పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
అంతర్యాగప్రకారంబు నిరూపించి చెప్పుట (సం. 14-20-18)
వ. ఇవ్వాయువు లేనును మనంబును బుద్ధియుంగూడ నీ యేడును వైశ్వానరునకు జిహ్వలు; వైశ్వానరుం డనఁ బ్రాణుల దేహంబులం దగ్నిరూపంబున వెలుంగుచున్న యాత్ముండు; ఘ్రేయంబును భక్ష్యంబును దృశ్యంబును స్పృశ్యంబును శ్రావ్యంబును మంతవ్యంబును బోద్ధవ్యంబును నగు నీ సప్తసంఖ్య సమిధలు, ఘ్రాతయు, భక్షయితయు, ద్రష్టయు, స్పృష్టయు, శ్రోతయు, మంతయు, బోద్ధయు నయిన యీ యేడ్వురును వరుసన ఘ్రేయాదులయిన హవిస్సులేడింటిని వేల్చుఋత్విజు; లిదిసప్తహోతృవిధానప్రకారంబు వైశ్వానరు వదనంబులు పదియు దిగ్వాయుసూర్యచంద్రపృథివీపావకశక్ర విష్ణుప్రజాపతిమిత్త్రాత్మకంబులు; శబ్దస్పర్శరూపరసగంధ వక్తవ్యకర్తవ్యగంతవ్యవిసర్గానందంబులు హవిస్సు లీ పదింటినిం గ్రమంబున నాహుతులు సేయుహోతలు శ్రోత్ర త్వక్చక్షుర్జిహ్వాఘ్రాణవాక్పాణిపాదపాయూపస్థంబు లయిన దశేంద్రియంబు; లిత్తెఱంగు దశహోతృవిథి; యీ రెంటిని నెఱింగి యిం దేవిధంబున నేనియు జీవాత్ముం డుపద్రష్టగా నంతర్యాగంబు నడపు యోగి జనంబులు జననమరణవిముక్తులగుదురు. బహిర్యజ్ఞపరులు గమనాగమనభ్రమణంబులం బొందుచుండుదు’ రని చెప్పి వెండియు. 013
క. విను ప్రణవాదికరూప | త్వనిరూఢిం బుట్టు వాక్కు దాని వెను చనున్‌
మనము పురుషార్థబుద్ధిన్‌ | బనుపడి’ యని చెప్పె సతికి బ్రాహ్మణుఁ డనఘా!
014
క. విని యా విప్రునితో ని | ట్లను నయ్యెలనాగ ‘మన మనఘ! ప్రేరేఁపం
గ నెగయు వాక్కు తదనువ | ర్తనము మనంబునకు నెవ్విధంబునఁ గలుగున్‌?’
015
వ. అనవుడు నతండు 016
చ. ‘మనసు నుదానవాయువును మానిని! కూడి వెలార్చు వాక్కు నా
త్మునివలనన్‌ భవద్వచనమున్‌ జనతానుభవంబు చొప్ప యై
నను విను కార్యముం గుఱిచినం దగ వాగనువర్తనంబు సే
యన వలసెన్‌ మనంబునకు నమ్మెయి గల్గుట నట్లు సెప్పితిన్‌.
017
వ. అని పలికి మఱియు నమ్మహీసురోత్తముం డిట్లనియె. 018
క. మనసును వాక్కును మాలో | ననఘచరిత! యెక్కు డెవ్వ? రని యంభోజా
సను నడిగిన నతం డెక్కుడు | మన మనవుడు వాని యక్కమలభవుతోడన్‌.
019
వ. ‘ఏను నీకుం గామదోహిని నయి యుండ న న్నెట్లు తక్కువగాఁ బలికి?’ తనిన నతండు ‘స్థావరంబును జంగమంబును నన నాకు రెండు మనస్సులు గల వందు స్థావరంబు నాయొద్దను జంగమంబు నీకడను నిలుచు; భవద్గోచరత్వంబునం బరఁగు వర్ణంబు మంత్రంబు స్వరంబు జంగను మనస్సుగా నెగడు; దానికంటె నీ వెక్కుడు నీకంటె నెక్కుడు స్థావరమనస్సు గావున నిమ్మాట యాడంగలదానవు గా’ వని నిర్దేశించె. 020
క. విను మమ్మెయి నిర్దేశం | బున నవ్వాగ్దేవి మూర్ఛవోయినయ ట్లే
మిని బలుక కుండి పదపడి | వినయంబున నజుని శరణువేఁడె లతాంగీ!’
021
వ. అనిన బ్రాహ్మణి పతితో ‘బ్రహ్మమాటకుం గొఱవొయిన వాణి యేమిటం దేఱె?’ నని యడిగిన బ్రాహ్మణుం డిట్లనియె. 022
క. ‘ప్రాణాపానంబుల యెడ | వాణి నిలుచుఁ గాన ప్రాణవాయు వొదవి తత్‌
క్షీణత్వ ముడిపె నది గీ | ర్వాణజ్యేష్ఠప్రభావవాసిత యగుటన్‌.
023
వ. ఇట్టి వని వాఙ్మనఃప్రకారంబు లెఱుంగుట మోక్షంబునకు మూలం; బింకను వాణి మనస్సుల తెఱంగు సెప్పెద వినుము. 024
తే. ప్రాణుఁ బొదువుట వాణి యపానుఁ జెంది | తాను దాన భూతాత్మ యై తనువు విడిచి
వ్యానచేష్టిత సర్వసంవ్యాప్తి నొంద | మనసు సుస్థితి నొందు సమాను నందు.
025
వ. మనసు సుస్థితం బొందుట ముక్తికిం గారణ’ మని చెప్పి వెండియు. 026
సీ. ‘ఘోషిణి నాఁగ నఘోషిణి యన రెండు | దెఱంగులు గలిగి వాగ్దేవి పరఁగు
నం దఘోషిణి గరీయసి యుత్తమరసంబు | గోవు చందంబునఁ గురియుచుండు
నవ్యయరూప దివ్యప్రభావోజ్జ్వల | బ్రహ్మవాదిని యిట్లు బ్రాహ్మివిధము
గనుట మహానందకర’ మని చెప్పి య | వ్విప్రుండు మఱియు నవ్వెలఁదితోడ
 
తే. ‘వినుము ఘ్రాణాదికము లైదు మనసు బుద్ధి | యొక యధిష్ఠానమున నుండియును నెఱుంగ
వబల! యొండొంటి విషయంబు నలమికొనఁగ’ | ననిన ‘వివరింపు మా తెఱం’ గనియె నింతి
027
వ. అనుటయు నయ్యవనీదేవుం డయ్యువిద కిట్లనియె 028
సీ. ‘గంధంబు ఘ్రాణంబ కాని తక్కిన యాఱు | నధిగమింపఁగ నోప, వధిగమించు
రసము జిహ్వయ యితరము లాపనికిఁ గావు; | రూపంబుఁ జక్షుస్స యోపు నెఱుఁగఁ
బెఱయని యెఱుఁగవు తెఱవ! సంస్పర్శంబుఁ | గాంచుఁ జర్మంబ తక్కటివి గానఁ
జాలవు; శబ్దంబుఁ జాలుఁ బట్టంగ శ్రో | త్రంబ; యన్యములు దత్కరణమునకు
 
తే. వెరవులేవు; సంశయిత సంవేదనంబు | మనసు కృత్యంబ యిక్కార్యమునకు నొండ్లు
సొరవు; నిష్ఠ బుద్ధిన యగుఁ జొరఁగ నేర; | విత్తెఱంగున కపరంబు లెఱిఁగి కొనుము.
029
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )