పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
పాండవ దుర్యోధనులు ద్వైపాయనహ్రదంబు విడిచి పొలికలనికిఁ బోవుట (సం. 9-54-3)
క. ‘బలభద్రుఁడు సనుదెంచిన | నలఘుగదాస్ఫురిత భుజసహాయత్వసము
జ్జ్వలుఁ డగు మత్పుత్రునకుం | దెలివి మిగులకున్నె? రణముతెఱఁ గె ట్లయ్యెన్‌?’
227
క. అనుటయు నతఁ డిట్లను న | జ్జనపతికి హలాయుధుండు సనుదెంచి నె
మ్మనము దెలివొందె మూఁపులు | దనరె మొగం బలరె నీదుతనయున కధిపా!
228
వ. ఇట్లు ప్రీతుం డై యాతండు ధర్మనందనుం జూచి ‘శమంతపంచకంబు ప్రజాపతియుత్తరవేది యనఁ బ్రసిద్ధం బైన పుణ్యస్థలం; బయ్యెడం బ్రథనంబున నిధనంబు నొందినవారికి సద్గతి యగుట ధ్రువం బని విందు; మిప్పటి పొలికలనికిం బోవుద’ మనిన నతం డాద్వైపాయనహ్రదం బాసీమలోనిది గామి యెఱుంగుం గావున నమ్మాట కియ్యకొని తదభిముఖుం డైపోవ నాదుర్యోధనుండును గదాకలనంబున నంసపీఠంబు పొలుపార మత్తగజేంద్రయానంబున నమరప్రస్తూయమానుం డగుచుఁ జన శంఖభేరీప్రముఖతూర్య స్వనంబులు సెలంగె; నిట్లు పాండవపరివృతుండై యచటికి నీ కొడుకు నడచి యమర్ష సముజ్జ్వలుం డై. 229
క. నిలిచిన సకలజనులు నెడ | గవిసి బలసి నిలిచి రపుడు గదయుఁ బసిఁడి క
త్తళము మెఱయ నతనియెదురఁ | జెలువొందె బకారి హేమశిఖరియుఁ బోలెన్‌.
230
చ. కనుఁగొని దర్పమంథరము గా నతఁ డిట్లనుఁ బాండవాగ్రజ
న్మునకు ‘వడిం బెనంగఁగ సనుం బవనాత్మజుఁ జూచు వేడ్క ని
జ్జనతతి యంతకంత కిటు సందడిగాఁ దనయిచ్చఁ గ్రమ్ముదెం
చునొ? యుపవేశనిశ్చలతఁ జూచిన మే లఖిల ప్రియంబుగన్‌.’
231
వ. అని భూపాలుర నెల్ల నాలోకించినం బాంచాలాదు లగు నయ్యందఱను ధర్మనందనుండు గూర్చుండ నియోగించి, బలదేవ వాసుదేవ సహితంబుగఁ దాను నాసీనుం డయ్యె; నమ్మహీనాథమండలంబున సితప్రభుం డైన యన్నీలాంబరుండు తారకామధ్యవర్తియై మెఱయుమృగాంకు ననుకరించె; నట్టియెడ భీమసేనుండును దుర్యోధనుండును. 232
సీ. ఆభీల గర్జన శోభితదేహు లై | యుద్భటవృషములయొప్పుఁ దాల్చి,
రోష మహావిషభీషణవదను లై | చండోరగంబుల చంద మొంది
మదసముజ్జృంభితమండితాకారు లై | భద్రద్విపంబుల పగిదిఁ బొల్చి,
చారుగదాశృంగ సందీప్త మూర్తు లై | మహితపర్వతములమాడ్కి మెఱసి,
 
ఆ. వాసుదేవయుగము వరుణద్వయంబు వై | శ్రవణయుగ్మకంబు రామయమము
వోలె దర్శనీయలీల వహించి యం | భోధియుగళ మనఁగఁ బొంగు మిగిలి.
233
వ. ఒండొరులం జుఱచుఱం జూచుచుఁ, బరస్పరహృదయ విదారణంబు లగు దారుణభాషణంబు లెసఁగ శుంభదవష్టంభంబునం బొలిచి నిలిచి; రనిన విని యాంబికేయుండు. 234
క. ‘తనుఁ బదునొకఁ డక్షౌహిణు | లనూనవిభవమునఁ గొలువ నఖిలనృపులుఁ బం
చినపని సేయ నెగడునా | తనయుం డేకాకియుం బదాతియు నయ్యెన్‌.
235
తే. సకల ధరణికి నాథుఁడై సంపదలకు | నెల్ల భాజన మగు కౌరవేంద్రుఁ డనద
తనము దోఁపంగ గదఁ జేతఁ గొని వినిశ్చ | యమునఁ బోరికి నమరెనే? యక్క టకట!
236
వ. ఏ మనం గలదు సంజయా! దైవంబ నేర్చుం గాక!’ యని పనవి యూర కుండె; నట్లున్న యమ్మానవపతికి సూతసూనుం డి ట్లనియె. 237
క. ‘నీసుతుఁడు సమర విషయో | ల్లాసంబున నంగకంబులం బొం గారం
గా సుస్వరమున నాకుం | తీసూనునిఁ బిలిచె నుద్ధతిన్‌ రణమునకున్‌.’
238
వ. ఆ సమయంబున. 239
క. ఉర్వీవలయము వడఁకెను, | బర్వము గాకయును రాహు భానునిఁ బట్టెం,
బర్వతము లురిలె, వఱళులు | సర్వదిశల నఱచె, నభము శర్కర గురిసెన్‌.
240
వ. మఱియు నిర్ఘాతపాతప్రభృతి మహోత్సాతంబులు గలిగె; వాని నెల్ల ననుసంధించి గంధవహనందనుండు గాంధారీనందనుం జూపి ధర్మనందనున కిట్లనియె. 241
సీ. ‘అశ్రమంబున గెల్వ నగు నాకుఁ జూపఱు | గొనియాడఁ బోరాడి కూల్చి తొడలు
పొడిసేసి యిన్నీచుఁ బొలియింతు మద్గదా | దండసముద్దండతావిభూతి
యవధరింపుము; వీని యాయువు దెగటాఱె; | నిక్కులపాంసను నిట్టు లేను
గదిసియుఁ గ్రమ్మఱఁ గరిపురంబునకుఁ బో | నిత్తునే? ధృతరాష్ట్రుఁ డింక వగలఁ
 
ఆ. బొగులువాఁడు గాక! పోఁడిమితో నుండు | వాఁడె? వీఁడు మనల వాలి పఱుపఁ
దొల్లి పడినపాటు లెల్ల వెలారింతు | నధిప! నీమనమున హర్ష మెసఁగ.’
242
వ. అని పలికి దుర్యోధనాభిముఖుం డై. 243
క. నెఱి మాలి వీరి నీతఁడు | పఱిచినపాటులకుఁ దగినఫల మగు నని ‘యి
త్తెఱఁగునకు నియ్యకొని చూ | పఱువొగడఁగ నిన్ను నిపుడ పడవైచుటకున్‌.
244
తే. అమరి యున్నాఁడ; నాబారి కగ్గ మైతి; | పడుదుగా కింక; నీకు నెక్కడకుఁ బోవ
వచ్చు?’ ననవుడు నిది ‘యేల పెచ్చు పెరిఁగి | యాల మెడసేసి యనిలజ! ప్రేలె దిట్లు?’
245
వ. అని కురువిభుండు వెండియు నిట్లనియె. 246
క. ‘పలుకుల వెఱపించెద వా | కొలఁదియె? దుర్యోధనుం డకుంఠితబాహా
బలుఁ; డిదె యవలీల నినుం | బొలియించెడిఁ; బలుకు లుడిగి పోరాడు ధృతిన్‌.
247
శా. వ్యూహాభావము సూచి నన్నసదుగా నూహించెదో భీమ! మ
ద్బాహాచండిమసారదుర్దమగదాదండంబు దృప్యద్భవ
ద్దేహోల్లాసము నెట్లు దీనదశకుం దే నోర్చునో చూడుమీ!
యాహా పుట్టెడు లాఁతి చూపఱకు; హాహా పుట్టు మీ వారికిన్‌.
248
ఉ. నా కెదురై పినాకియుఁ బినాకము వట్టక యుద్ధతిన్‌ గదా
భీకరవృత్తి చూపుటకుఁ బేర్చిన నెక్కుడు వేర్చి చీరికిం
గైకొన కే పడంచి భుజగర్వసమున్నతి నిర్వహింతు; నీ
కే కడ డాఁగ వచ్చు? గద నే నని సేయుటకుం గడంగినన్‌.’
249
వ. అని మఱియును. 250
క. ‘గదఁగయ్య మెన్నఁడొకొ చే | యుదు భీమునితోడ? ననుచు నుల్లంబునఁ గో
రుదు నెపుడు; నిప్పుడు నా | కది యొదవెన్‌ విధికృతిం; గృతార్థుఁడ నైతిన్‌.
251
వ. నీ విట చక్కనయి రమ్ము.’ 252
చ. అన విని యెల్లవారు భవదాత్మజు మెచ్చి నుతించి; రయ్యశో
ధనుఁ డరివీరు లట్లు ప్రథితంబుగఁ దన్‌ బొగడం బ్రమోది యై
వినుచుఁ బ్రవర్ధితం బయిన వీరగుణంబున నుల్లసిల్లె నా
తనిపయి భీముఁ డుద్యతగదాస్ఫురణన్‌ నడచెన్‌ నరేశ్వరా!
253
వ. అప్పుడు కుంజరబృంహితంబులును హయహేషలునుం జెలంగె; నిట్లు తన మీఁద నడచు వడముడిం జూచి నీకొడు కదల్చుచు గదాసముల్లాసంబు భాసమానంబుగ వీఁక నెదుర్కొని తాఁకిన. 254
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )