పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
ఆశ్వాసాంతము
చ. గుణసమతానుభూతిహృతికోవిదసారవివేకభావ్య! చా
రణ సురసిద్ధసాధ్యఖచర ప్రముఖాఖిల భూతసేవ్య! వీ
క్షణకలనా కృతార్థమునిసార్థ బహుస్తుతివాక్యరత్నభూ
షణ! మహనీయ ఖేలన! నిసర్గకృపాకృత లోకపాలనా!
233
క. నవ్యత్వ పురాణత్వ ద | శావ్యపనయదుర్నిరూప సౌందర్యా! వే
దవ్యాసవాక్ప్రకాశిత! | దివ్యధురాధుర్య! యోగిధీసత్కార్యా!
234
మాలిని భువనభవన దీపస్ఫూర్తి తేజోవిలాసా!
సవితృశశిమయత్వ స్ఫారచక్షుర్వికాసా!
వివిధనిగమవిద్యావేద్యసూక్ష్మప్రభాసా!
పవనవిజయలీలాప్రౌఢ చేతోవిలాసా!
235
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజ తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున నశ్వమేధపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. 236
అశ్వమేధపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )