోఁ
జె నధిప! య వ్విభుండు దనచిత్తము నప్పలుకుల్‌ గలంచినన్‌.
94
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )