పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము
ఇంద్రియ మనఃపరస్పరసంవాదప్రకారము (సం. 14-22-13)
వ. ‘అని చెప్పి, మనస్సునకు నింద్రియంబులకుం దొల్లి గలిగిన సంవాదంబు సెప్పెద నాకర్ణింపు ‘మింద్రియంబులు మనస్సుతో నేము నీవు నొక్క రూప’ యనుటయు మనస్సు వాని కిట్లనియె. 030
చ. ‘చన దిటులంట గం పెఱుఁగఁ జాలదు నాసిక, జిహ్వయుం జవుల్‌
గొన వెర వేదు, రూపు గనుఁగొంటకుఁ గన్ను వలంతిగాదు, సోఁ
కు నెఱుఁగు శక్తి చర్మమునకుం బ్రభవింపదు, శబ్దజాతము
న్వినఁ జెవి కల్ప మేనియును నేర్పొడఁగూడదు నేఁ దొఱంగినన్‌.
031
వ. నిజంబుగా నేను దొఱంగితి నేని. 032
ఆ. అప్రయోజనంబులై యుండు నాఱిన | నిప్పులట్లు శూన్యనిలయములును
బోలె మీ స్వరూపములు గాన మనలోన | నెక్కుడేన సూవె యింత నిజము.’
033
వ. అనిన విని యింద్రియంబులు మనంబున కిట్లనియె. 034
సీ. ‘ఇంతవ ట్టిట్టిద యిట్లైన యంతన | కలుగనేర్చునె యధికత్వ మేము
వెలిగాఁగ? నీ వొక విషయంబు నేనియు | ననుభవించితయేని నధిక మగుట
గానంగ వచ్చు? మాలో నొకం డడఁగిన | ననుభవింపుము తదీయార్థ; మట్లుఁ
గాక ఘ్రాణంబున గంధంబ జిహ్వ ర | సంబ చక్షువున రూపంబ వినుము
 
ఆ. చర్మశక్తిఁ జేసి సంస్పర్శ విషయంబ | శ్రోత్రయుక్తి శబ్దమాతృకంబ
కానియొంట నొంటిఁ గబళింపఁ జాల వె | ట్లధికతా నిరూఢి కాసవడితి?
035
క. మును మే మాలంబించిన | వెనుకఁ గదా నీకు ననుభవింప వశం? బో
మనసా! నీ వెంగిలి కా | దనుమా యవ్విషయ మెక్కు డయ్యెడు మనలోన్‌.
036
క. నీ వడఁగిననుం బ్రాణముఁ | గావఁగ మాయందు బోధకం బగు ద్రవ్యం
బావర్తింపఁగఁ జేయుట | గావించును నీకుఁ దెలివు గనికొను మిదియున్‌.
037
సీ. అట్లు గా దిట్లని యనుశాసనము సేయఁ | గడు నేర్చు శిష్యులకడకుఁ బోయి
వినిపింపఁ దొడఁగి యవ్వినుతార్థములు వార | లుగ్గడింపఁగఁ గను నొజ్జవోలె
మముఁ గొని విషయోత్కరము నీవు భోగ్యంబు | గాఁ జేసికొందు నీ కలలు గన్న
యప్పుడు మా లేమి నవ్విషయంబు బొం | కైన వాకిలిలేని యాలయంబుఁ
 
ఆ. జెందిమరలినట్లు సేడ్పాటు వొరయుదు | గాక సత్యభుక్తి గలదె నీకు?
నింతపట్టు గాన్పు మేమును నీవును | గలసి పరఁగ భోగకలన గలుగు.’
038
వ. అని యివ్విధంబున మనంబును నింద్రియంబులును సంవాదంబు సేసె’ నని యప్పురుషవరుం డా వర వర్ణినితో ‘వేఱొక్కండు విను’ మని యిట్లనియె. 039
సీ. ‘ప్రాణప్రభృతులగు పవను లంభోరుహ | గర్భుని నొక్కటఁ గానఁబోయి
‘యెక్కుడు మాలోన నెవ్వరు?’ నావుడు | నవ్విభుం ‘డెవ్వార లడఁగ నడఁగు
దురు పెఱవార? లెవ్వరికిఁ బ్రవర్తన | మొందిన నెల్లవారును జరింతు
రఙధికు లందఱకును నట్టి వారలు మీరు | సనుఁ’ డని పలికినఁ జనక నిలిచి
 
ఆ. ప్రాణుఁ డాది గాఁగ బవనులందఱుఁ దమ | వలన నవ్విధంబు గలుగఁ దెలుప
నాతఁ ‘డే నెఱుంగనా? యది యట్టిద | వినుఁడు మీ విశేషవృత్తి భంగి’.
040
తే. ‘ఎప్పు డెవ్వరివలన నే చొప్పు గలుగు | నపుడ వారెక్కు డగుదు రన్యోన్యమిత్త్ర
భావమునఁ దాల్పుఁ డొండొరుఁ బవనులార! | పొరిఁ బరస్పరభావనాపరుల రగుఁడు.
041
వ. ఇత్తెఱంగున మీకు భద్రంబగుం బొం’ డని పుచ్చె న ట్టుపదేశించిన బ్రహ్మవాక్యంబుల వాయువులు సమత నొందె’నని చెప్పి, ‘వాయువిషయం బైనయది నారద దేవమత సంవాదంబు సెప్పెద నాకర్ణింపు’ మని బ్రాహ్మణుండు బ్రాహ్మణీ కిట్లనియె. 042
తే. ‘దేవమతుఁ డను విప్రుఁడు దేవముని వ | రేణ్యుఁ డగు నారదుని నొక్క పుణ్యభూమిఁ
గాంచి వినతుఁడై యాతని కరుణ వడసి | భక్తిరసము పొంగారఁ దత్ప్రాంతమునకు.
043
సీ. అల్లన చన నాతఁ డాదరంబున ‘నిందు | ర మ్ముండు’ మనుచుఁ గరమునఁ జూపు
నెడ సమాసీనుఁడై కడు వినయంబున | హస్తముల్‌ మొగిచి దయాసమగ్ర!
యెఱిఁగింపు పవనంబు లేనింటియందును | జాయమానంబగు జంతువునకుఁ
దొలితొలి యెద్ది దాఁదొడఁగు వర్తింపంగ?’ | ననవుడు నారదుం డతనితోడ
 
తే. ‘వాయు వెయ్యది గర్భసంవాసమునకుఁ | జొనుపు జీవునిఁ దజ్జంతుజననవేళఁ
దొలుత దాని కనంతరకలిత మైన | మారుతంబు ప్రవర్తించు: మఱియు వినుము.
044
తే. పురుషునందు సమానంబుఁ బొలఁతియందు | వ్యానమును జువ్వె పొడమించు వరుస ననఘ!
శుక్లమునకు శోణితమునఁ జూలు గల్గు | నయ్యుగంబును విధి చెయ్ది నమరఁ బొంద.
045
క. విను సృష్టశోణితంబునఁ | బనుగొను శుక్లంబువలనఁ బ్రాణుఁడు దగ వ
ర్తన మొందుఁ బ్రాణశుక్లము | లనూనహేతువులుగా నపానుఁడు నడచున్‌.
046
క. చనుఁ బ్రాణుఁ డధోగతి నూ | ర్ధ్వనిరూఢి నపానుఁ డివ్విధము గల యీ రెం
టను నగ్నిమయోదానం | బును వ్యానంబును సమానమును వర్తించున్‌.
047
ఆ. పావకుండు సర్వదేవాత్మకుండు ప్రా | ణంబునకు నపాననామమునకు
నంతరమున వెలుఁగు నా భవ్యమూర్తి యు | దానరూప మండ్రు తజ్జ జ్ఞనులు.
048
సీ. విను మహోరాత్రంబులును శుభాశుభములు | సత్యానృతంబులు సదసదాహ్వ
యములును నైన ద్వంద్వములు ప్రాణాపాన | ములకు నామాంతరములు; దదీయ
మధ్యవర్తిత నొప్పు మహనీయ వహ్ని; యుదానంబు దాని నిర్ద్వంద్వభావ
మాంతరయాగ విద్యాప్రవీణులు గండ్రు | పరమశాంతి యనంగ బ్రహ్మ మనఁగ
 
తే. నరయ భేదంబు లే దన్న యట్టులుండు | నమ్మహావస్తువును నుదానాకృతియ య
నంగఁ జెవియార విందుము నలినగర్భు | చేత’ నని దివ్యముని యిట్లు సెప్పెఁ గరుణ.
049
వ. అని చెప్పి ‘యింద్రియ మనః పవనంబుల భంగులు గనుంగొనుట యీ తత్త్వంబులకుఁ బరమంబైన తత్త్వంబు’ గనుటకుఁ గతంబై యుండు’ నని పలికి యద్ధరామరుం డా రామారత్నంబును సదయంబుగా నవలోకించి ‘యుత్తమరహస్యంబు సెప్పెద నాకర్ణింపు’ మని యిట్లనియె. 050
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )