పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
వ్యాసుఁడు పాండవుల నశ్వమేధయాగోన్ముఖులఁ జేయుట (సం. 14-61-8)
సీ. చుఱచుఱఁ దనచెవుల్‌ సూఁడిన యట్లుగ | నభిమన్యు సంస్తుతి యైన వాక్చ
యము ప్రసంగాధీనమై బంధుజనులందుఁ | బొడముటయును, ధృతి యెడలి తలరి
యుత్తర విలపింప, నత్తన్వియలమట | గనుఁగొని, పాండునందనులు వనటఁ
గూరిన, నచటికిఁ గారుణ్యమూర్తి వే | దవ్యాసుఁ డేతెంచి తగినమాట
 
తే. లాడి, వారలవగ మాన్చి, యశ్వమేధ | విషయవిధులు ప్రసంగించి వేగ తొడఁగుఁ
డని నియోగించి, వా రెల్ల నట్లకాక | యనిన నాతఁ డంతర్హితుం డయ్యె నధిప!
134
క. అన విని జనమేజయుఁ ‘డ | మ్ముని యిట్లు హితోపదేశముం జేసినఁ బాం
డు నృపాగ్రతనయుఁ డెమ్మెయి | ననఘ! తొడఁగె నశ్వమేధ యాగంబునకున్‌?’
135
క. అని యడిగిన వైశంపా | యనుఁ డాతని కిట్టు లనియె; నప్పుడు కుంతీ
తనయాగ్రజుండు తమ్ములఁ | గనుఁగొని యుత్సాహలక్ష్మి కనుఁగవ నొప్పన్‌.
136
సీ. ‘వ్యాసమహాముని వత్సలత్వంబున | నానతి యిచ్చిన మాననీయ
వాక్యంబు వింటిరె? వసుధ యిత్తఱి వసు | హీనయై యున్నది; దానఁ చేసి
భూదేవ నిహిత ధనాదాన మావశ్య | కంబయ్యె; దాని శక్యత్వమును హి
మాచల యాత్రా సమాచరణ ప్రకా | రమును విచారణీయములు గావె?
 
ఆ. యనుడుఁబవన తనయుఁ డతనితో నీశ్వరుఁ | బరమ నియతిఁ గొలిచి, కరుణ వడసి
ప్రమథగణము నెల్ల భక్తిఁ బూజించి, య | త్తలమునందు భూతబలు లొనర్చి.
137
క. తెత్తము గాక నరేంద్ర! మ | రుత్తకలితమైన దానరూపము సుమహో
దాత్త స్థితి నున్న కనక; | మిత్తఱి నిలదెసఁ దలంప నేటికి మనకున్‌.
138
వ. అప్పనికి సముచిత సైన్య సమేతంబుగా దేవర విజయంచేయవలయు’ ననిన నర్జునుండును గవలును నట్ల పలికిరి; దానికి ధర్మనందనుండు ప్రియంబంది, కృతనిశ్చయుండయి, ధృతరాష్ట్రు కడకుం జని, యశ్వమేధ యాగోపక్రమోత్సవ శ్రవణంబునం బుత్త్రులం దలంచి శోకసంతాప సమాక్రాంతుండయి యున్న యన్నరపతి చరణంబుల కెఱంగి, వేదవ్యాసు వచనంబులు గాంధారియు వినుచుండ నతనికిం జెప్పి, యతనిచేత నయ్యజ్ఞాచరణంబునకు ననుజ్ఞ వడసి యయ్యిరువురను దండ ప్రణామపూర్వకంబుగా వీడ్కొని, గొంతిపాలికిం బోయి, సంతోష వికచవదనయయి యున్న యద్దేవి యధ్వర విధానంబునకు ననుమతి సేయం దదీయ పాదంబులకుం బ్రణమిల్లి, తదామంత్రితుండై యాస్థానమండపంబునకు నరుగుదెంచి, యుయుత్సు రావించి కార్యంబు తెఱంగెఱింగించి నీవు నగర రక్షకై నిలువుమని నెయ్యంబలర విదుర సమేతంబుగా నిలిపి, బలంబుల సంఘటింపం బడవాళ్ళం బనిచి, నియతుండయి. సురపితృ పూజనంబులు దీర్చి, మహేంద్రార్చనం బొనర్చి మహితావధానుండై. 139
క. నానావిధ బహుళాంచిత | దానము లొనరించి యర్చితం బగు నగ్నిన్‌
దాని యధికారి ధౌమ్యుం | దాను బ్రదక్షిణ విధాయితం గొలిచి తగన్‌.
140
క. సిత లేపన సితభూషణ | సితమాల్య సితాంబరములఁ జెన్నుగ సమలం
కృతుఁడై సితాతపత్ర | ప్రతతి మెఱయఁ బూర్ణచంద్రు పగిది వెలుఁగుచున్‌.
141
వ. షోడశ శ్వేతాశ్వ వ్యూఢ రథారూఢుండై. 142
క. భూదైవత దత్తాశీ | ర్వాదంబులుఁ బుణ్యగానరవములు; రోదో
మేదుర మంగళ తూర్యని | నాదంబులుఁ జెలంగ, బుధజనస్తుతు లెసఁగన్‌.
143
చ. వెడలెడు నమ్మహీవిభుని వేడ్క యెఱింగి, వృకోదరుండుఁ గ
వ్వడియును బిన్నతమ్ములును వైభవ మొప్ప నలంకరించి యె
క్కుడు మెఱయం, బ్రధాన భట ఘోటక దంతి రథ ప్రతానముల్‌
దడిగలుఁ గుంచెలుం గొడుగు తండములున్‌ విలసిల్ల వచ్చినన్‌.
144
క. కని యా నృపుఁ డలఁతి నగవు | నినుపారెడు చూడ్కి వారి నెమ్మొగములపైఁ
దనుపారుచుఁ బొలయం, జనఁ | జన రాజులు గూడుకొనిరి సైన్యంబులతోన్‌.
145
వ. ఇవ్విధంబున నరిగి యక్కురువంశవరుఁడు సముచిత ప్రయాణంబుల గిరి సరిదరణ్యంబులు గడచి, హిమశైలంబు సేరి, ధౌమ్యాది పురోహితులఁ బురస్కరించికొని, తదీయ తలం బధిష్ఠించి, యొక్క యుచిత ప్రదేశంబున విడిసె; నట్టియెడ. 146
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )