| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘భీముని సుయోధనుని సం | గ్రామంబు తెఱంగుఁ జూడఁ గా నెవ్వరి యం దేమే నధికతఁ దోఁచెడి? | నీమది నున్నట్లు చెప్పు నీరజనాభా!’ |
268 |
| చ. |
అన విని శౌరి యిట్లనియె నర్జునుతోడ ‘గురూపదేశ సం జనితసమన్వయంబు సదృశంబ తలంపఁగ నిద్దఱందుఁ; బా వని మెయి లావు పెద్ద; కురువల్లభుఁ డారయఁ గౌశలంబు పెం పున నధికుండు తత్పరతఁ బూని శ్రమం బధికంబు సేయుటన్. |
269 |
| ఆ. |
లావు గలిగి మొక్కలమ్మునఁ గీచకా | రాతి సొచ్చి ధార్తరాష్ట్రు వెరవు వలన నొచ్చుచున్నవాఁడు గావున ధర్మ | సంగరమున నరిది జయము గొనుట. |
270 |
| వ. | అన్యాయంబునం జంపువాఁ డింతియ మాయలు గల పగఱ మాయాప్రకారంబులం బరిమార్చుటయ తగు; నింద్రునివృత్ర వధ వ్యాపారంబు వినమె? జూదంబునప్పు డనిలసుతుండు సుయోధనుతొడలు విఱుగ నడుచువాఁడ నని ప్రతిన వట్టినవాఁ; డది యట్లుండె; గదా యుద్ధంబు నాభికి దిగువ యైన శరీరభాగంబు నొప్పించుట ధర్మంబుగా దది యొండుమైఁ గండడఁచి మఱి పరిభవరూపంబుగ నూరుభంగంబు సేసి ప్రతిజ్ఞ నెఱపువాఁ; డిది తలంపునం బెట్టక పెనంగె నేని ధర్మనందనునకు దైన్యంబు దెచ్చు; నట్లగుటఁ బూనికి పేర నూరులు భంజించి వధియించుట తప్ప నొం డుపాయంబు లేదు; ధర్మనందనునివలన మనకు భయం బావహిల్లె; నెట్లనిన భీష్మద్రోణప్రముఖబలవదరాతులం బొలియించుటం జేసి జయంబును యశంబునుం జేకుఱి యున్న యెడ నవి సందిగ్ధంబు లైనయట్లు గా నొకని జయించి సామ్రాజ్యంబు గొనుమని దుర్యోధనుతోడం బలికి, యతనితోడం గదాసమరంబునకు భీమసేనుం జొనిపె; నింత నిర్బుద్ధి యగునె? హతబంధుమిత్ర పరివారుండై రాజ్యంబునం దాస విడిచి మడువు సొచ్చినవాని వెదకి వెలార్చి యెక్కటికయ్యంబునకుఁ బిలుతురే? పదుమూఁడు వత్సరంబులు మత్సరాధికుం డగునగ్గాంధారేయుండు భీము జయించుటకయి గదాపరిశ్రమం బాచరించె; నూర్ధ్వతిర్యగ్గతి సముల్లాసంబున మెఱయు చున్నవాఁ; డీభీమునకుం బెద్దకాలం బేని శ్రమంబు లే దిమ్మహాభాగుండు ధర్మంబు దొఱంగియైన నిక్కులపాంసనునిం బిలుకుమార్పకున్న నింక నించుక సేపునకుఁ దాన తెగుఁ; దెగిన, మీకు నెల్ల నిప్పాపాత్ముండు రా జగుట కోర్వవచ్చునే?’ యనుటయు. | 271 |
| క. |
విని క్రీడి యపుడు మారుత | తనయుఁడు దనుఁ జూడ నూరుతలము కరతలం బున నప్పళించె; నతఁడును | గనికొనియెను సన్న యగుటఁ గౌరవముఖ్యా! |
272 |
| వ. | కనికొని ‘యధర్మం బైన నూరుభంగంబు సేయు మని కృష్ణానుమతి జిష్ణుండు వనిచె; నాకు నొండుమెయి నెట్లునుం బగతు పాటు లేక తక్కెనే నవ్విధం బాచరింతుఁ గాక! యని మనంబున నిశ్చయించి, వివిధగతులఁ జరియింపం గురుపతియు బాహుచిత్ర ప్రచారంబుల నుల్లసిల్లఁ దత్సంగ్రామం బామిషార్థిగరుడ ద్వయసమరంబు చందంబున దర్శనీయం బై యుండె; నట్టియెడ. | 273 |
| ఆ. |
పాండురాజసుతుఁడు పటుతరోల్లాసి యై | వైచుటయును ధరణివల్లభుండు తొలఁగ దాఁటె రయము దలకొని గదఁ బుచ్చి | కొనియె నాబకాంతకుండు నుఱికి. |
274 |