పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము
వ్యాసుఁడు హిమవత్పర్వతంబున నున్న పాండవులకడకు వచ్చుట (సం. 14-64-1)
శా. బాలార్కద్యుతి పుంజ పింజర జటాభారంబుఁ బ్రావృడ్ఘన
శ్రీలీలం బ్రహసించునంగమును, రోచిస్ఫార దండంబు ను
న్మీలన్నీల మృగాజినాంబరము నై, నిర్వాణదాన క్రియా
శీలుం డైన పరాశరాత్మజుఁడు విచ్చేసెం గృపాలోలుఁడై.
147
వ. ఇట్లు సన్నిహితుండయిన వేదవ్యాస మునీశ్వరునిఁ బాండవులు పరమభక్తింబ్రణామ పూర్వకంబుగాఁ బూజించి, ‘కర్తవ్యం బెయ్యది! యానతిం’ డనిన, నమ్మాననీయుం ’ డెల్లి మీరెల్లవారును ద్ర్యంబకపూజలు చెల్లింపవలయు; నేఁటిరాత్రి నియతులై దర్భసంస్తరణంబుల శయనించునది’ యని నియోగించిన. 148
ఆ. రమ్యమైన చప్పరంబుల దర్భసం | స్తరణములను, యాగ సదనమునఁ బ్ర
భాసమానములగు పంచాగ్నులును బోలె | నమ్మహాత్ము లుండి రధిపముఖ్య!
149
వ. అట్లుండి యవనీసురాశీర్వాదంబుల నాదరించుచు నారేయి గడపి, కల్యం బగుటయుం గాలోచిత కరణీయంబులు నిర్వర్తించి, సర్వక్రియా కలాప నిర్వహణ ధుర్యుండగు పారాశర్యుండు వనుప ధౌమ్యప్రముఖ పురోహిత సహాయ మహనీయ సమాచారులగు పాండవేయులు పరమస్థండిలంబునం బార్వతీపతి నావహించి, యుత్కృష్టంబులును బహుళంబులు నగు | గంధపుష్ప ధూప దీపంబులం బూజించి, సమంచిత మనోహారి భూరి పాయసాది భవ్యద్రవ్య భార మహోదారంబగు నైవేద్యంబు సమర్పించి, వేఱువేఱ ప్రధాన ప్రమథులకుఁ దద్గణంబులకు నర్చలిచ్చి, కుబేర మాణిభద్ర ప్రభృతి భూతయక్షజనంబులను సభక్తికావాహన కలితులం గావించి, పూజనంబు లాచరించి. 150
క. రక్షాకర మంత్ర కలన | దక్షాత్మకు లైనయట్టి ధౌమ్య ముఖోదా
త్త క్షోణీసురులు బెరయ | నక్షయపుణ్యుఁ డగు కౌరవాధిపుఁ డెలమిన్‌.
151
క. అనుజులుఁ దానుఁ బరాశర | తనయ పురస్సరముగా నిధాన స్థలికిం
జని, యరుణ గంధ కుసుమము | లను మాంసాపూపములను లాజములఁ దగన్‌.
152
ఆ. భూతతృప్తిఁ జేసి భూరి బలాఢ్యులఁ | బరిజనములఁ ద్రవ్వఁ బనుచుటయును
నతి కుతూహలమున నార్చి వారలు ద్రవ్వి | రన్నిధానదేశ మధిపముఖ్య!
153
క. త్రవ్వినఁ బ్రభలెల్ల దెసల | నివ్వటిలఁగ వెలుంగుచుండె నిధి; యనిలజుఁడుం
గవ్వడియుఁ గవలు నలరఁగ | నవ్వసుధాధిపుఁడు దాని కర్చన లిచ్చెన్‌.
154
వ. అట్లు వివిధ విద్యానిధి యగు వేదవ్యాసుండు సన్నిధిచేసి, యప్పెన్నిధి సాధించిన, నా ధర్మనందనుం డా పరాశర నందను పాదంబులకు దండప్రణామంబు చేసి, కేలు మొగిడ్చి ఫాలతలంబునం గదియించి, వినయావనతుండై యున్న నన్నరేంద్రు నమ్మునీంద్రుండాలింగ నాశీర్వాదంబుల నాదరించి, యామంత్రణంబు సేసి యంతర్హితుం డయ్యె; నమ్మానవనాథుండు, 155
సీ. శకట ఖరోష్ట్ర ఘోటక కుంజరంబు ల | నేక సహస్రంబు లెలమి సంఘ
టించి, భారంబు లెత్తించి భారవహత్వ | దక్షజనుల్‌ పెక్కులక్ష లర్థిఁ
గదిసి యే నే నని కడఁగి మోపఁగ యాగ | నిలయంబు కలపయుఁ గలశములును
నలఁకులు గాఁగులు నాదిగాఁగల భాండ | ములును బీఠములు శయ్యలును ఱోళ్ళు
 
తే. రోఁకళులుఁ జట్టువంబులు స్రుక్సువాజ్య | పాత్ర దండకమండలు దాత్రములును
లోనుగాఁ గల వస్తువుల్‌ శుద్ధి హేమ | మయము లొక్కట నడపించె మనుజనాథ!
156
చ. మఱియును సన్నిధిం గల సమంచిత కాంచనరాశి బండులం
బెఱికల మోపులం గొలఁది వెట్టఁగఁ బెక్కగు బారువుల్‌, జనుల్‌
వెఱఁగుపడంగ ఖేచరులు వెక్కస మందఁగ, శత్రుకోటికిన్‌
వెఱ పొనరించువార్త పృథివిం బరఁగన్‌ నడపించె భూవరా!
157
ఆ. ఏరునేల కొలఁది నెడనెడ విడియుచుఁ | బోవవలసి యుండె భూరి భార
వహుల డప్పి యెఱుఁగువాఁడగు నా ధర్మ | నందనునకు ధరణినాథవర్య!
158
వ. అంత నక్కడఁ గృష్ణుండు. 159
తే. ద్వారకానగరమునకుఁ దన్నుఁ బుచ్చు | నపుడు ధర్మజుఁ డశ్వమేధాధ్వరంబు
సమయ మగుట ప్రతీక్షించి సకల బంధు | యుక్తముగ రమ్మనిన మధురోక్తి యూఁది.
160
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )