పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుండు సకలబంధు సహితుండై కరినగరంబునకు వచ్చుట (సం. 14-65-1)
వ. అరసికొనియుండి యప్పాండవాగ్రజుండు యాగంబున కుద్యోగంబు చేయుట చారులు చెప్ప నాకర్ణించి, కుతూహ లోన్నిద్రుండై, బలభద్ర సాత్యకి కృతవర్మ ప్రద్యుమ్న చారు (థే) దేష్ణ సాంబాది యాదవ సమేతంబుగా వసుదేవదేవకీ సమనుజ్ఞాతుండై, సుభద్రం దొడ్కొని కరినగరంబున కరుగుదెంచిన, ధృతరాష్ట్రుండును గాంధారియు గొంతియుం బనుప నుత్సుకుండై యుయుత్సుండు విదురుం బురస్కరించికొని యప్పాంచజన్యధరు నెదుర్కొని, పరమ భక్తిం దోడ్కొని వచ్చిన. 161
తే. మున్ను ధృతరాష్ట్రుకడకు నా వెన్నుఁ డేఁగి | యతని గాంధారిఁ బ్రణతి పూర్వాతి మధుర
వాక్యములఁ బ్రీతి నొందించి వచ్చి, గొంతిఁ | గాంచి ప్రణమిల్ల నద్దేవి గౌఁగిలించి.
162
వ. పెక్కుభంగుల దీవించె; బలదేవాదులుం దగిన తెఱంగున నప్పాండురాజ మహిషిం గని; రక్కులపాలికా తిలకంబు పులకంబులం బెరిఁగిన మేనితో మాననీయచరిత్రుం డగు నద్దేవకీపుత్త్రు సంభావించి. 163
క. ప్రమద మెసఁగ విదురుఁ బనిచి, సముచిత మగు నర్చనంబు సంకర్షణ పూ
ర్వము గాఁగ నడపి యదు నిక | రము నర్చలు సంభృతాదరంబున నడపెన్‌.
164
వ. సుభద్ర తన్నుం గనినం బరమప్రియంబున గారవించి, యభ్యంతర మందిరంబునకుం బుచ్చెఁ; బద్మనాభ ప్రభృ తులగు నా బంధుజనంబు నెల్లను నగరుచేరువ శోభిల్లుమందిరంబుల విడియింప యుయుత్సునియోగించె; నట్లయ్యందఱు నభినందితులై యున్న సమయంబున. 165
ఉ. ఉత్తర పుణ్యగర్భముననుండి భవజ్జనకుండు పూరువం
శోత్తరుఁ డాది రాజగుణయోగి పరిక్షితుఁ డుద్భవించినన్‌
జిత్త మెలర్పఁ బు త్త్రుఁడని చెప్పిరి వెల్పలివారి కింటిలో
నత్తఱి నున్న వృద్ధ సతు; లార్చె జనం బఖిలంబు నుబ్బునన్‌.
166
క. బాలుఁడు మృతజాతుం డని | యాలోనన యేడ్పు బెరయ, నలమట నచ్చో
నాలలన లుగ్గడించినఁ | దేలిరి శోకమున జనులు ధీరవిచారా!
167
వ. అత్తఱి రోదనధ్వనులు గలయం జెలంగిన విషాద వేదనాయత్తం బయిన చిత్తాంగంబుతో శౌరి సాత్యకి యను గమనంబు సేయ, సత్వరంబుగా గొంతి యున్నెడకుం జనుదెంచె; నప్పు డా కుంతిభోజనందనయు ద్రౌపదియు సుభద్రయు నార్తనాదంబు లెసంగం దనకడకు రయంబునరా నెదుర నయ్యదువీరుండు గాంచి, శోకసమాకుల మానసుం డయ్యె; నప్పాండురాజపత్ని పురుషోత్తముతో డగ్గుత్తిక నెలుంగు దవుల నిట్లనియె. 168
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )