పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
కురుక్షేత్ర ప్రభావాభివర్ణనము (సం. 9-52-4)
సీ. ‘ఇందుఁ బుట్టినజను లెల్లను దుదిఁ ద్రిది | వంబున కరుగంగవలయు నని మ
నంబునఁ గోరి యన్నరపతి దున్నంగ, | నింద్రుఁడు సనుదెంచి యేల యిచట
దునియెద? వనిన నమ్మనుజాధిపతి తన | కోర్కి సెప్పిన, గేలిగొనుచుఁ జనియెఁ;
బలుమఱు నద్దేవపతి వచ్చి వెండియు | నుల్లసమాడుచు నుండు నతని
 
ఆ. నతఁడు నిష్ఠఁ గుంద కనిశంబు దున్నంగ | వరముఁ బ్రీతి నొసఁగువాఁడు గాఁగ
నమరు లెఱుఁగ నిశ్చయము సేసి యాశక్రుఁ | డచటి కేగుదెంచి యతనితోడ.
215
వ. ఈ పుణ్యక్షేత్రంబున నిరాహారులై దేహంబు విడిచిన వారలకు నిందు సమరంబు సేసి సమ్యక్ప్రకారంబున మృతిఁ బొందిన సమస్తజంతువులకును సురలోకప్రాప్తి గలిగెడు’ మని పల్కి నిజస్థానంబునకుం జనియె; నట్లు చను చుండి యాశతమఖుఁడు సంభావనాతిశయంబున. 216
క. ‘గాలిఁ గురుక్షేత్రంబున | ధూలి తనువుఁ జెంది నరుని దుష్మర్మములం
దోలి యతనికి ధరిత్రిం | దూలి మధురలీలమై నతులగతి యొసఁగున్‌.
217
వ. అని నిర్దేశించినఁ గురునృపాలుండును గృతకృత్యుండై సంతోషించె’ నని చెప్పుటయు, నా ప్రలంబవైరి ప్రమోదభరితుం డగుచు మెలంగి యశ్వత్థమధూకామ్రబిల్వాదిభూరుహోప శోభితం బైన నిజపూర్వాశ్రమంబుఁ గనుంగొని ‘యిది యెవ్వరియాశ్రమం?’ బని యడిగిన నమ్మును ‘లియ్యెడఁ దొల్లి విష్ణుదేవుండు దపంబు సేసినచోటు; మఱియు శాండిల్యప్రభృతు లిందు యోగసిద్ధిం బొంది’ రనిన విని యయ్యాశ్రమంబుఁ గొనియాడి తత్ప్రదేశంబున బహిఃపరివారంబు నెల్ల వీడుకొల్పి యొక్కపుణ్యాచలం బెక్కి దానితటంబున సమస్థలంబున మునిజనసహితంబుగ నాసీనుం డయ్యె; నాసమయంబున నిచ్చటికి జటామండలకలితుండును గుశచీరచ్ఛాయా సుందరుండును గలహప్రియుండును నగు నారదుండు హేమదండంబును మణికమండలువును గచ్ఛపవీణయుం బొలుపు మెఱయ నేతెంచిన, నెల్లవారలుం బ్రత్యుత్థానప్రణామంబు లాచరించి సుఖోపవిష్టుం జేసి పరివేష్టించి; రా దేవమునిం గొల్చియుండి య బ్బలదేవుండు. 218
క. కురువృత్తాంతం బడిగినఁ | గరమేర్పడఁ జెప్పె నతఁడు గాంగేయుండున్‌
గురుఁడును గర్ణుఁడు శల్యుఁడు | వరుస ననిం దెగుట కౌరవక్షితినాథా!
219
వ. మఱియును మృతు లైన నృపకుమారాది యోధవరులం జెప్పి పదునెనిమిది దివసంబులఁ జెల్లిన సంగరంబు తెఱంగును, సంక్షేమరూపంబునఁ తెలియఁబలికి, దుర్యోధనసైన్యం బంతయు సమయుటయు, నందుఁ గృపాశ్వత్థామ కృతవర్మలు బ్రదికిపోవుటయు నన్నరపాలుఁ డోడి పాఱి ద్వైపాయన హ్రదంబు సొచ్చి జలంబుల సంస్తంభించి డాఁగుటయు, నది పాండవు లెఱింగి సపరివారంబుగాఁ జనుదెంచి యమ్మడువుఁ జుట్టుముట్టి బెట్టిదంపు మాట లాడుటయు, దానం గనలి యమ్మనుజవరుండు మడువు వెడలి వచ్చుటయు నెఱింగించి బిరుదు మగ లగు పగతురు పెక్కండ్రు పొదివికొనియుండం గురుపతియు నుక్కు దక్కక యున్నవాఁ; డద్దండితనంబుఁ జూచిన మెత్తు వీ వని యుగ్గడించి. 220
వ. అతనికి భీమసేనునకు నాహవ మయ్యెడు నొంటిమై మహా
ద్భుతబలశౌర్య ధైర్యములఁ బొల్చు భవత్ప్రియశిష్యులన్‌ సుఙఙశి
క్షితులఁ గనుంగొనం దలఁపు చిత్తమునన్‌ మొలతెంచునేనిఁ బొ
మ్మతుల గదాకృతోజ్జ్వల విహార ముదారనిరూఢి నొప్పెడున్‌.
221
వ. అనిన విని యమ్మునీంద్రునిం దక్కటిమునులను వీడ్కొని యచలంబు డిగ్గి యభ్యంతరపరిజనంబుల నిజపురంబున కనిచి, యన్నీలాంబరుం డరదంబు సమీపంబునకుఁ జని సరస్వతి నాలోకించి. 222
చ. అరయఁగ మేటి పుణ్యనదులందు సరస్వతి సౌఖ్యసంపదల్‌
నరులకుఁ గల్గు నిజ్జగమునం బరలోకమునందు నీసరి
ద్వర నొకనాఁడు సేరినను వాసవముఖ్య సమస్తదేవతా
వరులును నిందు మేల్‌ వడయవత్తురు సంస్మృతి సాలు సిద్ధికిన్‌.
223
తే. అనుచుఁ బలుమాఱు చూచుచు నధికభక్తి | మోడ్పుఁగేలు శిరంబును మోపికొనుచుఁ
బుణ్యతమనిజమూర్తి విస్ఫూర్తి మెఱయ | నమ్మురారాతిపూర్వజుఁ డరద మెక్కి.
224
వ. అతిత్వరితగమనంబున ద్వైపాయనహ్రదంబునకుఁ జనుదెంచె; నయ్యెడ. 225
తే. ధర్మపుత్రాదులును సుయోధనుఁడు నతని | గన్న తెఱఁ గాంబికేయుండు విన్న తెఱఁగు
నధిప! మును చెప్పినాఁడ; న ట్లన్నరేంద్ర | కుంజరుఁడు విని యిట్లను సంజయునకు.
226
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )