పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
ఉదంకుండు కుండలంబు లిచ్చి యహల్యను సంతోషపఱచుట (సం. 14-57-53)???
చ. అతఁడును వారిఁ బోఁబనిచి, యగ్నికి భక్తిఁ బ్రదక్షిణంబు చే
సి, తగ నమస్కరించి, విలసిల్లఁగఁదేజము, ప్రీత చిత్తుఁడై
యతలము నిర్గమించి రయ మారఁగ వచ్చి యహల్యఁ గాంచి ‘తె
చ్చితి నివె కుండలంబు’ లని చే నిడి, భూస్థలిఁ జాఁగి మ్రొక్కినన్‌.
113
తే. ఆయమయు గౌతముండు నత్యాదరమునఁ | గౌఁగిలించుచు దీవించి గారవింప
నతఁడు నమ్మునిపతికిని నయ్యమకును | బెక్కుమాఱులు భక్తిమై మ్రొక్కి నిలిచి.
114
క. ‘మీకరుణఁ గాక తగుమెయి | నీ కుండలములు పరిగ్రహించుట నడుమన్‌
వైకృతి యొలసినఁ దలఁగుట | నా కొలఁదియె?’ యనియె వినయనమ్రుం డగుచున్‌.
115
వ. అనిన విని వార లత్యంత సంతుష్టాంతరంగులై; రగ్గౌతముం డతని కిట్లనియె. 116
ఉ. ‘నీ చరితంబు చిత్రమహనీయము; మిత్ర సహక్షితీశ్వరున్‌
నీచతఁ బాప, నాగ మపనీతము చేసిన కుండలద్వయం
బాచతురత్వ మా బలిమి యాదృఢ నిశ్చయ మట్టు లొప్ప ధ
ర్మోచిత లీలఁ దేర నొరుఁ డోపునె! యేను నిజంబ పల్కితిన్‌.’
117
వ. అనియె; నయ్యుదంకుం డట్లు తన మహాతపంబు బలిమిం బరాక్రమించి, యనన్య సులభంబులగు కుండలంబు లాహరించి, గురుజన మనోరథసిద్ధి గావించె; నా భృగువంశ మహత్తరు మహానుభావం బిట్టి’ దనిన విని జనమేజయుం ‘డమ్మహాత్మునకు వరం బొసంగి చనిన వాసుదేవు ననంతర వృత్తాంతంబు మునిసత్తమా! యెఱింగింపవే’ యని యడిగి, నవ్విభునకు వైశంపాయనుం డిట్లనియె. 118
సీ. ఆ భార్గవోత్తము నట్లు వీడ్కొని కృష్ణుఁ | డరిగి యలంకృత మైన నిజపు
రము సొచ్చునప్పుడు రైవత కాచల | యాత్రామహోత్సవ మఖిలజనులుఁ
గొనియాడుచుండి, యగ్గోవిందు సందర్శ | నంబున నుత్సవోన్మత్త భావ
మిమ్మడియై ప్రమోదమ్మునం దేలి; ర | ద్దేవదేవుఁడు వసుదేవుఁ గాంచి
 
తే. దేవకీదేవి బలభద్రదేవుఁ దక్కుఁ | గలుగు వృద్ధ బాంధవులను గని వినీతిఁ
దత్తదుచిత మనోజ్ఞవిధాసమంచి | తాచరణములు నడపెఁ బ్రియం బెలర్ప.
119
వ. వారలందఱకు ధర్మనందను చెప్పిన చొప్పునఁ బ్రణామాది యోగ్యోపచారంబు లాచరించె; ననుజ తనూ జామాత్య భృత్యులు దన్నుం గనినం బ్రీతి వాత్సల్య సంభావనా బహుమానంబులు మెఱయ నాదరించె; సాత్యకి సుభద్రలం దగు తెఱంగులం దగిన వారలం గానిపించె; నట్లు సకలజన ప్రమోదాపాది యైన దామోదరు నత్యంత సమీపాసనుం జేసికొని వసుదేవుడు ‘భారతరణప్రకారంబు యాతాయాత జనంబులచేత వింటిం, బ్రస్ఫుటంబుగా వినవలతుం జెప్పవే’ యని యడిగిన నచ్యుతుం డతని కిట్లనియె. 120
క. ‘అది యతివిస్తారము; పె | క్కు దినంబులు చెప్పఁ బట్టుఁ; గొంత దగం జె
ప్పెద నేఁ బ్రధాన పురుష స | ముదయ సమర విధము లఘుతరోక్తులఁ దెలియన్‌.
121
సీ. కౌరవసైన్యమేకాదశాక్షౌహిణీ | కలితంబు; దానికిఁ గట్టె వీర
పట్టంబు భీష్ముఁ; డా ప్రభువున కెదురొడ్డి | రెలమిమైఁ బాండుపుత్త్రులు శిఖండి;
నక్కడ సప్త సంఖ్యాక్షౌహిణీక మ | నీక; మిమ్మాడ్కిఁ బన్నిన బలద్వ
యంబును ఖేచరు లచ్చెరువడఁ బోరెఁ; | గాండీవి దోడ్పడఁగా శిఖండి
 
తే. యన్నదీనందనునిఁ బదియవు దినంబు | నందుఁ గూలిచె; నుత్తరాయణము వచ్చు
నంతకును మృతి పొందక యాతఁ డుండె | నధిప! శరతల్పమున! గడు నద్భుతముగ.
122
క. గురుఁ డైదు దివసములు ని | ర్భరసమర మొనర్చె; నతనిఁ బరిమార్పఁగ నా
వెరవున నర్జును ప్రాపున | దొరఁకొనియె హుతాగ్నిభవుఁడు ద్రుపదసుతుండున్‌.
123
క. గండున రాధాతనయుఁడు | రెండు దినంబులు పెనంగి గ్రీష్మ సమయ సూ
ర్యుండుంబోలె వెలింగెడు | గాండివధరు శరకరోష్మఁ గ్రాఁగె నరేంద్రా!
124
చ. విను, మఱునాఁడు శల్యుఁ డతివిక్రమతన్‌ సమరం బొనర్చి య
ద్దినము సగంబు సెల్లఁగ యుధిష్ఠిరుచేఁ దెగుడున్‌, బలంబు గై
కొని యనిసేయఁగా శకునిఁ గూల్చె వడిన్‌ సహదేవుఁ; డంతతో
మనమునఁ జేవ దక్కి తనమానము డిగ్గఁగఁద్రావి హీనుఁడై.
125
వ. దుర్యోధనుండు తనతమ్ముల భీమసేనుండు సంగ్రామంబునం దెగటార్చియుండ, భంగంబున కోర్చి పలపలని మూఁక విడిచి, గద చేతంగొని, పాదచారియయి, యొక్కండును బాఱి, యొక్కమడువు సొచ్చి, నీళ్ళు పాషాణమయముగా మంత్రించుకొని, డాఁగి యుండెఁ; బాండవు లెఱింగి పోయి పొదివికొని మర్మభేదంబు లగు దూషణభాషణంబుల నొప్పించిన. 126
ఆ. అతఁడు మడువు వెడలి యనిలనందనుతోడఁ | దగఁ బెనంగి, తద్గదావినిహతిఁ
దొడలు విఱిగి కూలి విడిచెఁ బ్రాణంబు; లి | బ్భంగి జయము గొనిరి పాండుసుతులు.
127
క. గురుసుతుఁడు పాండుతనయ శి | బిర మా రే యడరి పొదివి భీషణవృత్తిన్‌
బొరిగొనియెం గరిఘోటక | నరనిచయము నెల్ల; నే మనం గల దధిపా!
128
వ. ఆ రాత్రి యేనును బాండుసుతులు నచ్చట లేమి నంతపుట్టె; నిట్లు పదునెనిమిది దివసంబులు చెల్లిన సంగ్రామంబున నే మార్వురము సాత్యకియును దక్క మా దిక్కున సమస్తజనంబులు నస్తమించిరి; కౌరవుల దెస నశ్వత్థామ కృప కృతవర్మలు మువ్వురు బ్రదికిరి; యుయుత్సుండు మున్న పాండవుల నాశ్రయించుటం జేసి చావునకుం దప్పె; నిది భారతరణ ప్రకారంబు.’ 129
క. అని చెప్పెఁ గాని యభిమ | న్యుని చా వేర్పడఁగఁ జెప్ప నొల్లఁడ వసుదే
వునకు వగ మిగులుటకు నె | మ్మనమునఁ దా నోర్వకునికి మాధవుఁ డధిపా!
130
వ. దాని నెఱింగి సుభద్ర గద్గదస్వరంబున గోవిందునితోడ ‘నీ యల్లుం డభిమన్యుండు దెగుట మీ తండ్రికిం జెవులా రం జెప్పుమన్నా!’ యని వసుదేవుండు వినం బలుకుచుం బుడమింబడిన వసుదేవాది యాదవజనంబులు మనంబులం గదిరిన క్రొత్త నెవ్వగలం బలవించినం, బద్మనాభుండు వారల నెల్ల నూరార్చి వారణపురంబున సుభద్రయు నుత్తరయు నభిమన్యునిదెస నెత్తిన శోకంబున నాకులత్వంబు నొందిన చందంబును, గొంతితగు మాటల వారిం దేర్చిన తెఱంగును, నెఱింగించి, పాండవు లేవురును వేర్వేఱ యభిమన్యునకై మణికాంచన గవాది వస్తువులు విప్రప్రకరంబుల కొసంగుటయు, మఱియుఁ దటాక కరణాది ధర్మంబు లాచరించుటయుం, జెప్పి, మఱియు ‘దురంబునం దెరలక మరలక యాసౌభద్రుండు రౌద్రమూర్తియై దుర్యోధన ద్రోణ కృపద్రౌణి కృతవర్మ కర్ణాది వీరవ్రాతంబుఁ గలంచి యనేక నృపలోకంబును జములోకంబున కనిచి యనిమిషులు పొగడ నుత్తమలోకంబున కరిగి సుఖియై యున్నవాఁడు; వానికి వగవనేల?’ యనియుం బలికి యిట్లుపశాంతి గావించి. 131
ఆ. బంధులోకమునకుఁ బరమ ప్రియంబైన | యుచిత వర్తనమున నుండెఁ గృష్ణుఁ;’
డని సవిస్తరంబు లగు వాక్యములఁ బ్రీతి | చిగురులొత్త నిట్లు చెప్పి మఱియు.
132
వ. కరిపురంబునం బుట్టిన విశేషంబులు వినుమని పలికి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 133
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )