| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
ఆదిసృష్టిఁ బ్రధాన మను తత్త్వ మంబుజా | సనుఁడు గల్పించి చేతన మొనర్చె క్షరమండ్రు దానిఁ దత్పర మగు తత్త్వంబు | నక్షర మనియును నమృత మనియు నార్యులు సెప్పుదు రమ్మిథునంబున | యందు సంపన్నంబు లఖిలభూత జాలంబులకును సంజనకంబులైన బీ | జము లిది శ్రుతివాక్యసంభృతార్థ |
|
| తే. |
మతఁడు గలిగించె గమనము నాగమనము | జీవరాశికిఁ గావున నా విధమున నది భ్రమించుచునుండుఁ బుణ్యాతిశయము | కతన జీవాత్ముఁ డొకఁడు దన్ గాంచినపుడు. |
199 |
| క. |
విను సుఖదుఃఖము లచిరము | లనియుం దను వశుచి యనియు నఖిలపదార్థం బును నశ్వర మనియుం గ | ర్మనిరూఢత జాడ్య మనియు మది నూహించున్. |
200 |
| క. |
ఊహించి తన్నుఁ గప్పెడు | మోహావేశంబు ద్రోచి మోక్షపదప్రా ప్తీహను సంసారాబ్ధ్యవ | గాహనముం జేయకుండు గతకల్మషుఁడై |
201 |
| వ. | అని పలికి వెండియు. | 202 |
| క. |
జనిరుగ్జరామరణములు | గని ప్రకృతివిధంబు లెస్సగా నెఱుఁగుటఁ ద జ్జనితక్లేశమునకు విసి | విన మర్త్యులు పరమపదము వెదకుదు రనఘా! |
203 |
| సీ. |
అట్టివా రిట్టి వా రగుట మేల్ గనికొని | యజనంబుఁ బూతంబు నైన చోట నాసీనుఁడై హృదయంబున నొక చింత | యును లేక యూఱడి యుండి యడరి తోఁచు తోఁపుల నెల్లఁ దోడ్తో నడంచి ని | రాలంబనుం డైన యతఁదొకండు సర్వమిత్రుండును సర్వసహుండును | నిర్జితేంద్రియుఁడును నిర్భయుఁడును |
|
| తే. |
గామకోపహీనుఁడు శమఘనుఁడు నైన | యతఁ డొకండు మానాభిమానాపగమము సర్వభూతాత్మకత్వదర్శనముఁ గలుగు | నతఁ డొకండు వీరలు గందు రనఘ! ముక్తి |
204 |
| సీ. |
ఒలయు లాభాలాభములుఁ బ్రియద్వేషంబు | లును సుఖదుఃఖములును సమంబు లై యుండు నెవ్వని కాసపాటును నవ | జ్ఞతయు నెందును లేక సర్వధర్మ తంత్రలోలుండును ధర్మశీలుండుఁగాఁ | డెవ్వఁడు గూర్చు వారొవ్వకుండు వారని తనకు నెవ్వరు గల్గక త్రివ | ర్గేచ్ఛ యెవ్వనిచేత నీడ విడువఁ |
|
| తే. |
బడు నకర్మభావంబుఁ దాపత్రయాప | గమము వైరాగ్యసుస్థిరత్వమును గల్గు నరయ నెవ్వని యందేని యతఁడు నతఁడు | నతఁడు నతఁడును గందు రవ్యయపదంబు. |
205 |
| క. |
అసమాలంబ మశబ్దము | రసగంధస్పర్శరూపరహిత మగుణ ము ల్లసితగుణమగు వెలుఁగు న | భ్యసననియతి పరుఁ డొకండు వడయుం బుత్రా! |
206 |
| తే. |
సర్వసంకల్పవర్జనశాలి యగుచుఁ బరమశాంతి చిత్తంబునఁ బట్టుకొల్పు నతఁ డనింధనానలము న ట్లల్లఁ బొందు | వికృతివర్జితయైన నిర్వృతిఁ గృతాత్మ!’ |
207 |
| వ. | అనినిర్దేశించి ‘యోగిజనానుభావ్యంబైన నెలవెఱింగించెద’ నని పలికి ‘యోగులు దాన నాత్మదర్శనానందంబు నొందుదు రవధానంబున నాకర్ణింపు’ మని యిట్లనియె. | 208 |
| ఆ. |
అనఘ! ముంజగర్భ మగు నిషీకనిదర్శ | నంబు గాఁగఁ గనుఁగొనంగ వలయుఁ దనువు ముంజ యాత్మ దదిషేక నిష్కర్ష | విధము సుమ్ము! యోగవిదుని వెరవు. |
209 |
| క. |
తనువువలన నిష్కర్షం | బొనర్చి జీవాత్ముఁ గాంచు యోగివరుం డ య్యను వొదవి యట్లు దన్నుం | గనినప్పుడు జననమరణగతులం దొఱఁగున్. |
210 |
| క. |
ముక్తుండు జరామరణ వి | యుక్తుండై హర్షశోకయోగ మెడలి స ద్భక్తులకును నప్పద మీ | శక్తుండగుఁ జువ్వె బ్రఙహ్మచర్యము పేర్మిన్. |
211 |
| ఆ. |
ఒడలి యస్థిరత్వ మూహించి యాత్మయం | దధికనిష్ఠ గలుగు నతఁడు సకల భూతకోటివలనఁ బొందఁడు భయము రా | గాది దుఃఖములకు నగపడండు |
212 |
| క. |
విను యోగయుక్తునకు శస్త్రనిహతి జలబాధ యగ్నిదాహము మొదలై చను నవ్వికారములు లే | వనఘ! యతఁడు గోరఁ డైంద్ర మగు పదమైనన్. |
213 |
| క. |
తనయంద తన్ను లెస్సగఁ | గనుటం గడచిన సుఖంబు గలుగదు లోకం బున నెందు దాని కయ్యెడు | వినుతానుష్ఠానమునకు విసువమి వలయున్. |
214 |
| వ. | అయ్యనుష్ఠానం బెట్టిదనిన. | 215 |
| క. |
తన యెఱిఁగిన తెరువున నె | మ్మన మంతర్వృత్తిఁ జేసి మఱి బాహ్యగతిన్ జన నీ కుండఁగ నది యెం | దనువునఁ బడు నిలుపవలయు నచ్చట దానిన్. |
216 |
| వ. | అది యెట్లనిన. | 217 |
| తే. |
దంతములు జిహ్వ గుత్తుక తాలుతలము | కంఠనాళంబు హృదయంబు గణ్యచరిత! మఱియు లోపల నెచటికి మనసు మెలఁగెఁ | దాఁ గదల్పక యచటన యాఁగ వలయు.’ |
218 |
| వ. | అని చెప్పెనని చెప్పి నాతో శిష్యుం డని మఱపునం బలికి తలంచికొని కొండొక విచారించి నవ్వుచు నవ్విప్రుండు నా మొగంబు సూచి ‘యచ్యుతా! యా సిద్ధుం డనువాఁడ నేన కదా నీ యెఱుంగని యదియునుం గలదె? మఱియు నక్కాశ్యపనామధేయుం డడిగిన తెఱంగు దానికి నుత్తరంబు నా యిచ్చిన విధంబును విను’ మని యిట్లనియె. | 219 |
| ఆ. |
‘కేలు మొగిచి వినయశాలి యమ్మేధావి | విశదకరుణఁ జెప్పవే మహాత్మ! పరమమోక్షకరణ పరిణతంబైన యు | దాత్త సూక్ష్మసుకరధర్మ’ మనియె. |
220 |
| వ. | అనిన ‘నవహితుండవై యాకర్ణింపు’మని పలికి యిట్లంటి. | 221 |
| ఆ. |
‘పాలకడవ పెక్కు పసులలో డించిన | యాతఁ డెట్లు దాని నరసికొనుచు నుండు నట్లు లోన నునిచిన మనసు నే | మఱక యాత్మ వెదకు తెఱఁగు మేలు. |
222 |
| క. |
ఈ తెఱఁగున నుద్యుక్తుం | డై తెలి వొందిన మనంబు నతులవివేక ఖ్యాతి మరిగించి శశ్వ | ద్ద్వోతితమగు బ్రహ్మముం జతురయోగి గనున్. |
223 |
| తే. |
అయ్యనాదితత్త్వ చక్షురాదికంబు | లైన యింద్రియములకు గ్రాహ్యంబు గాదు సకలమలనిరాసాజ్య ప్రసన్నతర మ | నఃప్రదీపంబు తద్దర్శనం బొనర్చు. |
224 |
| క. |
కలయంగ నెల్ల యెడలం | దలలును లోచనములును బదంబులు హస్తం బులునై యా తత్త్వం బు | జ్జ్వలభంగి వెలుంగ యోగవంతుఁడు గాంచున్. |
225 |
| క. |
తను వేర్పరించి కేవల | మును శాంతము నైన తత్త్వమును సంతతమున్ గనుచున్నఁ దన్ను నెఱుఁగం | గనుఁజీఁకటిఁ బాపు వెలుఁగు గలుగుం బుత్రా! |
226 |
| వ. | బ్రహ్మవిద్యారహస్యంబు సర్వంబు నీకుం జెప్పితి; నీ వింక సుఖివి గమ్ము; నేనుం బోయెద’ నని యామంత్రణంబు సేసిన నపాస్తసంశయుం డయి యా శిష్యుం డరిగె; నిట నిన్ను దర్శింప వచ్చితి’ నని పలికి యమ్మహాద్విజుం డంతర్హితుండయ్యెఁ; బరమహితంబైన యా వాక్యసంతానంబు సమవధానంబున వినంబడియెనే పాండవ మధ్యమా! నాఁడు రథస్థుండ వయిన నిన్ను నేతదీయంబైన యర్థజాతంబు వినిపించితి’ నని నప్పురుషవరుతోడం బురుపోత్తముండు వెండియు నిట్లనియె. | 227 |
| సీ. |
వ్యామిశ్రమతి యగు నతనికి నకృతాత్ముఁ | డైనవానికి నవధానరహిత చేతస్కునకు నిది సెప్పఁగాదే! దొల్లి | దెలియంగఁ జెప్పితి దేవతలకు గాండివి నీవు దక్కఁగ నిది మర్త్యు లా | కర్ణింపఁ దగువారు గలరె యొరులు? పరమరహస్య మీ పరిపాటి దీన న | య్యమృతవస్తువు గని యఖిలదుఃఖ |
|
| ఆ. |
ములుఁ దొఱంగి నిత్యముక్తత వెలుఁ గొందు | నరుఁడు వైశ్యులైన నాతులైన శూద్రులైనఁ గండ్రు సువ్వె యిమ్మెయి ముక్తి | బ్రాఁతె బ్రాహ్మణులకు రాజులకును? |
228 |
| క. |
వినిపించితి నిను బోధం | బునకు నుపాయంబ ఫలసముదయము మోక్షం బును సౌఖ్యనిర్ణయము ని | క్కనుట గడవ సుఖము లొండు గలవే యరయన్? |
229 |
| ఆ. |
శ్రద్ధ గలిగి లోకసంగ్రహ సంగంబు | నీడ విడిచి యెవ్వఁ డీ యుపాయ ముల భజించు వాఁడు మోక్షలక్ష్మికిఁ బతి | యగు నొకింత సందియంబు వలదు. |
230 |
| క. |
చెప్పం గలయది యెల్లను | జెప్పితి; నీ కింత గడవఁ జెప్ప నొకఁడు లేఁ డిప్పాట నెలల నాఱిటఁ | జొప్పడు యోగంబు నియతి శుద్ధాత్మునకున్.’ |
231 |
| వ. | అని యిట్లు కృష్ణుండు జిష్ణునకు నధ్యాత్మవిషయంబులగు వాక్యంబులు సెప్పె నని చెప్పిన విని యన్నర నారాయణులు మఱియు నెవ్విధంబున వర్తించి రని యడుగుటయు. | 232 |